మరుసటి దినము యంత్రము ఇస్తాను అని చెప్పిన ఆయన పోలికలు బట్టి చిరునామా తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి గురువు గారు, ఆయన కూడా ఒక యంత్రము కావాలి అని అడిగిన విషయము చెప్పాను. ఆయన ఒక విశ్వ బ్రహ్మ, తన పనుల తో పాటు, యంత్రములు కూడా తయారు చేసి ఇవ్వటము అలవాటు అని చెప్పారు. ఆయన, నేను ఎవరో తెలియకనే యధాలాపము గా యంత్రము ఇస్తానని చెప్పటము ఏమిటి, అదీ నేను దత్తోపాసకుడిని అని తెలియక పోయినా దత్త యంత్రము ఇద్దామనుకోవటము ఏమిటి, ఆయన కు ఏ దత్త యంత్రము ఇవ్వాలి అని ఆలోచిస్తూ, ఆయనకు తెలిసిన దత్త యంత్రము లలో ఏమి ఇవ్వాలో నిశ్చయించు కొన్నట్లు గా నాకు చెప్పారు. ఆ యంత్రము ప్రతి చూడగానే నాకు యోగము నకు ఉపయుక్తము గా అంగ న్యాస, కర న్యాసము ల తో ఉండటము చాలా ఆనంద పడ్డాను. ఆయన కు మళ్లీ కలుస్తాను అని చెప్పి వచ్చేసాను. ఆ సమయము నకు నాకు దత్త స్వామి మూదు ముఖముల తో కాక ఏక ముఖము తో రెండు చేతులలో దండ కమండలము లతో, దర్శనము ఇవ్వటము జరుగుతోంది. ఏమిటి అందరికి లా కాకుండా ఏక ముఖము తో దర్శనము ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయేవాడిని. కాకినాడ నుంచి మా గురువు గారు పిఠాపురము రావటము, ఆయనను కలిసి ముచ్చటించటము, వెళ్తూ ఆయన చేతిలో కొంత ధనము పెట్టటము జరిగింది. అప్పుడు నా మనసు లో ఈ కార్యక్రమము లో వ్యావహారికము చోటు చేసుకొంది అని అనుకొని శ్రీ గురు దత్తుని కి నమస్కారము చేసుకొన్నాను. ఆ యంత్రము విషయము కొన్నాళ్ళు మరిచిపోయాను. ఒక రోజు మళ్లీ కాకినాడ వెళ్ళాను. గురువు గారు ఒక చోటుకు వెళ్దాము పద అని 2 ఫోన్
నెంబర్లు చెప్పి చేయించి వారు ఇంట్లో లేక పోవటము తో తిన్నగా ఒకరి ఇంటికి
తీసుకు వెళ్లారు. ఆయన ఒక చిత్రకారుడు, వారి ఇంటి నిండా కాన్వాస్ క్లాత్
మీద పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిని చూడ గానే నా గురువు ఐన దత్తాత్రేయుని చిత్రము పెయింట్ చేయించుకొంటే బాగుంటుంది కదా అని అనిపించింది. కానీ నాకు గా నేను ఎలా చెప్పాలి అని మధన పడ్డాను. మా గురువు గారు మాట్లాడటము అయిపోయి పద వెళ్లి పోదాము అనేటప్పటికి మనసు లో ఇంకా సమయము రాలేదు అని అనుకొంటూ మా గురువు గారిని అనుసరించాను. చిత్రము ఏమిటి అంటే నా ముందు నడుస్తున్న గురువు గారు వెనుకకు తిరిగి ఆ చిత్రకారుడు తో శర్మ కు వారి గురువు గారు దర్శనము ఇస్తున్నారు, వారి చిత్ర పటము పెయింట్ చేసి ఇవ్వండి, అతను ఒకేసారి ధనము ఇవ్వలేడు అని చెప్పి వెనుదిరిగారు. శ్రీ గురు దత్తుని కృప కు మనసు లోనే నమస్కరించు కొన్నాను. బయటకు వచ్చి ఇంక నీవు శ్రీ దత్తునే గురువు గా స్వీకరించి సాధన కొనసాగించు, నా ఆశీర్వచనములు ఎప్పుడూ ఉంటాయి అని సెలవిచ్చారు.
Wednesday, 31 December 2014
Tuesday, 30 December 2014
పిఠాపురం - తొలి రోజులు ...............
నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను. అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు. గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి, నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు. ఆయనంతకు ఆయనే మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని, ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ వచ్చని, అదీ కాక నా పరిస్థితులు తెలిసుకున్న వారిలా మీరు నాకు ఏమి ఇవ్వనక్కర లేదు అని దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని పిస్తోంది అని చెప్పారు కాబట్టి సరే అయితే మీ ఇష్టము అని చెప్పాను అని తెలియ చేశాను. గురువు గారు ఒక క్షణము ఆలోచించి అయితే ఒక పని చేయి నాకు కూడా ఒక యంత్రము చేయించు అని అన్నారు. గురువు గారికి ఎలా చెప్పాలో, ఏమి అవుతే అదే అవుతుంది అని మనసు లో అనుకొని, సవినయముగా అయ్యా, మీకుగా మీరు యంత్రము కావాలని నన్ను ఆయనను అడుగమని చెప్తున్నారు, ఆయనకు నేను చెప్పి అయన ఇస్తాను అంటే మీకు ఇప్పించగలను అని అన్నాను. నా సంశయము గురువు గారికి అర్ధము అయి, అవును నీ సాధన లో ఉపయుక్తము కోసము ఆయన ఇస్తానన్నాడు కానీ నీవు ఆయనను అడుగ లేదు కదా, సరే ఒక పని చేయి ఏమి అవాలో అదే అవుతుంది ఆయనను అడిగి చూడు, అలా కానీ పక్షము లో నీకు ఇవ్వబోయే యంత్రము నాకు ఇస్తే నేను నా దగ్గర పెట్టుకొంటాను అని చెప్పారు. ఆ యంత్రము పెట్టుకోవటము వలన ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తే నీ దగ్గర పూజ లో పెట్టు కోవచ్చు. గురువు గారు అలా చెప్పిన తరువాత సరే అలాగే చేస్తాను అని ఒక నమస్కారము చేసి పిఠాపురము వచ్చేశాను.
Monday, 29 December 2014
పిఠాపురం - తొలి రోజులు ..........
అలా ఎదురుగా వస్తున్న ఆయన పూర్తి గా అపరిచితుడు. దగ్గర కు సమీపించి మీరు ఏదో సాధన లో ఉన్నారు కదా, మీ సాధన లో మీకు, మీ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని అనిపిస్తోంది అని అన్నారు. నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. నెమ్మదిగా నేను ఇన్నాళ్లు స్థూల పూజలు చేయ లేదు, మానసికముగా యోగ సాధన ఒకటే చేస్తున్నాను. అదీ కాక ఇంట్లో పూజ లో యంత్రము పెట్టుకొంటే దానికి ప్రత్యేకముగా పూజ చేయాలి కదా, ఒక వేళ అలా చేయలేక పొతే ఇంట్లో మంచిది కాదు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు కదా, మీలో నా గురువునే తలుచు కొంటూ నాకు మనసు లో అనిపించింది చెప్తున్నాను, మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని చెప్పాను. ఆయన కూడా ప్రశాంతముగా మీరు ప్రత్యేకముగా ఏ పూజలు చేయనక్కర లేదు మీకు ఎలా పూజ చేయాలనిపిస్తే అలాగే చేయండి, ఇంకో విషయము ఆ యంత్రము తయారు చేయడానికి అయే ఖర్చు నేనే భరిస్తాను, మీరు పైసా ఇవ్వ వలసిన పని లేదు, మీకు ఎందుకో యంత్రము ఇవ్వాలని పిస్తోంది కాబట్టి ఇస్తున్నాను, మళ్లీ త్వరలో కలుద్దాము అని చెప్పి వెళ్ళిపోయారు. నేను మాములుగా నా దినచర్య లో భాగముగా పాద గయా క్షేత్రమునకు వెళ్లి దత్త దర్శనము చేసుకొని. కొంత సేపు సాధన చేసుకొని ఇంటికి చేరుకొన్నాను. ఒకరిని గురువు గా ఎంచుకున్న తరువాత మన సాధన లో ఏ చిన్న విషయము జరిగినా వారికీ తెలియ చేసి వారు ఎలా చెప్తే అలాగే చేయటము శిష్యుని గా మన కర్తవ్యము కాబట్టి కాకినాడ లో మా గురువు గారికి చెప్పాలని అనుకొన్నాను.
Sunday, 28 December 2014
పిఠాపురము తొలి రోజులు
సాధన లో భాగము గా కాకినాడ నుంచి పిఠాపురము బదిలీ చేయించి శ్రీ గురు దత్తుడు నన్ను తన దగ్గరికి తీసుకొన్న విధానము మీకు అందరికి తెలియ చేశాను కదా! శ్రీ గురు దత్తుని కృపా కటాక్ష వీక్షణములకు పాత్రుడనయినందుకు ఒక సారి మళ్లీ మనసారా నమస్కరించు కొని గురువు గారు ఇక మీద ఎలా నన్ను సాధన లో ముందుకు నడిపించారో సాధకులయిన మీతో పంచుకోటానికి సిద్ధమవుతున్నాను. అప్పటి దాకా గాయత్రీ జపము, శ్రీ గురు చరిత్ర పారాయణము చేసిన నేను, దత్తాత్రేయుని పూజా కార్యక్రమము (షోడశోపచారములతో) మొదలు పెట్టాలనిపించి, శ్రీ దత్తునే మనసులో తలుచుకొని ఎలా పూజా క్రమము అనిపించిందో అలాగే ఒక ప్రతి తయారుచేసుకొని మానసిక యోగ సాధన తో పాటు స్థూల పూజ చేయటము మొదలుపెట్టాను. ఏ కాలమయినా, ఎటువంటి పరిస్తితులయినా, తెల్లవారు ఝామునే లేచి పూజా కార్యక్రమము పూర్తి చేసుకొని ఉదయము 6.00, 6.30 గం. లకు పిఠాపురము లో పాద గయా క్షేత్రము నందు శ్రీ దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహమును దర్శించుకొని అక్కడే సాధన చేస్తుండే వాడిని. నెమ్మదిగా పిఠాపురము లో సాధకుల తో పరిచయము అవటము మొదలయింది. ఊరి మధ్య లో శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానము కార్య వర్గము బ్యాంకు లావాదేవీలకు మా దగ్గరకి వచ్చేవారు కాబట్టి వారి తో కూడా పరిచయము కలిగింది. ఎప్పుడు ఎంతటి మహానుభావులు (దత్త భక్తులు) పొరుగు రాష్ట్రాల నుంచి, శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారమయిన శ్రీపాద శ్రీ వల్లభుని జన్మస్థలమయిన పిఠాపురము వచ్చినా స్వామి ని పాద గయా క్షేత్రములో దర్శించుకొని, శ్రీపాద శ్రీ వల్లభుని సంస్థానము లో బస చేసి పూజా, పారాయణ, సత్సంగ కార్యక్రమము లు జరుపుకొంటున్నా నేను వెళ్లి పాలుపంచుకొనడము ఒక అలవాటుగా మారింది. ఆ విధము గా చక్కటి సాధన జరుగుతూ ఉండేది. ఒక రోజు ఉదయము గుడికి వెళ్తున్న సమయము లో నాకు స్థానికులు ఒకరు ఎదురుగా వస్తున్నారు.
Thursday, 11 December 2014
గురు కటాక్షము .......
కలి యుగములో శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారము, శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలమైన పిఠాపురము లో వృత్తి పరముగా పని చేయుటకు అవకాశము ఇచ్చిన శ్రీ గురు నకు మనసా, వాచా, కర్మణా, ప్రణామములు తెలుపు కొంటున్నాను. ప్రవృత్తి పరముగా నా సాధన లో ఎన్నో రకముల పరీక్షిస్తూ, అనుభవములు ఇచ్చి, నన్ను తన మార్గము లోనికి శ్రీ దత్త స్వామి తీసుకొన్న విధానము ఇంతకు ముందు మీకు తెలియచేశాను. ఏ కొద్ది మంది కైనా, లేక ఒక్కరికి అయినా సాధన లో ఉపయోగపడితే శ్రీ గురుడు దత్తాత్రేయుడు నా జన్మ కు సార్ధకత ఇచ్చి నట్లు గా భావిస్తాను. శ్రీ గురుడు స్మరణ మాత్ర సంతుష్ఠుడు. మనసారా శ్రీ గురుని స్మరిస్తే ఆయన మనను తన వాడిని చేసుకొని మార్గ దర్శకత్వము చేసి సాధన లో ముందుకు నడిపిస్తాడు. ఒక సారి మనను తన వాడు గా చేసుకొన్న తరువాత ప్రారబ్ధ కర్మ లను అన్నింటిని ఒక్క సారే అనుభవింప చేసి కడిగిన ముత్యము లా చేసి, తనంతటి వాడు గా తయారు చేస్తాను అని అంటాడు. ఎంతలా పరిక్షిస్తాడు అంటే ఏ క్షణమైనా ఈ సాధన వద్దు అనుకొని, తనను వదిలి పారిపోయేలా చేస్తాడు. కానీ అన్నిటికి ఓర్చుకొని నిలబడితే మనను త్వరగా దగ్గరకు చేర్చుకొంటాడు. ఎప్పటికి అప్పుడు ఈ మాయా ప్రపంచము నుండి కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక్క సారి మన అందరికి తెలిసిన చిన్న విషయము గుర్తు చేసుకొందాము. మన ఇళ్ళలో పూర్వ కాలములో తిరుగలి ఉండేది కదా, మనలో కొంత మందైనా చూసే ఉంటాము. క్రింద ఒక రాయి దానికి మధ్య లో ఒక చిన్న కొయ్య గురుజు, దాని ఆధారముగా పైన మధ్య లో ఒక చిన్న రంద్రము తో ఇంకొక రాయి, దానికి ఒక ప్రక్కన చిన్న కొయ్య పిడి పట్టుకొని పిండి ఆడుటకు వీలుగా ఉండేది కదా. తిరుగలి పై రాయి మధ్య లో పప్పు వేయించి వేసి మన పెద్ద వాళ్ళు ఆడేవారు గుర్తు వచ్చి ఉంటుంది. మధ్య లో వేసిన పప్పు రెండు రాళ్ల మధ్య లో నలిగి నలిగి పిండి రూపములో చుట్టురా పడేది. అయితే క్రింద రాయి మధ్య కొయ్య బురుజు చుట్టూ కొంత పప్పు అలాగే ఉండి పోతుంది, కానీ ఆ పప్పు ఏ నిముషమైనా గురుజు ను వదిలి రెండు రాళ్ల రాపిడి లో పడితే అది పిండి అయిపోతుంది కదా. ఇక్కడ చిన్న విషయము ఆలోచిద్దాము. ఈ సంసారం సాగరము లో మన అందరమూ నలిగి పోతూనే ఉన్నాము. తిరుగలి లో మాదిరి గా క్రింద రాయి మధ్య గురుజు మాదిరి భగవంతుని కానీయండి, ఒక గురువు ని కానీయండి ఆయననే మర్కట కిశోర న్యాయము గా పట్టుకొంటే, అయన మార్జాల కిశోర న్యాయము గా మనను కాపాడుతాడు. ఏ మాత్రము ఆదమరిచి మనము మాయకు లోబడిపోయామా మళ్లీ ఈ సంసారం సాగరము లో పడిపోతాము, తస్మాత్ జాగ్రత! సదా మెలుకువ తో ఆయననే స్మరించటము మన కర్తవ్యము.
Wednesday, 3 December 2014
గురు కటాక్షము
మా సామాను అంతా పేకేజీ పెట్ల లో సర్దుతూ ఎప్పుడు నేను సర్దుకోవటమేనా, ఎవరూ ఎప్పుడూ సాయము చేయరు కదా అని అనుకొంటూ సర్దటము ప్రారంభించాను. మధ్యాహ్నము 12 గంటలు దాటుతోంది. ఇంతలో ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా రమణ ఆశ్రమములో గది చూపించిన కుర్రాడు తన పెట్టె తో నిలబడి ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయి, అదేమిటి నీవు ఇలా వచ్చావు అని అడిగాను. మేము అక్కడి నుంచి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కదా అని మనసు లో అనుకొన్నాను. అతను సమాధానముగా ఒక చిరు నవ్వు నవ్వి, మిమ్మల్ని చూడాలని అనిపించింది, వచ్చాను అన్నాడు. ఆశ్రమ నిర్వాహకుల దగ్గిరికి అతను వెళ్లి నాకు సెలవు కావాలి, అని అడిగితే వాళ్ళు దేనికి అని అడిగారట. కాకినాడ నుంచి వచ్చారు కదా ఆయన ను చూడటానికి వెళ్ళాలి అనిపిస్తోంది, కాబట్టి సెలవు కావాలి అని చెప్పాడట. అదేమిటి ఈ ఆశ్రమము నకు ఎంతమందో విదేశము ల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ తో పాటు తీసుకు వెళ్తామన్నా వాళ్ళేవరి తోనూ వెళ్ల లేదు, ఎక్కడో కాకినాడ నుంచి వచ్చినాయన కోసము నీవు వెళ్తానని అంటున్నావు, నీకు సెలవు ఇవ్వము అని చెప్పారట. అప్పటికి ఏమీ అనకుండా, మళ్లీ కొంత సేపటి తరువాత వెళ్లి మా అమ్మ గారికి వంట్లో బాగా లేదు, సెలవు కావాలి అని అడిగితె, సరే అని సెలవు ఇచ్చారట. వెంటనే వాళ్ళ అమ్మ గారి దగ్గర కు వెళ్లి, అమ్మా, కొంచెం ధనము కావాలి, నేను కాకినాడ వెళ్ళాలి అని మొత్తము సంగతి వాళ్ళ ఆశ్రమము లో చెప్పినవే మళ్లీ చెప్పాడట. ఆవిడ కూడా ముందు వద్దని, అతని కి కావాల్సిన ధనము ఇచ్చి జాగ్రత్త గా వెళ్లి రా, అని చెప్పి పంపించిందట. ఆ ధనము తో విరుపాక్ష గుహ దగ్గర కొండ పైనించి కొన్ని ఫోటోలు తీసి, రావు అనుకొన్నానో, ఆ లేమినేటేడ్ ఫోటోలు తీసుకొని వచ్చాడు. నా దగ్గర కాకినాడ లో సామానులు సర్ది పెట్టి, పిఠాపురము లో విప్పి మళ్లీ మేము సర్దు కొనేవరకు వారము రోజులు ఉండి వెళ్లేడు. వెళ్ళేటప్పుడు అతనికి బట్టలు పెట్టి నా కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. ఆ తరువాత మాకు ఉత్తర, ప్రత్యుత్తరాలు లేవు. నా గురువే నాకు సాయము పంపించారని శ్రీ గురు దత్తునికి మనసు లో కృతజ్ఞతలు చెప్పు కొన్నాను. ఆ విధముగా నా సాధన లో ఎప్పటికి అప్పుడు దారి చూపిస్తూ, తన దగ్గర కు తీసుకొన్నారు. జై గురు దత్త
Tuesday, 2 December 2014
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ............
ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయము తీసుకొనమని చెప్పినా మనసు చంచలము కదా, శ్రీ దత్తునే గురువుగా ఎంచుకొన్నాను కాబట్టి, పిఠాపురము అయితే సాధనకు ఇంకా ఉపయోగము ఎక్కువ అని అక్కడికే అడగాలి అని అనుకొన్నాను. కానీ వెంటనే ఒక వేళ పిఠాపురము ఇవ్వలేము అంటే ఏమి చేయాలి అని అనిపించింది. అది కాక పొతే, అన్నవరము కూడా దైవ క్షేత్రమే కాబట్టి అది అయితే బాగుంటుందేమో, అని అనిపించగానే మళ్లీ గురువు గారు నీవు ఏమి అనుకొంటే అది అయిపోతుంది కాబట్టి జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయము తీసుకోమన్న విషయము గుర్తు కు వచ్చి, ఒక వేళ పిఠాపురము అయితేనే నేను పదోన్నతి తీసుకోవాలి లేక పొతే తీసుకోకూడదు అని మనసు లో ధృడముగా నిర్ణయించుకొన్నాను. ఇలా అనుకొన్న మరుసటి దినము నన్ను అడిగితే పిఠాపురము అయితే నేను వెళ్తాను అని చెప్పాను. సరే అన్నారు. కానీ సాయంత్రానికి మళ్లీ నీకు పిఠాపురము ఇవ్వడము కుదరదు, అన్నవరము వెళ్తావా, అని అడిగేటప్పటికి నేను ఆశ్చర్యపోయి, పిఠాపురము కాక అన్నవరము అయితే నాకు పదోన్నతి లేక పోయినా ఫరవా లేదు, నాకు అక్కర లేదు అని చెప్పాను. ఇలా జరిగిన విషయములన్ని గురువు గారికి చెప్పగానే, ఆయన యధాలాపము గా నీవు శ్రీ దత్తుని గురువు గా కొలుస్తున్నాను అంటున్నావు, నీకు పదోన్నతి లేక పోయినా, నీ స్వంత ఇల్లు వదిలి పిఠాపురము వెళ్లి ఉంటూ సాధన చేసుకోలేవా? అని ప్రశ్నించేటప్పటికి ఒక్క సారి ఆశ్చర్యచకితుడినై గురువు ఇలాంటి పరీక్ష పెట్టారు ఏమిటి, ఏమి చేయాలి, స్వంత ఊరు, తల్లి తండ్రులు, స్వంత ఇల్లు వదిలి, నా సాధనకు పిఠాపురము వెళ్లి పోవటమా, అన్నింటి కన్నా గురువు కటాక్షము గొప్పది కదా అని అనిపించి, ప్రక్క ఊరు వెళ్లి ఎంత మంది పని చేయటము లేదు, నేను మాత్రము ఎందుకు చేయ లేను అనుకొని, మా గురువు గారితో నేను పిఠాపురము లో ఉంటూ కాకినాడ లో పని చేస్తాను అని చెప్పాను. అయితే ఎప్పుడో ఏమిటి, రేపే వెళ్ళు అని, గురువు గారు అన్నారు. మా వాళ్ళని ఒప్పించి నేను పిఠాపురము వెళ్లి ఉండి కాకినాడ పని చేయటానికి సిద్దమయాను. 1997 జూన్ 26 పిఠాపురము వెళ్ళాను. అక్కడ ఇల్లు వెతుక్కొని నివాసము పూర్తిగా మార్చుకోడానికి సిద్ధమయాను. 2, లేక 3 రోజులు పిఠాపురము నుంచి కాకినాడ కు వచ్చేవాడిని. శ్రీ గురు దత్తుని కృప వల్ల జూన్ 30 నాటికీ, జూలై 1 వ తారీకు న పిఠాపురము కు వెళ్లి పదోన్నతి తో అక్కడ చేర మని బదిలీ చేశారు. నేను సాధనకు నిలబడతానా లేదా అని పరీక్ష చేసి, నా సాధనకు దారి చూపించిన శ్రీ గురు దత్తుని కృపకు నిదర్శనము నకు సదా ఆయన సేవ కే అంకితము అవ్వటము లో అతిశయము ఏముంది.
Monday, 1 December 2014
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము. యోగ సాధన కూడా బాగా సాగుతోంది. మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది. ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి. సమస్యలు పెరుగుతున్న కొద్దీ సాధన ఇంకా ఎక్కువ పట్టుగా సాధన తీవ్రముగా సాగేది. ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి. దానిని బట్టి నా గురువు దత్తుడు నేను ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అని గట్టిగా పట్టుకొన్నాను. నెమ్మది గా, కొన్ని రోజుల కు దత్త స్వామి 3 ముఖములు, 6 చేతులు, ఆయుధములు కనిపించుట మాని, దత్త స్వామి ఏక ముఖము తో 2 చేతుల లో దండ, కమండలము ల తో కనిపించుట మొదలైంది. ఎందుకు ఒక ముఖము తోనే నాకు కనిపిస్తున్నారు , అని ఆలోచించటము మొదలుపెట్టాను. నా సమస్యల వల్ల (బ్యాంకు) ఉద్యోగము లో పదోన్నతి కోసము కూడా ప్రయత్నిచుట మానుకొన్నాను. ఉద్యోగము ఏదైనా దానిని సమర్ధవంతము గా విధి నిర్వహణ చేస్తూ, సాధన ఎంత తీవ్రముగా చేస్తున్నానో అంత భాద్యత గా పని చేసేవాడిని. నా గురువుని తలుచుకొని మంత్రము ఏదైనా, చిన్న దైనా, పెద్దది అయినా దాని సాధన చేసేవాడిని. ఒక సారి ఒక మంత్రము కొన్నాళ్ళు సాధన చేసిన తరువాత, ఎందుకో ఆ మంత్రము నా గుణానికి సంబంధించి నది కాదు అని అనిపించేది. అప్పటి నా గురువు గారు హోమములు చేసేవారు అని చెప్పాను కదా, అలా ఒక సారి హోమము పూర్తి అయిన తరువాత, ఒక గది లో గురువు గారు ఒక మూల, నేను ఒక మూల కూర్చొని సత్సంగము అవుతుంటే, మధ్య లో నన్ను చూసి నీవు ఏదో మంత్రము చేస్తున్నావు కదా, ఆ మంత్రము నీ గుణమునకు సంబంధించి నది కాదు, ఈ మంత్రము చేయి, అని అంత మందిలో ఆ మంత్రము నాకు చెప్పి అది ఇంత సంఖ్య చేసుకో, సిద్ధిస్తుంది అని ఆయన చెప్పారు. ఈ లోపుల గుమస్తా స్థాయి లోనే పదోన్నతి ఇస్తున్నారని నన్ను సిద్ధముగా ఉండమని నాకు చెప్పారు. అప్పటి గురువు గారు నీవు మనసు లో ఏమి అనుకొంటే అది అవుతోంది కదా, జాగ్రత్త గా ఆలోచించుకొని నిర్ణయము తీసుకో అని అన్నారు.
Sunday, 30 November 2014
గురువు - పూర్ణ విశ్వాసము ..........
మరుసటి రోజు తెల్లవారు ఝామునే లేచి మేమంతా తయారు అయి గిరి ప్రదక్షిణ కు సిద్ధము అయాము. గుడి కి వెళ్ళినప్పుడు పాద రక్షలు ఉండ కూడదు కాబట్టి, అవి లేకుండానే బయలుదేరాము. ప్రదక్షిణము లో రమణ ఆశ్రమము నుంచి బయలు దేరి, దారి లో అరుణాచలేశ్వరుడి గుడి కి వెళ్లి స్వామి ని దర్శించుకొని మళ్లీ రమణ ఆశ్రమము నకు చేరుకొంటే ఒక ప్రదక్షిణము చేసినట్లు గా లెక్క అని, మా ప్రక్క ఆయన చెప్పారు. సుమారు 14 కిలో మీటర్లు ఉండ వచ్చు. మాకు మొదటి రోజు ప్రదక్షిణము నకు 6 గంటలు దగ్గరగా పట్టింది. నాకు మాత్రము 2 పాదముల క్రింద నీటి బొబ్బలు వచ్చేశాయి. కాలు తీసి క్రింద పెట్టటము కష్టమయింది. రెండో రోజు కుటుంబాల తో వద్దు, మనము ఇద్దరమే వెళ్దాము అని ఆయన చెప్పారు. అందుకని మేము ఇద్దరమే బయలు దేరాము. పాదముల క్రింద నీటి బొబ్బలు ఉండటము చేత నాకు అడుగు తీసి అడుగు వేయటము చాలా కష్టము అయింది. మా ప్రక్కన ఆయన నాతో పాటు ఓపిక గా నడుస్తూ మంచి విషయములు చెప్తూ 3 లేక 4 గంటల లో నడిపించారు. ఇవాల్టికి 2 ప్రదక్షిణములు చేశాను ఇంకా నడవటము కష్టము, 3 వ ప్రదక్షిణము చేయలేను అని అనిపించింది. రెండవ రోజు మా వాళ్ళు కూడా ఇంక మా వల్ల కాదు మేము అరవింద ఆశ్రమము రాము, మనము వెనకకు వెళ్ళిపోదాము అని పట్టు పట్టారు. చేసేదేమీ లేక నా పాదములు కూడా నడవటానికి నీటి బొబ్బలతో ఇబ్బంది గా ఉంది కాబట్టి గురువు కి మనసు లో క్షమాపణలు చెప్పుకొని వెనుకకు వెళ్ళడానికి సిద్ధము అయాము. రెండవ ప్రదక్షిణము తరువాత ఆశ్రమము లో ధ్యాన మందిరము లో కూర్చొని ధ్యాన మగ్నుడిని అయాను. ఎవరో వెనుక నుంచి ఇక్కడ దాకా వచ్చి 2 ప్రదక్షిణములు చేశావు, ఇక్కడ విరుపాక్ష గుహ చూడవా అని చెవి లో చెప్పినట్లు అయింది. ఈ విషయము మా ప్రక్క ఆయన కు చెప్పాను. దానికేముంది పదండి వెళ్దాము అని ఆశ్రమము లో నుంచే వెనుకకు కొండ మీదే విరుపాక్ష గుహ ఉంది, అందులోనే రమణ మహర్షి గారు కొన్నాళ్ళు ఉన్నారని చెప్పారు. మేము ఇద్దరమూ వెనుక నుంచి కొండ ఎక్కాము, అది మే నెల కాబట్టి కొండ బాగా వేడి ఎక్కి ఉంది. కాలు ఇలా పెట్టానో లేదో 2 పాదముల క్రింద నీటి బొబ్బలు చితికి పోయి ఎర్రగా పుళ్ళు అయి పోయాయి. అలాగే గురువు ను మనసు లో తలుచుకొంటూ కొండ ఎక్కి విరుపాక్ష గుహ లో కొంత సేపు ధ్యానము చేసుకొని అటు ప్రక్కగా దిగి మళ్లీ అరుణాచలేశుని దర్శించు కొని ఆశ్రమము చేరుకొన్నాము. ఆ విధముగా నాకు ఏమి తెలియక పోయినా 3 వ ప్రదక్షిణము కూడా నా గురు కృప వల్ల చేయగలిగాను. కొండ పైనుంచి విరుపాక్ష గుహ నుంచి కొన్ని ఫోటోలు తీశాను గాని, అవి ఎందుకో రావు అని అనిపించింది. ఈ లోపల మొదటి రోజు న ఒక కుర్రవాడు మాకు గది చూపించాడు కదా, అతను మా పిల్లలు స్నేహితులు అవటము చేత మరుసటి రోజు కి వెనుకకు టికెట్లు తీసుకొన్నాడు. 3 వ రోజు ఆశ్రమము దగ్గిర లోనే రామ సూరత్ కుమార్ అని ఒక అవధూత ఉన్నారని తెలిసి ఆయన దర్శనము చేసుకొందాము అని వెళ్ళాము. అ ఆశ్రమము లో ఆయన ఒక పెద్ద హాలులో దూరముగా కనిపిస్తున్నారు. అక్కడి నుంచే దర్శించు కోవాలి, దగ్గరకు అనుమతి ఇవ్వరు అని తెలిసి, అయన కు దూరము నుంచే ఒక నమస్కారము చేసుకొని ప్రక్కన ధ్యానము నకు ఇంకో పెద్ద హాలు ఉంటే, అక్కడకు వెళ్లి ధ్యానము చేస్తూ కూర్చొన్నాము. అ సమయము లో అలా ధ్యానము చేసుకొనే వారిలో, ఎవరినో కొంత మందిని అవధూత దర్శనమునకు పంపిస్తారని తెలిసింది. నా గురువు నే తలుచుకొంటూ మేము ఎలాగూ ఆయన ను చూశాము, పిల్లలకైనా అయన పాద స్పర్శ దొరికితే బాగుంటుంది అని ధ్యానము చేశాను. బయటకు వచ్చేటప్పటికి మా పిల్లలు ఆయన పాదములు ముట్టుకు వచ్చాము అని చెప్పారు. పిల్లలు ముందు హాలు దగ్గరే ఉండి ఆ అవధూత దగ్గరకు ఎవరైనా పంపిస్తారేమో అని నిరీక్షిస్తూ ఉన్నారట, ఈ లోపుల కొంత మందిని పంపిస్తూ వీళ్ళను కూడా లోపలికి పంపించారని చెప్పారు. గురువు కు మనసు లోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నాను. ఆ విధముగా మూడు రాత్రులూ అరుణాచలము లో రమణ మహర్షి ఆశ్రమములో సాధన ముగించుకొని, గురువు మనకు ఎంత వరకు అవకాశమిస్తే, అంత వరకే అని మనసు లో అనుకొని వెనుకకు బయలు దేరాము.
Saturday, 29 November 2014
గురువు - పూర్ణ విశ్వాసము..........
మీరు ముందుగా వ్రాత పూర్వకముగా మాకేమైనా వర్తమానము పంపించారా? అని అడిగారు. లేదు అని అన్నాను. అలా అయితే కుదరదు, మేము గది ఇవ్వలేము, బయట ఎక్కడైనా ప్రయత్నము చేసుకోవలసినదే, అని అయన వెళ్లిపోయారు. అలా ఇంకో ఇద్దరు వచ్చి అలాగే అన్నారు. గురువు మీద భారము వేసి, అయన నామస్మరణ చేస్తూ అలాగే ఆయనే చూసు కొంటాడని ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఇంకో తెలుగు ఆయన, నెల్లూరు నివాసి ఆశ్రమము లో ఉండే ఆయన వస్తే, ఆయన కు నేను 3 రోజులు ఉండి మా గురువు ఆదేశానుసారము వచ్చిన సంగతి చెప్పేటప్పటికి, ఏమి చేయలేను, పెద్దల సిఫారుసు తెచ్చినా, ముందుగా ఆశ్రమము నకు తెలియ చేయక పోతే, గది దొరకటము కష్టము అని చెప్పి, ఇంతకు మీరొక్కరే వచ్చారా ఇంకెవరైనా మీతో ఉన్నారా అని అనే వరకు మేము ఎవరము ఉదయము నుంచి ఏమి తినక పోవటము గుర్తు కు రాలేదు. నాతో పాటు, నా శ్రీమతి, పిల్లలూ కూడా ఉన్నారని ఉదయము నుంచి ఏమి తినటానికి అవకాశము లేక పోయింది అని అన్నాను. సరే, భోజనానికి మాదే చివరి పంక్తి, తరువాత ఇక్కడ భోజనము కూడా దొరకదు, పదండి మీ సామానులు ఆఫీసు లో పెట్టి రండి అని అయన తో పాటే భోజనము పెట్టించారు. తరువాత బయటకు వస్తూ, నా స్వంత భాద్యత మీద మీకు 2 రోజులు గది ఇప్పిస్తాను అని అనగానే, సవినయముగా కృతజ్ఞతలు చెప్తూ, మీరు 2 రోజులు గది ఇప్పిస్తున్నాను అని అంటున్నారు కాబట్టి దయ చేసి 3 రోజులు ఇప్పించండి అని అడిగాను. ఏమి అనుకోన్నారో ఏమో, సరే అలాగే అని 3 రోజులకి గది ఇచ్చారు. ఒక అబ్బాయి ని పిలిచి గది దాకా సాయము చేసి రమ్మనమని చెప్పారు. రాత్రి 10 గంటలు దగ్గరగా అయింది. మేము సంతోషముగా గది కి వెళ్ళే సమయము లో మాకు ఎదురుగా ఒక జంట, వాళ్ళ ముగ్గురు పిల్లల తో ఆఫీసు గది లోకి వెళ్ళటము, గది ని తీసుకొని మా ప్రక్క గది లోకే రావడము అయిపోయింది. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు కాసేపటి లోనే స్నేహితులు అవటము, వారి ద్వారా మా పరిచయములు అవటము, నిముషాల లో జరిగిపోయింది. ఆ ప్రక్క ఆయన నాతో ఇక్కడ తెల్లవారి ఝామునే బయలుదేరి గిరి ప్రదక్షిణ చేస్తారు తెలుసా అని అడిగారు. నాకు ఏ విషయము తెలియదు, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాము అని అన్నాను. అయితే ప్రొద్దున్నే 4 గంటలకే లేచి తెమిలి ముందు గిరి ప్రదక్షిణము చేద్దాము, చాలా రాత్రి అయింది, త్వరగా పడుకోండి అని ఆయన చెప్పారు.
Friday, 28 November 2014
గురువు - పూర్ణ విశ్వాసము..........
శ్రీ సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని శరీరము తో ఉన్నప్పుడు కూడా సేవ చేసుకొన్న వారు అని తెలియచేశాను కదా. అప్పటి నుంచి స్వామి సమాధి అయిన తరువాత కూడా తెల్లవారు ఝామున 4 గంటల కే లేచి కాల కృత్యములు త్వరగా ముగించు కొని స్వామిసన్నిధి కి చేరు కొని, సేవ చేసుకొని 9 - 10 గంటల మధ్య లో వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకొనే వారని, అలా విశ్రాంతి తీసుకొనే సమయము లో ఎంతటి వారు వచ్చినా అయన విశ్రాంతి కి భంగము కలిగించి లేపను అని వారి శ్రీమతి ద్వారా తెలుసుకొన్నాను. అదేమీ చిత్రమో, సాధన లో నా రెండో రోజు 10 - 10-30 మధ్య లో ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సుబ్బరామయ్య గారు అని పేరుతొ పిలిచి, ఆయన శ్రీమతి ని సుబ్బరామయ్య గారిని లేప మని అడిగారు. మాములుగా ఆయన శ్రీమతి వారు విశ్రాంతి తీసుకొంటున్నారు, ఇప్పుడు లేపను, కొంత సేపు ఆగండి అని బదులు ఇచ్చారు. ఫరవా లేదు అమ్మా, మేము భరద్వాజ మాష్టారి శిష్యులమే, మా పేరు చెప్పి లేపితే అయన లేస్తాడు అని ఆ వచ్చిన వాళ్ళు తొందర చేస్తుంటే, తప్పేది లేక శ్రీ సుబ్బరామయ్య గారిని లేపారు. ఆయన వస్తూనే వారిద్దరిని పేర్లతో పలకరిస్తూ, ప్రక్క గది లో ఉన్న నన్ను కూడా పిలిచి నా గురుంచి చెప్పి, నేను తరువాత అరుణాచలము వెళ్ళాల్సిన విషయము చెప్పి, వీలయితే ఎలా వెళ్ళాలో చెప్పమని చెప్పి, వచ్చి కూర్చోమన్నారు. వారి సత్సంగ గోష్టి లో పాలుపంచుకొనే అవకాశము దొరికినందుకు చాలా సంతోషించాను. కాసేపు సత్సంగము అయిన తరువాత, మీరు ఇలా వెళ్తే బాగుంటుంది అని నాకు దారి తెలియ చేశారు. వారికి కృతజ్ఞతలు చెప్పాను. ఇంక రెండో రోజు అక్కడే ఉన్న అవధూత రామి రెడ్డి తాత గారిని కూడా దర్శించుకొన్నాము. మూడో రోజు కూడా నా సాధన ముగించుకొని శ్రీ సుబ్బరామయ్య గారికి మా కృతజ్ఞతలు తెలుపుకొని ముందుకు నా రెండో మజిలి అయిన అరుణాచలము, కాట్పడి మీదుగా ప్రయాణించి చేరుకొన్నాము. ఎక్కడా నిలిచే సమయము లేక మేము ఏమి తీసుకొనకుండానే ప్రయాణము చేశాము. అరుణాచలము లో దిగి ఆశ్రమము చేరు కొనేటప్పటికి సాయంత్రము 6 గంటలు దాటింది. అక్కడికి వెళ్ళిన తరువాత ఆశ్రమ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి మళ్లీ నా విషయము అంతా చెప్పి 3 రోజుల పాటు సాధన చేసుకొనేందుకు గది ఇప్పించ వలసినది గా అడిగాను.
Thursday, 27 November 2014
గురువు - పూర్ణ విశ్వాసము
ఒక రోజున మా గురువు గారు నీవు శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి సన్నిధి లో 3 రోజులు, తరువాత అక్కడ నుంచి అరుణాచలము లో శ్రీ రమణ మహర్షి ఆశ్రమము లో 3 రోజులు, ఆ తరువాత 3 రోజులు పాండిచేరి శ్రీ అరవింద ఆశ్రమము లో, ఉండి సాధన చేయ వలసినది గా ఆదేశించారు. వీలు చూసుకొని నా శ్రీమతి, పిల్లల తో బయలుదేరాను. గొలగమూడి చేరుకొని మొదట గా ప్రదక్షిణములు చేసుకొని స్వామి దర్శించు కోవటానికి నిశ్చయించు కొన్నాను. అది ఉదయము కాబట్టి, మరుగు ప్రదేశములు లేవు కాబోలు అందరూ పరుగులు తీస్తూ హడావుడి గా ఉన్నారు. ఆ హడావుడి చూసి, మా వాళ్ళు ఈ పరిస్థితుల లో మా వల్ల కాదు మమ్మల్ని వెనకకు దింపి మీరు ఒక్కరే వెళ్ళండి అని చెప్పేశారు. ఇదేమిటి ఇప్పుడు ఏమి చేయాలి అనుకొంటూ కనీసము దర్శనము చేసుకొని వెళ్దాము అని వారికి నచ్చ చెప్పుతూ ప్రదక్షిణము నకు ఉద్యుక్తులము అయాము. మనసులో ఏమి చేయాలి అనుకొంటూనే ఉన్నాను. అప్పుడు మా ఎదురుగా ఒక జంట పిల్లల తో వస్తూ కనిపించారు. వారితో మాట్లాడాలి అనిపించి, నేను నా విషయము, సాధనకు 3 రోజుల పాటు వచ్చిన సంగతి చెప్పి, ఇక్కడి పరిస్థితుల గురుంచి అడిగి ఏమి చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఆయన వెంటనే నేను భరద్వాజ మాష్టారి శిష్యుడిని అని చెప్పి ఆయన భరద్వాజ మాష్టారి ఇంకో శిష్యుడు అయిన, శ్రీ పెసల సుబ్బరామయ్య గారి ఇంట్లో ఉన్న సంగతి, ఇంక కాసేపటిలో అ గది ఖాళీ చేస్తున్న సంగతి కూడా చెప్పి, అ గది మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్లి పోయారు. రెండో ప్రదక్షిణము చేస్తూ, ఆయన పేరైన తెలుసుకో లేదు ఏమి జరుగుతుందో అని అనుకొంటూ, ప్రక్కనే ఒక అయన ను ఇక్కడ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు ఎవరు, ఎక్కడ ఉంటారు అని అడిగితే, ఎదురుగా వస్తున్న ఇంకో ఆయనను చూపించి, ఆ వచ్చే ఆయనే అని చూపించారు. వెంటనే వారికి నమస్కరించి నా సంగతి చెప్పాను. ఆయన కూడా ఆనందము గా మీరేనా, మీకు తప్పక మా ఇంట్లో గది ఇస్తాను. మీ వాళ్ళ గురుంచి కంగారు పడకండి, మీ సాధన మీరు 3 రోజులు చక్కగా చేసుకోండి అని చెప్పేటప్పటికి, శ్రీ గురు దత్తుని కృప కు కృతజ్ఞతలు చెప్పు కొంటూ ప్రదక్షిణములు పూర్తి చేసుకొని, వారి ఇంటికి వెళ్లి సామాను పెట్టుకొని ఆ తరువాత అవధూత శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి దర్శనము చేసుకొన్నాము. శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని శరీరము తో ఉన్నప్పుడు కూడా సేవ చేసుకొన్న వారని తెలిసి ఆ 3 రోజులు మంచి సత్సంగము ఉంటుంది కదా అని అనుకొని, , అటువంటి వారితో పరిచయము చేసిన ఆ జంట ఎవరో తెలియదు కానీ, వారికి మనసులోనే కృతజ్ఞతలు తెలియ చేసుకొన్నాను. నా సాధన లో ఇలాంటి సందర్భాలు చాలా సార్లు చోటు చేసుకొన్నాయి. అలాంటి సందర్భాలు అన్నింటి లోనూ శ్రీ గురు దత్తుని కృప కటాక్ష వీక్షణము లకు, నన్ను అడుగు అడుగునా చేయి అందించి, నాకు దారి చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీ గురుని కి కృతజ్ఞతలు తెలుపు కొంటూ, ఆయన సేవ కే నా శరీరము అంకితము. ఆ మొదటి రోజు సాధన చేసి రాత్రి ఆశ్రమము లో ఎక్కడ నిద్ర చేయాలి అని పిస్తే అక్కడే నిద్ర చేశాను.
Wednesday, 26 November 2014
గురువు - శిక్షణ ..........
మా గురువు గారు మాస్టర్ ఇ. కే. గారి శిష్యులు అని తెలిపాను కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ ఉండేవారు. నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల నెమ్మది గా దత్త సంప్రదాయము లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు మా గురువు గారు నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను. బ్రాహ్మి ముహూర్తము లోనే వారందరి కన్నా ముందు లేచి, నేను వారి కాల కృత్యములకు అడ్డు కాకూడ దని త్వరగా తెమిలి నా సాధన నేను చేసుకొంటూ ఉండేవాడిని. అంతకు ముందు శ్రీశైలము వెళ్ళాను కానీ, అక్కడ మందిరము కాకుండా ఇంకా ఆధ్యాత్మిక సాధన చేసుకొనే మఠాలు ఉన్నాయని నాకు తెలియదు. నేను నా సాధన చేసుకొంటూ ఉన్నప్పటికీ వాళ్ళ అందరితో సమానముగా వారి సాధన లో కూడా కలిసిపోయే వాడిని. నాకు తాత్కాలికముగా నిత్య జీవన విధానము నుంచి వీలు దొరికి నా సాధనకు ఎక్కువ సమయము దొరికినందుకు ఎంతో ఆనందము గా ఉండేది. వారు అంతా దగ్గర గా ముందు కూర్చొంటే, నేను కొంచెము వెనుక కూర్చొని ఉండేవాడిని. ఒక రోజు కొంచెం సేపు సాధన చేసి ఇవాల్టికి ఇంక చాలు, ఎవరికి వారు విశ్రాంతి తీసుకొందాము అని వాళ్ళంతా అనుకొన్నారు. ఎందుకో మళ్లీ గురువు గారు చూస్తే ఎక్కడ రమ్మంటారో అని నేను త్వరగా వెళ్ళడానికి సిద్ధము అవుతుంటే, వెనుక నుంచి నన్ను పిలిచి ఆటవిడుపు వాళ్ళ అందరికీ గాని నీకూ నాకూ గాదు, పద నీవే నాకు ఇక్కడ ఏవో ఆధ్యాత్మిక మఠాలు ఉన్నాయిట, అవి నీవే చూపించ గలవట, తీసుకు వెళ్ళు, ఇవాళ నీవే నడిపించాలి అని మా గురువు గారు అనేటప్పటికి నాకు మతి పోయింది. నేను ఏమిటి నా గురువు గారికి మఠాలు చూపించుట ఏమిటి అని ఆశ్చర్య పోయాను. ఇది రెండు దశాబ్దముల క్రిందటి మాట. సరే నేను గురు దత్తుని మీదే భారము వేసి అయన ను తలుచుకొని నీవే నాకు దారి చూపించాలి అని మనసులో అనుకొని నాకు తెలియకుండా మందిరము వెనుక ద్వారమును దాటేటప్పటికి ఒకరు ఎవరో దూరము నుంచి మా వైపే వస్తూ కనిపించారు. వారు మా దగ్గరకు రాగానే మఠాల గురుంచి చెప్పి అవి ఎక్కడ ఉన్నాయో ఎలా వెళ్ళాలో అని అడగగానే పదండి, నేను చూపిస్తాను అని, వారు మాతో పాటు బయలు దేరారు. శ్రీ గురు దత్తుని కృప కు ఎంతగానో ఆనందపడ్డాను. మొదటి గంటా మఠం చూపించి వెళ్లారు. తరువాత విభూతి మఠం. అందులో ఏవో యంత్రములు చెక్కిన ఒక పలక రాయి చతురస్రాకారము లో ఉండేది. అది అప్పటికే ముక్కలు గా ఉండి ఒక దగ్గరికి పేర్చబడి ఉన్నట్లు గుర్తు. విశేషము ఏమిటంటే దాని మీద విభూతి ఒక పొరలా ఏర్పడి ఉంటుంది. ఆ విభూతి చేత్తో తుడుచుకొని తీసుకొంటే మళ్లీ ఒక పొరలా ఏర్పడేది. అందుకు దానికి విభూతి మఠం అని పేరు. సాధు మఠం ఇంకొకటి. అక్కడ క్రింద గుహలు ఉన్నాయి అందులో సాధన చేసుకొంటూ ఉంటారని తెలిసింది. తరువాత సారంగధర మఠం. అదీ చూసుకొని ఇంకా ముందుకు వెళ్తూ, బయలుదేరి నప్పటి నుంచి ఔదుంబర వృక్షాలు చాలా కనిపిస్తున్నాయి గానీ, ఎక్కడా దత్తాత్రేయుని పటము గాని, విగ్రహము గానీ కనిపించుట లేదు కదా, అని అనుకొంటూ నడుస్తున్నాము. అక్కడ ఒక కుగ్రామము ఒక చిన్ని టీ స్టాలు కనిపించే సరికి మా గురువు గారు టీ తాగుదాము అని అన్నారు. టీ స్టాలు దగ్గరకు వెళ్ళేటప్పటికి దత్తాత్రేయుని పటము అక్కడ ఒకటి కనిపించింది. ఫరవాలేదు గురువు గారి దర్శనము అయింది అని నమస్కారము మనసు లోనే పెట్టుకొన్నాను. టీ తాగుతూ దత్తాత్రేయుని గురుంచి వాళ్ళకు ఏమి తెలుసో అని అడిగాను. నా అదృష్టము ఏమో కానీ వారు వెంటనే ఆయనను మేము కూడా కొలుస్తాము అని చెప్పి, ఇక్కడికి దగ్గర లోనే మాకొక ఆశ్రమము ఉంది , అందులో అప్పటికి 14 ఏళ్ళు ముందు నుంచి అఖండ దీపము ఉంది అని చెప్పారు, నాకు వారు ఎంత గొప్ప సాధకులో కదా అని కృతజ్ఞతలు చెప్పాను. వెనుక నుంచి మా గురువు గారు, నీవు అడిగితే ఆ అఖండ దీపము చూపిస్తారు, అడిగి చూడు, మనము కంటి తో చూడవచ్చు అని అన్నారు. అడగటమా మానడమా అని తర్జన భర్జన చేస్తూ గురు దత్తుని మీదే భారము వేసి, వారిని ఆ దీపము చూపిస్తారా, నేను కూడా శ్రీ గురు దత్తుని కొలుస్తున్నట్లు చెప్పగానే, అదేమిటి అడగటానికి అనుమానము ఎందుకు, పదండి అని, దగ్గర ఉండి వారి ఆశ్రమము నకు తీసుకు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద పాక, అందులో చిన్న పాక, అందులో అఖండ దీపము చూపించి మీరు ధ్యానము చేసుకొని రండి అని వెళ్లారు. అ దీపము ముందు ఒకరు మాత్రమే కూర్చొని ధ్యానము చేసుకొనే వీలు ఉండడము వల్ల, ఒకరి తరువాత ఒకరము ధ్యానము చేసుకొని తిరిగి బయలుదేరాము. ఔదుంబర వృక్షాలు ఒకటే కనిపిస్తున్నాయి, గురువు గారి పటము గాని, విగ్రహము గని కనిపించుట లేదు అని బాధ పడుతూ ఉంటే, పటము తో పాటు, అంత కన్నా అమూల్యమైన అఖండ దీపాన్నే చూపించిన శ్రీ గురు దత్తుని కృప కు ఇంకో తార్కాణము కావాలా! గురువును పూర్ణ విశ్వాసముతో కొలిస్తే సాధన లో ఎలా దారి చూపిస్తారో కదా.
Sunday, 23 November 2014
గురువు - శిక్షణ
నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము కాకుండా, ఐదవది, విలక్షణమైన అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది. 'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని వాడు, 'వ' అంటే గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త' అంటే సదా తత్వ చింతన చేస్తూ, మౌనము గా ఉండేవాడు ఈ లక్షణములు ఉన్నవాడు అవధూత అని అర్ధము. ఇంకా విపులముగా తెలుసుకోవాలంటే అవధూతోపనిషత్తు లో అన్ని ఉన్నాయి. అవధూత యొక్క దర్శనము, స్పర్శనము, సంభాషణము మనకు దొరికినట్లయితే , మన జన్మ ధన్యమైనట్లే. అటువంటి అవధూత శ్రీ గోపాల్ బాబా గారి తో నాకు అనుభవము అవటము నా పూర్వ జన్మల సుకృతమే కదా! తరువాత మా గురువు గారి కి అన్ని విషయములు తెలియ చేశాను. ఆయన కూడా ఈ సారి మనము తప్పకుండా వెళ్దాము అని అన్నారు. మేము బయలు దేరిన రోజు ప్రకృతి మమ్మల్ని ఆశీర్వదిస్తోందా అన్నట్లు చిన్న గా వాన చినుకులు అప్పుడు అప్పుడు పడుతూ వాతావరణము చాలా ఆహ్లాదకరము గా ఉంది. మేము తుని వెళ్లి అక్కడ నుంచి నర్సీపట్నము బస్సు ఎక్కి వెళుతుంటే కోటనందూరు దాటి బలిఘట్టము ఇంక దగ్గర కు వచ్చేస్తున్నాము అని అనుకొంటూ ఉంటే , దారిలో బస్సు లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. రహదారి కొంత మేరకు కొట్టుకు పోయింది. ఎటు బస్సులు అటే అని అంతా అనుకొంటున్నారు. మా గురువు గారు కూడా నేను సిగరెట్టు కాల్చుకొని వస్తాను అని బస్సు దిగారు. ఇంక ఇవాల్టికి పని అవదేమో అని ఇలా అనుకొన్నానో లేదో, క్రిందకు దిగిన మా గురువు గారు లోపలి కి వచ్చి గురువు గారు నడిచి వెళ్ళమంటున్నారు, పద అని అనగానే మా లగేజి తీసుకోని నడుస్తూ బయలుదేరాము. సుమారు 10 కిలోమీటర్లు దాటి ఉంటుందేమో త్వరగా వెళ్ళాలి అని నేను కొంచెం వేగంగా అడుగులు వేస్తుంటే, వెనక నుంచి మా గురువు గారు, నీవంత వేగంగా నడిస్తే నేను రాలేను, మెల్లగా నడు అని అన్నారు. చేసేది లేక ఎప్పుడైతే అప్పుడే అవుతుంది అని అనుకొన్నాను. చివరకు మేము బలిఘట్టము చేరుకొన్నాము. కొండ ముందు నుంచి మెట్లు ఉన్నాయి అని నేనంటే నేను అంత దూరము నడవ లేను ఇటి నుంచే వెళ్దాము అని గురువు గారు అన్నారు. కొండ క్రింద ఈ వైపు ఇంకొక గురువు గారి ఆశ్రమము, బ్రహ్మలింగేశ్వర స్వామి పురాతన మందిరము దాటి కొండ ఎక్కడము మొదలు పెట్టాము. కొంత దాకా గురువు గారు ఎక్కి ఇంక నా వల్ల కాదు, ఇంక ముందుకు వద్దు వెనక్కు కాకినాడ వెళ్లి పోదాము అని అన్నారు. అడుగు అడుగు నా ఈ పరీక్షలు ఏమిటి అని లోపల అనుకొని, నిలబడండి నేను ముందు ఏదైనా దారి ఉందేమో చూస్తాను అని కొంచెం పైకి ఎక్కి చూస్తే, చిన్న నడక దారి ప్రక్కనే కనిపించింది. శ్రీ గురు దత్తుని కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని, క్రిందకు దిగి మా గురువు గారికి చేయి ఇచ్చి పైకి లాగి ఆ ఇరుకు కొండ దారిలో ఆశ్రమమునకు చాలా మటుకు దగ్గరికి వచ్చేశాము. సుమారు 400 మెట్లు అని చెప్పాను కదా ఇలా దగ్గర దారి లో కష్ట పడి ఎక్కితే కేవలము 30, 40 మెట్లు తో ఆశ్రమము పైకి చేరుకొన్నాము. అక్కడ కూడా గురువు గారు నేను విశ్రాంతి తీసుకొంటాను నన్ను లేప వద్దు అని అయన పడు కొన్నారు. గురువు చెప్పినది చేయడము తప్ప శిష్యుని కి వేరే దారి లేదు. ఈ మార్గము లోకి వచ్చిన తరువాత మన జీవితము మన చేతుల లో లేదు, ఏమి జరిగినా అంత మన మంచికే అని పూర్ణ విశ్వాసము ఉంచి మనము నడిస్తే తప్పక గురువు లు ఎవరైనా దారి చూపించి మనలను గమ్యము చేరుస్తారు అని అర్ధమవుతోంది కదా! అ తరువాత మా గురువు గారు లేవటము, ఆ గురువు గారి తో మాట్లాడటము, తదుపరి కార్యక్రమముల గురుంచి నిశ్చయించు కోవటము అన్ని సజావుగా అయిపోయాయి. ఇద్దరు గురువులు మాట్లాడు కోవటము, అ సమయము లో మధ్య మనము ఉండటము మన అదృష్టము. అలాంటి అవకాశములు మనము (సాధకులు) జాగ్రత్త గా ఉపయోగించుకోవాలి.
అవధూత దర్శనము
శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి, అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది. ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది. ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము నాకు తెలిసి ఉండటము చేత మా గురువు గారికి చెప్పాను. ఆయన నేను నీతో వస్తాను, మనము వెళ్లి వద్దాము అని అన్నారు. గురువు గారి తో వెళ్లి రావటము అన్నది మంచి విషయమే కదా అని అనుకొన్నాను. 2 రోజుల తరువాత, గురువు గారు నాకు రావటము వీలవదు, నీవు వెళ్లి రా, అని అనగానే ఇంక ఎవరిని తీసుకు వెళ్ళటము అని ఆలోచించి, ఇంకొక ఆప్త మిత్రులు సాధకులు అయిన శ్రీ ములుకుట్ల కృష్ణ మూర్తి గారికి చెప్తే ఆయన సంతోషముగా ఒప్పుకొన్నారు. ఇద్దరమూ కలిసి నర్సీపట్నం దగ్గరలో ఈ బలిఘట్టము వెళ్లి అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి కి చేరుకొన్నాము. అప్పటికి సాయంత్రము అయి పోయింది కాబట్టి రాత్రికి అక్కడే బస చేద్దాము అని అనుకొన్నాము. ఈ ప్రదేశమునకు చేరుకొనే లోపుల నా దృష్టి ఎందుకో ప్రక్కకు లాగి నట్లయి చూస్తే, అక్కడికి దగ్గరలో ఇంకొక కొండ మీద తెల్లటి భవనము ఆ సాయంసంధ్యా సమయములో మెరిసిపోతూ అక్కడకు రమ్మనమని పిలుస్తున్నట్లే అనిపించింది. నాతో వచ్చిన అయన కూడా దత్త భక్తుడే కాబట్టి ఆ విషయము ఆయనకు తెలియచేసాను. ఇవాళకు ఇక్కడ ఉండి, రేపు ఉదయము అక్కడికి వెళ్దాము అని అన్నారు. మా అదృష్టము ఏమిటి అంటే అక్కడ శ్రీ గోపాల్ బాబా అనే అవధూత ఉన్నారు. అయన తో నిద్ర చేసే అవకాశము దొరికినందుకు చాలా ఆనందము అయింది. మేము శ్రీ గురు చరిత్ర పారాయణము కొంత సేపు చేసిన తరువాత అక్కడి ఆశ్రమ నిర్వాహకులు అయిన చిన్న బాబు గారు ఆ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి, అక్కడ ప్రవహిస్తున్న ఉత్తర వాహిని అయిన కాలువ గురుంచి, అప్పటికి అక్కడ ఉన్న అవధూత శ్రీ గోపాల్ బాబా గారి గురుంచి విపులముగా చెప్పి మాకు అల్పాహారము ఏర్పాటు చేయించి పెట్టింఛిన తరువాత వారు, వారి ఇంటికి వెళ్ళిపోయారు. నాతో వచ్చిన ఆయన నాకు నిద్ర వస్తోంది అని పడుకొన్నారు. దత్త సంప్రదాయము లో అవధూత ల దర్శనము చేసుకోవటమే అదృష్టము అనుకొంటే వారితో నిద్ర చేయటము ఇంకా అదృష్టము అని తెలిసి ఉండుట చేత, నేను నిద్ర పోకుండా ఆయననే చూస్తూ మనసు లో గురు దత్త నామ స్మరణ చేస్తూ ఉండగా అయన నా వైపు చూసి ఒక సిగరెట్టు ఇచ్చి కాల్చు అన్నట్లుగా చూసారు. అప్పటికి అవధూతలు వారి అంతటికి వారు ఏమైనా ఇస్తే అది తీసుకొని వారు చెప్పినట్లు చేయాలి అని నాకు తెలియకపోవుట వలన, నా మనసు లో నాకు ధూమ పానము అలవాటు లేదు కదా అని అనుకొని గోపాల్ బాబా గారికి నమస్కారము చేయగానే, ఆయన ఫరవా లేదు నాకు ఇచ్చిన సిగరెట్టు వెలిగించి నాకు ఇచ్చేయి అన్నట్లు గా సంజ్ఞలతో చేసి చూపించారు. ఆయన చెప్పినట్లు చేసి ఆయనకు ఇస్తే దానిని పూర్తి గా దమ్ము లాగారు. అవధూత లు మన యొక్క కర్మలను కొంత వరకు అ విధము గా భస్మము చేస్తారని తరువాత తెలిసింది. గోపాల్ బాబా గారు ఎవరితోనూ ఎప్పుడు మాట్లాడరు. మనకు అర్ధము కాని ఏ భాష లోనో వారిలో వారు మాట్లాడు కొంటూ ఉంటారు. మనకు ఏమైనా చెప్పాలని పిస్తే మనకు అర్ధమయేలా చెప్తారు. నాకు కొన్ని సూచనలు చేసారు. అలా రాత్రి అంత గడిపి ఉదయముననే మా కాల కృత్యాలు తీర్చుకొని ఆయనకు దూరము నుంచే నమస్కారము చేసుకొని మేమిద్దరమూ క్రిందటి రోజు సాయంత్రము చూసిన ఆ భవనము వైపు బయలు దేరి చుట్టూ ప్రవహిస్తున్న ఉత్తర వాహిని ని దాటుకొని కొండ క్రిందకు చేరుకొన్నాము. 400 మెట్ల దాకా ఉన్నాయి, అవి ఎక్కి కొండ పైకి చేరుకొన్నాము. అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ అ గురువు గారి శిష్యుడు కౌపీనము తో ఉండి చక్కగా రైల్వే స్టేషన్ విశ్రాంతి గదుల లో ఉండే కుర్చీ లాంటి పెద్ద కుర్చీ లో రెండు కాళ్ళు చాపుకొని ప్రశాంతము గా శ్రీ క్రిష్ణ ధారావాహిక చూస్తొన్నారు. అంత దూరము నుంచి వస్తే కనీసము మన వైపు చూడకుండా హాయి గా ఎలా చూస్తున్నారో అని అనుకోవటము ఏమిటి, వెంటనే విధ్యుత్ సరఫరా ఆగి పోయింది. అప్పుడు మమ్మల్నిద్దరినీ చూసి ఎక్కడ నుంచి వచ్చారు, ఏమిటి విషయము అని అడిగారు. నేను నా విషయము క్లుప్తముగా చెప్పేటప్పటికి, అయన వెంటనే నీ లాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను అని మా ఇద్దరికీ కాఫీ ఇచ్చి, మీ గురువు గారిని తీసుకోని మళ్లీ ఒక సారి తప్పక రమ్మనమని చెప్పారు. వాళ్ళ గురువు గారు చిద్గగనానంద స్వామి అని, ఆయన, పాకలపాటి గురువు గారు, బెండపూడి సాధువు గారు ముగ్గురు సమ కాలీనులు అని, వారి గురువు గారు చుట్టూ పక్కల ఏజన్సీ గ్రామ వాసులలో చాలామందికి ఉపనయనము చేసి వాళ్ళ పేర్లకు ఆచారి నామములు కలిపి గాయత్రీ మంత్రము ఉపదేశించారు అని, అ ఆశ్రమము అధీనములో 10 ఆశ్రమములు ఆంధ్రప్రదేశమందు, ఒకటి బెంగళూరు లో కూడా ఒకటి ఉన్నట్లు, వారి ముఖ్య శిష్యుల లో భూమానంద మొదటి వారని, ఇప్పుడు ఈ ఆశ్రమము ను మిగిలిన శిష్యులు ఎవరూ పట్టించుకోని విషయము, ఆశ్రమము పరిస్థితి గురుంచి మీ గురువు గారి తో మాట్లాడాలి, తప్పక మీ గురువు గారిని తీసుకొని రమ్మని చెప్పి మమ్మలిని సాగనంపారు.
Friday, 21 November 2014
ఏకోన్ముఖ సాధన
నాకు దత్తాత్రేయ వజ్ర కవచము నిత్యమూ చదవటము, శ్రీ గురు చరిత్ర నిత్య సప్తాహ పారాయణము కూడా ఒక అలవాటు అయింది. నెమ్మది గా మనసు లో ఇన్ని విధములు గా ఇంత మంది దేవీ దేవతలను మనము కొలవ వలసి ఉందా, ఎవరో ఇష్టమైన ఒకే దేవుడు నో, దేవతనో మనస్పూర్తి గా కొలిస్తే ఫలితము ఎక్కువ కదా! అని అనిపించటము మొదలైంది. ముందు యుగాల లో ఎక్కువ మంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు కానీ పూజా విధానము లు తక్కువ. భగవంతుడు నిరాకారుడు కదా! తరువాత తరువాత అందరూ ఎక్కువ కాలము తపస్సు చేస్తూ ఉండ లేక నెమ్మది గా భగవంతునికి లేదా భగవతికి వివిధ రూపాలు కల్పన చేసి విగ్రహ పూజా విధానము అమలు లోకి తెచ్చారు. ఆ పని అవాలంటే ఆ దేవుడి ని, ఈ పని అవాలంటే ఈ దేవత ని, పూజ చేయాలి అని మొదలు పెట్టారు. ఇంక అక్కడ నుంచి ఈ దేవుడు ముఖ్యము ఆ దేవత ముఖ్యము, ఇద్దరి లో ఎవరు ముఖ్యము అంటూ విధానము లో చీలికలు మొదలైంది. ఈ విధమైన ఆలోచనలు నాలో మొదలై, ఎవరో ఒకరినే నమ్ముకొని నా సాధన కొనసాగించాలి అని నిర్ణయించు కొన్నాను. ఆ ఒక్కరూ ఎవరో ఎందుకు దత్త స్వామి నే కొలిస్తే సరి పోతుంది కదా అని అనుకొన్నాను. అప్పుడు నా దగ్గర ఉన్న దత్త మంత్ర సుధార్ణవము చదివిన తరువాత దత్తాత్రేయునే కొలవాలని ధృడముగా మనసు లో నిశ్చయించుకొని ఏకోన్ముఖ సాధన మొదలు పెట్టాను. ఆయన నే మానసికము గా గురువు గా నిశ్చయించు కొని నా సాధన కొనసాగించాను. శ్రీ దత్తుని గురువుగా నిశ్చయించు కొన్నతరువాత నా సాధన క్రొత్త మలుపు తిరిగింది. యోగానికి మూలము శ్రీ దత్తుడు అయితే యోగ ప్రకాశకుడు శ్రీ కృష్ణుడు. అయితే ఇద్దరు కూడా బహు కొద్ది మంది కి మాత్రమే యోగము చెప్పినట్లుగా మనకు పుస్తకముల ద్వారా విశదము అవుతున్నది. నేను శ్రీ దత్తుని గురువు గా నిశ్చయించు కోవటము లో, నాకు యోగము గురుంచి వచ్చే సూచనలు కూడా ఇంకా ఎక్కువ బలము చేకూరింది. ఈ రకముగా చేసుకొంటూ ఉండగా శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము గురుంచి మీకు తెలియచేసాను కదా, ఆ పుస్తకమును ఎలా అయినా ఒకటైనా సంపాదించాలి అని వెంటనే మచిలీపట్నము వెళ్ళాను. వారినీ వీరినీ అడుగుతూ శ్రీ పోతాప్రగడ సుబ్బారావు గారి ఇంటికి చేరుకొన్నాను. అ సమయానికి వారి కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు. వారు వారి అబ్బాయి తప్ప, అందరూ ఇంటి ముందు ఉన్న కార్లలో ఎక్కి సిద్ధముగా ఉన్నారు. నన్ను చూడగానే ఏ మాత్రమూ విసుగు లేకుండా ఏమిటి బాబు నాతో ఏమి పని అని అడిగారు. సమయము తక్కువ కాబట్టి వారికి నేను శ్రీ గురు దత్త వైభవము పుస్తకము కోసము వచ్చిన విషయము నేరుగా తెలియచేశాను. వెంటనే ఆ పుస్తకము మళ్లీ పునర్ముద్రణ వేయించ లేదు, అని వారి అబ్బాయిని ఏమైనా ఒకటి ఉంటే వెతికి ఇమ్మని చెప్పారు. కానీ ఒక్కటి కూడా లేదు అని వారి అబ్బాయి చెప్పగానే ఆయన తనది అని వ్రాసుకొని సంతకము చేసుకొన్న పుస్తకము నా చేతిలో పెట్టేటప్పటికి వారికి వారి గొప్ప తనానికి నా మనసులోనే నమస్కారము చేసుకొని, శ్రీ గురు దత్తుని కి నా మీద ఉన్న దయ కు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొంటూ బయటకు వచ్చి తిరుగు ప్రయాణము నకు సిద్ధమవుతూ ఉండ గా, నాకు కొంచం దగ్గరలో ముందు ఒక ఉన్మత్తుడు నవ్వుతూ నా వైపు చూస్తూ వెళ్తుంటే నా గురువు నన్ను ప్రత్యక్షముగా ఆశీర్వదిస్తున్నారా అని అనిపించి చాలా ఆనందము కలిగింది. శ్రీ గురు దత్త వైభవము ఒక పుస్తకమైనా సంపాదించాలి అని అనుకొంటే, ఏకముగా ఆ పుస్తక సంకలన కర్త చే తన పుస్తకమునే తన చేతుల మీదుగా అంద చేయించిన నా గురువు అయిన శ్రీ గురు దత్తుని కృప కు నిదర్శనము కాదా! (జై గురు దత్త)
Thursday, 20 November 2014
సాధనా క్రమము
నెమ్మది గా నా సాధన కొనసాగుతోంది. ఆ మధ్య లో మా చుట్టము ద్వారా దత్తోపాసకులైన శ్రీ విట్టల్ బాబా గారిచే వెలువరించ బడిన శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము శ్లోక, తాత్పర్యముల తో సహా ఉన్న పుస్తకము నా చేతికి అందింది . అ పుస్తక ప్రాశస్త్యం అప్పట్లో నాకు అంత తెలియక ఒక ప్రక్కన పెట్టాను. శ్రీ గురు చరిత్ర పారాయణము ప్రతి దినము చేస్తూనే ఉన్నాను. అలాగా కొన్నాళ్ళు చేసే సరికి నా సోదరుడి స్నేహితుడు నా తమ్ముని ద్వారా నేను పారాయణము చేస్తున్న సంగతి తెలుసుకొని అతను నా దగ్గర కు వచ్చి శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము ఇచ్చి ఇది మీరొక సారి చూసి ఇవ్వండని ఇచ్చి వెళ్లి పోయాడు. అప్పటికి మా గురువు గారు ఇచ్చే సూచనలు మేరకు నా యోగ సాధన కూడా చేస్తూనే ఉన్నాను. సందర్భము గుర్తు లేదు కానీ అన్నవరము దాటి వెనుకకు కాకినాడ కు వస్తున్న సమయము లో కొండ కన్నా చాలా ఎత్తుగా దత్త స్వామి లీల గా కనిపించారు. మనసు లోనే ఆయనకు నా నమస్కారములు తెలియ చేసుకొన్నాను. ఆ తరువాత ఇంటికి వచ్చి శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము చూసి చదివి, చాలా బాగుంది, ఇలాంటి పుస్తకము మన దగ్గర ఉండాలి అని అనిపించింది. మా తమ్ముడి స్నేహితుడు రావటము, అ పుస్తకము తీసుకు వెళ్ళటము అయి పోయింది. ఇచ్చే ముందు ఆ పుస్తకము ఎవరి ద్వారా వెలువడిందీ, అ చిరునామా వ్రాసు కొని ఉంచు కొన్నాను. ఆ పుస్తకము మచిలీపట్టణం లో ఉన్న శ్రీ పోతాప్రగడ సుబ్బారావు గారు అనే ఆయన తన మణి పీఠం ద్వారా శ్రీ గురు దత్తుని ఉపాసనా క్రమము అంతా తెలియ చేసారు. కొన్ని రోజులకు మిగిలిన పుస్తకములు సర్దుతూ ఉంటే శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము అనే పుస్తకము మళ్లీ కనిపించేసరికి, అ పుస్తకములో ఏమి ఉన్నదో అని దానిని పూర్తిగా చదివి, దాని లో కూడా యోగానికి సంబందించిన విషయము లను చూసి నా పూజ కార్యక్రమములో దిన చర్య గా చదువటం మొదలు పెట్టాను. ఒక రోజున గాయత్రీ జపము చేస్తున్నప్పుడు నన్ను ఒక చోట స్థిరముగా ఆసనము మీద ఉండనీ కుండా విపరీతమైన ఉష్ణము ఇబ్బంది పెట్టింది. ఆ రోజు అనుకోకుండా నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా జపము మానే ప్రశక్తి లేదు అని మనసు లో ధృడముగా నిశ్చయించుకొని బలవంతముగా దొర్లుతూ పూర్తి చేశాను. మళ్లీ మరుసటి రోజు పూజా కార్యక్రములతో పాటు మిగిలినవి పారాయణములు అన్నీ మాములుగా జరిగినవి.
Wednesday, 19 November 2014
మాతృ దేవో భవ
ఏ ప్రాణి కైనా మొదటి గురువు తల్లి కదా! మది లో బాధ పడకుండా ఎన్నో రకముల ఊడిగములు చేసి పెంచుతుంది. తరువాత గురువు, తండ్రి. ఈ దేహము, విజ్ఞానము, ఇచ్చి ఇహ పరములకు దారి చూపించేది తండ్రి. తరువాత గురువు (ఆచార్యుడు), తల్లి, తండ్రి తో పాటు మనము ఏ విధముగా ఈ సమాజములో జీవించాలో బోధనా పధ్ధతి లో మనకు అంద జేస్తాడు. అందుకే ఈ మగ్గురికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులు గా ఉండాలి అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. గురువు గారు అంటే మనలో గూడు కట్టు కొన్న అజ్ఞానము ను రూపు మాపి వెలుగు ను చూపించే వారు. అంతటి ముఖ్యమైన గురువు ను అన్వేషించుట ఎలా! మన అన్వేషణ లో, మనము ఎవరి దగ్గరకు వెళ్లిన తరువాత మన మనసు ప్రశాంతత పొందుతుందో, వారే మన గురువు గా ఎంచుకోవాలి. లోకము లో ఎంతో మంది గురువులు ఉన్నారు. అంతమంది లో స్వానుభవము ఉన్న గురువు దొరుకుతే మనకు చాల మంచిది. ఆయన గురువు కాదు సద్గురువు అని పిలవబడతాడు. ఇప్పుడు గురువుల లో చాలా మంది నాలుగు పుస్తకములు చూసి బాగా చదివి నేను గురువు ని అనుకొంటూ తమ వెంట శిష్యులను తిప్పుకొంటూ ఉండటము మనము చూస్తూనే ఉన్నాము. వారు చదువుకొన్న విషయము బాగా ఆకళింపు చేసుకొని దాని లో అనుభవము సంపాదించి ఆచరణ లో పెట్టి అప్పుడు అ అనుభవములు శిష్యులకు చెప్తే వారి సాధన లో ఎంతో ఉపకరిస్తూ ఉంటాయి . మన పూర్వ జన్మ సుకృతుము లచే మనకు మంచి సద్గురువు లభిస్తాడు. అలా గురువు లభించిన తరువాత త్రికరణ శుద్ధి గా అంటే మనో వాక్కాయ కర్మల చే ఇంకో సంశయము అన్నది లేకుండా ఆయన ను నమ్మితే, ఆయన మనలను జాగ్రత్త గా ముందుకు నడిపిస్తాడు. ఇది శిష్యులు గా మన పని అనుకొందాము. ఇంక గురువు ల దగ్గరకు వస్తే వాళ్ళు కూడా మనము ఎలా అయన కోసము అన్వేషించామో, అదే విధముగా సరి అయిన శిష్యుడు కోసము ఆయనా వెతుకుతూనే ఉంటాడు. గురు శిష్యుల వెతుకులాట అనాది నుంచీ జరుగుతున్నదే. గురువు తనకు తాను ఒక గురువునీ, అని అనుకొంటే అతని సాధన అక్కడ తో ఆగిపోతుంది. తనకు తాను ఎల్లప్పుడూ నేను విద్యార్ధినే, అని అనుకొంటేనే తన సాధన జరుగుతూ ఉంటుంది. తన సాధన చేస్తూ తను ముందుకు నడుస్తూ తన శిష్యుని కి మార్గము చూపిస్తూ ఉండాలి. తాను ఒక మార్గదర్శిని అని మాత్రమే అనుకొంటూ ఉండటము చాల ముఖ్యము. అయితే ఇక్కడ శిష్యుడు తను మాత్రము గురువు ను గురువు గానే ఎంతో శ్రద్ధ తో అయన చెప్పినట్లు నడుచుకోవాలి. అప్పుడు తనకు వచ్చే సూచనలు వల్ల తన సాధన సజావుగా సాగుతూ ఉంటుంది. ఒక వేళ గురువు చెప్పిన విషయములో ఏదైనా తప్పు ఉంటే ఆ దోషము గురువుకే గాని శిష్యుడు గా నమ్మి చేయుట వలన తనకు ఏ దోషము ఉండదు.
గురువు - రక్షణ
మనము నమ్ముకొనే దైవమును కానీ గురువును కానీ ఎవరినైనా కానీ పూర్ణ విశ్వాసము తో నమ్మి ఆయననే అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని అనాలి. అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు. ఈ విషయము ఒక సారి పరిశీలిద్దాము. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది. ఆ సమయము లో కోతి పిల్ల, కోతి కడుపుని పట్టుకొనే ఉంటుంది. పొరపాటున కోతి పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే, కోతి క్రిందకు దిగి రాదు. కోతి పిల్ల తనకు తాను పైకి ఈ కొమ్మా, ఆ కొమ్మా పట్టుకొని తన తల్లి దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే వరకు పై నుంచి చూస్తూనే ఉంటుంది. అలాగే శిష్యుడు కానీ, భక్తుడు కానీ తనకు తాను గానే, భగవంతుడు కానీ గురువు కానీ ఎవరి దగ్గర కైనా అనన్య శరణాగతి తో చేరుకోవాలి. ఒక సారి మనము పట్టుకోవాలే గాని గురువు, భగవంతుడు ఎవరైనా వారి కృపా కటాక్ష వీక్షణములు మన మీద ఎప్పుడూ కురిపిస్తూనే ఉంటారు. మనము గురువు గారితో మర్కట కిశోర న్యాయము గా ఉన్నట్లయితే, అప్పుడు కాదు, ఎల్ల వేళలా, ఆయన మార్జాల కిశోర న్యాయము గా మనను చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మార్జాల కిశోర న్యాయము ను కూడా ఒక సారి పరిశీలిద్దాము . పిల్లి తను పిల్లలు పెట్టిన తరువాత, ఆ పిల్లలను జాగ్రత్త గా తన ముని పంటి తో సుకుమారము గా తన చిన్న పిల్లల మెడను పట్టుకొని సురక్షితమైన ఏడు (7) ప్రదేశముల లో మారుస్తూ పెంచుతుందని మన అందరికి తెలిసిన విషయమే. అలాగే గురువు తన శిష్యులను తన పిల్లల తో సమానముగా ఒక కొడుకు గా చూస్తూ మంచి చెడులు చెప్తూ శిష్యుడు ఉన్నతి కి దారి చూపిస్తూ ఉండి, తనంత వాడుగా, వీలయితే తన కన్నా పెద్ద వాడు గా అయి ఇంకో పది మందికి ఉపయోగపడేలా చేయాలనీ చూస్తూ ఉంటాడు. గురువు గారి లో లోపము ఏమి ఉండదు, పట్టుకొన్న మనము ఎంత దాకా ఆయన చెప్పిన విషయములు శ్రద్ధ గా పాటిస్తున్నాము అని మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కూర్మ కిశోర న్యాయముగా ఆయన (గురువు గారు) ఎప్పటికప్పుడు మనను చూస్తూ ఉంటారు. అది ఎలాగంటే తాబేలు తను పిల్లలు పెట్టిన తరువాత సముద్రపు ఒడ్డున ఇసుకలో పెట్టి కప్పి దాని మీద తను కూర్చొని ఉంటుంది. పిల్లలు తాము బయటకు వచ్చిన తరువాత వాటి అంతటికి అవే నడక నేర్చు కొంటూ ఉంటే దూరము నుంచి నేను మిమ్ములను జాగ్రత్త గా చూస్తూనే వున్నాను, ధైర్యముగా ముందుకు నడవండి అని తన చూపు తోనే వాటికి ధైర్యము చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా వెనుక తమను చూసే వాళ్ళు ఉన్నారని ధైర్యముగా నడుస్తూ ఉంటాయి . ఆ విధముగా గురువు కూడా తన దృక్ దీక్ష తో శిష్యులను కాపాడుతూ, ధైర్యము గా తన శిష్యులు ముందుకు నడిచేలా చూస్తూ ఉంటాడు .
Monday, 17 November 2014
సాధనా క్రమము ..........
మిర్యాలగూడ లో శ్రీ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఉన్న వారము రోజుల లో సాయంత్రము సమయములలో నేను అనుకొన్న విధముగా సత్సంగములు జరుగుతూ ఉండేవి. ఒకరికి ఒకరము సాధనా విషయముల మీద, సద్గ్రంధము ల గూర్చి విశ్లేషణ చేసుకొనే వారము. ఈ విధముగా వారము రోజులు అయిపోయిన తరువాత శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇక్కడికి దగ్గర లో కీసరగుట్ట లో ఒక ఆశ్రమము ఉంది అని, ఒక మహానుభావుడు తను ఉన్నతమైన స్థితి లో ఉద్యోగములో ఉండి కూడా దానికి రాజీనామా చేసి ఆ ఆశ్రమము ను స్థాపింఛి అందులో వివిధ కార్యక్రమములు చేస్తున్నారని చెప్పి మీరు ఆయనను చూద్దామని అనుకొంటే తీసుకు వెళ్తాను అని అన్నారు. పెద్దలను కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడము సాధన కు మంచిదని తలచి వెంటనే సరే అన్నాను. ఇద్దరమూ అయన దగ్గరకు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికే అక్కడ చాల మంది ఉన్నారు. మేము కూడా కూర్చొన్నాము. మమ్మలిని చూడగానే దగ్గరకు రమ్మనమని పిలిచారు. నా వివరములు తెలిసిన తరువాత, అయన, నేను దగ్గరగా ఒక గంట సేపు, చుట్టూ ఇంకా చాల మంది మాట్లాడటానికి ఉన్నారన్న విషయము కూడా మరచిపోయి, ఆయన శిష్యులు గుర్తు చేసే వరకు కబుర్లలో పడి పోయాము. నా గురువు అయన ద్వారా ముందు జరగబోయే విషయములు (సాధన గురించే) ఏమి ఎలా చేయాలో హెచ్చరించారు. ఆ విషయము ఏమిటంటే, నాయనా, నీ సాధన బాగా జరుగుతోంది. నీతో పాటు పది మందికి ఉపయోగ పడే సాధన చేస్తున్నావు. నీవు సగము లో ఉన్నావు మిగిలిన సగ భాగము పూర్తి చేయగల సామర్ధ్యము నీకు ఉన్నది, అయితే మధ్యలో నీకు కొన్ని మెరుపులు కనిపిస్తాయి, వాటిని లక్ష్య పెట్టకుండా మూలానికి చేరుకొనే ప్రయత్నము చేయి తస్మాత్ జాగ్రత! అని అయన ద్వారా చెప్పారు. ఇలా చెప్పటము, అయన శిష్యులు వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పటము జరిగి పోయింది. బాహ్య వాతావరణము లోనికి రాగానే, నీకు మంచే జరుగుతుంది, నీవు వెళ్ళే ముందు ఈ ఆశ్రమము లో సాయిబాబా మందిరము కట్టాము, దత్తాత్రేయుని మందిర నిర్మాణము చేద్దామని అనుకొంటున్నాము. మా వాళ్ళు దత్త విగ్రహ ప్రతిష్ఠ జరగ పోయే స్థలము చూపిస్తారు, అ ప్రదేశములో నీవు ఒక్కసారి ధ్యానము చేసి రా అని అన్నారు. ఆనందముగా ఆ ప్రదేశమునకు వెళ్ళాను. అది ఎండా కాలము, మే నెల అక్కడ కొండ ప్రదేశము కాబట్టి కొండ రాయి బాగా వేడి మీద ఉంది. నాతో పాటు ఉన్న వెంకటేశ్వర్లు గారిని చూసి, మీరు నాతో చేస్తారా అని అడిగాను. అయన ఈ ఎండలో నా వల్ల కాదు అని అనగానే, సరే సాయిబాబా మందిరము లో కూర్చోండి అని చెప్పి, స్వామి నాకు కదా చేయ మని చెప్పారు అని అనుకొని ఆ ఎండలో రాయి మీద కూర్చొని ధ్యానము చేయటము మొదలు పెట్టాను. ఒక నిమిషము లో ఆసనము క్రింద వేడి పోయి, నేను గాని నీటిలో కూర్చొన్నానా అనే భావన కలిగి, చేత్తో తడిమి చూస్తే ఆ ప్రదేశము వేడి గానే తగిలింది. అక్కడ నా ధ్యానము ముగించుకొని వెళ్ళే ముందు రమ్మన్న విషయము గుర్తు కొచ్చి అయన దగ్గరకు వెళ్ళ గానే, నీకు ధ్యానము బాగా కుదిరిందా, ఏమైనా అనుభవము అయిందా అని నవ్వుతూ వెళ్లి రా! నీకు అంత మంచే జరుగు తుంది అని అన్నారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర్లు గారిని ఒక సారి మాత్రమే కలిశాను. ఆ విధముగా సాధన లో ఎవరినైతే ఉద్దేశించి చేస్తున్నామో వారిని ధృడ చిత్తము తో ఆశ్రయిస్తే, మనము ఎవరి దగ్గరకు వెళ్లితే వాళ్ళ లోనే ఆయన ద్వారా మన సందేశము మనకు అందుతుంది. ఇది నా పూర్ణ విశ్వాసము.
Sunday, 16 November 2014
సాధనా క్రమము
నేను గురువు గారు చెప్పినట్లుగా పుస్తకములు తీసుకొని మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను. ఎవరింట్లో చేయాలో వారింట్లో ఉండడానికి అవకాశము లేక పోవుట వలన, ఇంకొకరి ఇంట్లో ఉండి యజమాని ఇంట్లో హోమము చేయ వలసి ఉంటుంది అని మా గురువు గారు చెప్పారు. మిర్యాలగూడ వెళితే నన్ను శ్రీ లంక వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వారి ఇంటికి తీసుకు వెళ్లి వారము రోజుల పాటు ఆతిధ్యము ఇచ్చి ఆయనే వారము రోజులు దగ్గర ఉండి ఎవరింట్లో హోమము చేయవలసి ఉందో, వారి ఇంటికి తీసుకొని వెళ్తారు అని చెప్పారు. అయన మంచి ఆధ్యాత్మిక కార్యక్రమముల లో ఉన్నవాడు అని కూడా తెలిసింది. నాకు ఆ వారము రోజులు మంచి సత్సంగము ఉంటుందని సంతోషించాను. ఒక ప్రక్కన గురువు గారి మీద పూర్ణ విశ్వాసము ఉన్నా, మరొక ప్రక్క మానవ సహజ మైన ఆతృత తో హోమము ఎలా చేస్తానో అని, ఒక రకమైన డోలాయమాన పరిస్థితి లో హడావుడి గా బయలుదేరాను. నేను ఇంటి నుంచి బయలుదేరి నప్పటి నుంచి ఏదో విపరీతమైన బరువు మోస్తున్న భావన తో ఇంటి దగ్గరలో ఉన్న బస్సు నిలుపు స్థలమునకు చేరుకొన్నాను. నేను వెళ్ళేది మంచి పనికి కదా ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఆలోచించుట మొదలు పెట్టాను. వెంటనే నాకు మనసు లో హోమము చేయుటకు కావలసిన పుస్తకము పెట్టుకొన్నానా లేదా అని సంశయము వచ్చి, వెంటనే నా బ్యాగ్ లో చూసుకొంటే, అసలైనది ఆ పుస్తకమే లేదు. అది లేకుండా నేను వెళ్ళినా ప్రయోజనము లేదు, కాబట్టి గురువు గారే నన్ను ఆందోళన కు గురి చేసారని అర్థం చేసుకొని, ఇంటికి వెళ్లి ఆ పుస్తకము తీసుకొని మళ్లీ బయలుదేరాను. ఇప్పుడు మనసు తేలిక అయింది. గురువు మీదే పూర్తి భారము వేసి ఫలితము మీద అపేక్ష లేకుండా అయన చెప్పిన కార్యక్రమము త్రికరణ శుద్ధి గా చేయడము ఒకటే మన కర్తవ్యము అని అర్ధము అవుతోంది కదా ! ఆయనను నమ్ముకొంటే ఆయనే నడిపిస్తాడు. ఆ విధముగా నేను మిర్యాలగూడ చేరుకొన్నాను. అక్కడి నుంచి నన్ను నడిపించేది శ్రీ లంక వేంకటేశ్వర్లు గారే. వారి కుటుంబ సభ్యులు నిస్వార్ధముగా చూపిన ఆదరణ నాకు మార్గ దర్శకము అయింది. అక్కడి నుంచి ఎవరింట్లో హోమము చేయాలో వారి ఇంటికి తీసుకు వెళ్ళటము, హోమము వారము రోజుల పాటు చేయడము మొదలు పెట్టడము, దానితో పాటు, ప్రణవ సాధన కూడా ఆమెకు నేర్పి ఎలా చేయాలో చూపించి, శ్రద్ధగా చేస్తే గురు దత్తుని దయ వలన నీవు మాములు స్థితి కి రాగలవు అని చెప్పాను. గురు దత్తుని దయ వలన హోమము మొదలు పెట్టిన రోజే ఆమెను హోమము దగ్గర కూర్చో వలసినది గా ఆమె కు చెప్తే, ఆమెను బలవంతముగా ఆమె భర్త ఇంకొంత మంది పట్టుకొని కూర్చోపెట్టారు. హోమమైన వెంటనే ఎలా వుంది అని ఆమె ను అడిగితే, కాళ్ళ లో నరములు చురుక్కు మన్నట్లుగా ఉంది అని ఆమె చెప్పింది. అ తరువాత మూడో రోజు, ఇవాళ నడిచి చూపిస్తేనే నేను హోమము చేస్తానని నాకు తెలియకుండానే ఆమె కు చెప్పాను. ఆశ్చర్యము ఏమిటంటే, 14 ఏళ్ళ నుంచి చక్రాల కూర్చొనుటకు అలవాటు పడిన ఆమె, తన శక్తి నంత కూడ గట్టుకొని గోడలు పట్టుకొని గది అంతా నడిచి చూపించిన తరువాతే నేను హోమము చేశాను. ఆ విధముగా వారము రోజులు హోమము చేసిన తరువాత నేను బయలు దేరే ముందు నేను చెప్పిన పధ్ధతి లో ప్రణవ సాధన చేసినట్లయితే త్వరలోనే మాములు స్థితి కి వస్తావు అని చెప్పి వచ్చేశాను. అ తరువాత వాళ్ళు ఎవరో నేను ఎవరో అంతే. గురువు చెప్పినట్లు చేయడమే గాని మనకు కర్తృత్వ భోక్తృత్వములు ఉండ కూడదు అని అర్ధము చేసుకొన్నాను.
Saturday, 15 November 2014
ప్రాణాయామము ........
ఒక్కొక్క గురువు వారి వారి అనుభవముల బట్టి, లేదా వారి గురువులు చెప్పిన విధముగా ప్రాణాయామము అంటే రేచక, పూరక, కుంభక క్రియలు రక రకాలుగా ఫలానా నిష్పత్తి లో ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ గురు కృప వలన నేను ప్రణవ సాధన లోనే ప్రాణాయామము అవుతుందని తెలుసుకొన్నాను. ప్రణవము అకార, ఉకార, మకార, నాద, బిందు, కళాత్మకము అని తెలుసుకొన్నాను. ,నేను మాత్రము గురు వాక్యంతు కర్తవ్యం అని సంపూర్ణమైన నమ్మకము తో నాకు వచ్చిన సూచనల ప్రకారము, అకార ఉకార మకారములు ఉచ్ఛారణ తక్కువ సమయము ఉంచి నాద స్థితి లో ఎంత వరకు ఉండ గలనో అంత వరకూ ఉండి శరీరమును ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టకుండా సాధన చేసే వాడిని. శరీరము లో నాడులు కొంత వరకు సాగే గుణము ఉంటుంది అని మనకు తెలిసిన విషయమే కదా! వాటి పరిధిని మించి సాగ తీస్తే అవి దెబ్బ తినే అవకాశము ఉంటుంది. ఆ ప్రకారముగా ప్రణవ సాధన చేస్తే, మన శరిరము ఆరోగ్య వంతమై యోగ సాధన కు అనుకూలము అవుతుంది. యోగ సాధన లో ప్రణవ సాధన మొదటి మెట్టు. ముందు సాధకుడు తాను స్వయముగా సాధిస్తేనే కదా ఇంకొకరికి ఉపయోగ పడగలడు. ఈ రకమైన ప్రణవ సాధన కాక ఇంకొక రకమైన ప్రణవ సాధన అంటే అకారములో తక్కువ సేపు ఉండి ఉకారములొ ఎక్కువ సేపు ఉండి మకారములో వెంటనే ఆపి నాద స్థితి కి అసలు వెళ్లక చేసే సాధన తనకు గాక తన చుట్టూ ఉన్న పర్యావరణ కాలుష్యము పోయి, సమతుల్యత కు ఉపయోగ పడుతుంది అని తెలుసుకొన్నాను. మనసును, శ్వాసను, ప్రణవ సాధన తో సమన్వయించి నియంత్రించ గలమని నాకు మా గురువు నుంచి వచ్చిన సూచన. ప్రాజ్ఞులు మన్నింతురు గాక. నేను ఈ రకముగా సాధన చేసే సమయములో ఒక నాడు మా గురువు గారు, నాయనా, నీవు మిర్యాలగూడ వెళ్ళ వలసి ఉంది, అక్కడకు వెళ్లి ఒకరి ఇంట్లో నీవు వారము రోజులు పాటు హోమము చేయ వలసి ఉంటుంది అని చెప్పారు. వెంటనే ఆనందముగా సిద్ధమయాను. ఎవరి ఇంట్లో చేయాలో ఆ యజమానురాలు 14 సంవత్సరముల నుంచి కాళ్ళు రెండు పని చేయక చక్రాల కుర్చీ లోనే ఆవిడ జీవనము సాగిస్తోంది, వాళ్ళకు 14 ఏళ్ళ కుమార్తె ఉంది అని చెప్పి ఏ రకమైన మంత్రము తో హోమము చేయాలో కూడా మా గురువు గారు చెప్పారు. గురువు మీద భారము వేసి నేను మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.
Friday, 14 November 2014
ప్రాణాయామము
ప్రాణికోటికి ఈ భూమి మీద నివసించాలి అంటే శ్వాస అన్నది ముఖ్యము. శ్వాస అన్నది ఉచ్చ్వాస నిశ్వాసల తో కూడి ఉన్న విషయము మన అందరికి తెలిసినదే. మన చుట్టూ ఉన్న గాలి లో ప్రధానమైన వాయువులు ఐదు, అవి వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వాయవులు, ఉప వాయవులు ఐదు, అవి వరుసగా నాగ, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయ అని ఉప వాయువులు. ఇవన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఈ శరీరమును నడిపిస్తూ ఉంటాయి. శరీరమంతకును ముఖ్య ప్రాణము ఒక్కటే. అది చేయు పనిని బట్టి హృదయమందు ఉండి ఉచ్చ్వాస నిశ్వాస రూపమున 'ప్రాణ' మనియు, పాయూపస్థ స్థానముల యందు ఉండి, మల మూత్ర విసర్జనము గావించుచు 'అపాన' మనియు, శరీరమందంతటను వ్యాపించినదై కన్నులు, చెవులు, కాలి మడమలు, పిరుదులు, ముక్కు నను వ్యాపించినదై 'వ్యాన' మనియు, కుత్తుక స్థానమున 'ఉదాన' మనియు నాభి ప్రదేశమున భుక్త పీత అన్న జలములను దేహము నందు అంతటను సమముగా పంచుచూ 'సమాన' మనియు సంచరించు చుండును. ఇంక ఉప వాయువులు ఐదు, కుత్తుక నందు అన్ని వస్తువులను చూచునట్లు చేయుచు, అది కాక వాంతులను పుట్టించుచు 'నాగ' అనియు, కను రెప్పలను తెరుచునట్లు, మూయునట్లును, చేయుచు 'కూర్మ' అనియు తుమ్ము వచ్చునట్లు చేయుచు 'క్రుకర' అనియు, ఆవలింపులు, త్రేనిపులను పుట్టించుచు 'దేవదత్త' అనియు, ప్రసవ సమయమున వెలుపలకు నెట్టునది, ఇది కాక దేహము లో మరణానంతరము కూడా వదలక దహనము వరకూ దేహములో ఉండి దేహమునకు వాపు కలిగించి యుండునది 'ధనంజయ' అనియు పని చేయు చుండును. శ్వాసను ప్రాణాయామము ద్వారా నియంత్రించుట వలన జీవన ప్రమాణము మన చేతిలో ఉంటుందని ఇంతకు ముందు తెలుసుకొన్నాము. ఇప్పడు శ్వాసకు మనసుకు సంబంధము ఏమిటో తెలుసుకొనుటకు ప్రయత్నము చేద్దాము. మనసు నిలకడగా ఉంచ గలిగితే మన ప్రమేయం లేకుండానే శ్వాస ఆగుతుంది, ఇంకో రకముగా చూస్తే శ్వాస ఆగితే మనసు నిలకడగా ఉంటుంది. ఇది పరస్పర అవినాభావ సంబంధం అని మనకు సాధన లో అవగతమవుతుంది. ఇప్పుడు ప్రాణాయామము అంటే ఏమిటో చూద్దాము. ప్రాణ వాయువు శరీరము నకు ముఖ్యమైన ప్రాణము అని తెలుసుకొన్నాము. ప్రాణాయామము లో రేచక, పూరక, కుంభకము మూడు క్రియలు ఉంటాయి. అంటే గాలిని లోపలికి పీల్చుట, వెలుపలకు వదులుట, నిలిపి ఉంచుట, అనే క్రియలను ప్రాణాయామము అని అంటారు.
Thursday, 13 November 2014
మాయా మయమిదం అఖిలం బుద్ధ్వా
అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు కు ఈ దేహము బయట స్వతంత్ర ప్రతిపత్తి లేదు గాని, మన దేహము లో మాత్రము అది మకుటం లేని మహా రాణే. అది మన శరీరము లోపల ఉన్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకొని, రాజాధిరాజు లైన బుద్ధి, ఆత్మలను సహితము పూర్తి గా ముసుగు వేసి కప్పి ఉంచి తన దైన సంపూర్ణ అధికారము తో శరీరము ను ఏలుతూ ఉంటుంది. ముఖ్యము గా జ్ఞానేంద్రియము లను పూర్తి గా వశ పరుచుకుంటుంది. మానవ పరిణామము లో అధో, ఊర్ధ్వ మానసిక స్థాయిల లో కూడా మనసే ప్రధాన మైన పాత్ర వహిస్తూ ఉంటుంది. మనసు అనేది, కన్ను దాని తన్మాత్ర అయిన చూపు ద్వారా, చూసింది అంతా కావాలని అనుకొంటుంది. స్వ పర భేదము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ చరాచర సృష్టి అయిన మాయ తో కలిసిపోయి మన అందరిని ఆడిస్తూ, ఆడుతూ ఉంటుంది. సృష్టి అంటేనే వ్యక్త మవుట అని, వ్యాప్తి చెందుట, అవ్యక్త మవుట అనేవి ఉండి తీరుతాయని, మనకు తెలిసిన విషయమే. వ్యక్తావ్యక్తముల మధ్యన ఉన్నదే జీవితము(సృష్టి). జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు భజ గోవింద శ్లోకముల ద్వారా పండితులము అను కొనే వారికి, సామాన్య జనానీకము నకు కూడా, ఓరి వెర్రి నాయనా! వల్లె వేస్తూ కూర్చుని ఉండక, మేలుకో సమయము తక్కువ, అని రక రకములు గా ఆయన, ఆయన శిష్య వర్గము ద్వారా మనను హెచ్చరించారు. మనసు శరీరములో ఉన్న జ్ఞానేంద్రియముల తో కలవలేదు అనుకోండి, ( కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ) వరుసగా చూపు, వాసన , వినుట, రుచి, స్పర్శ ఇవేమీ పని చేయవు. మనసు ను కట్టడి చేస్తే ఈ జ్ఞానేంద్రియములు ఏవి తమ పని చేయక, బహిర్ముఖము కాకుండా ఉండి, అంతర్ముఖము అవుతుంది. అవస్థాత్రయమైన జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో ఒకటైన జాగ్రదావస్థ లో ఈ దేహము ఇలా ఉంటుంది. స్వప్న అవస్థలొ దేహము, కర్మేంద్రియములు పనిచేయవు గాని జ్ఞానేంద్రియములు పనిచేస్తూ స్థూల శరీరము బదులు గా సూక్ష్మ శరీరము తో కలలు చూస్తూ ఉంటుంది. మనసు అలిసిపోయి విశ్రాంతి తీసుకొంటుంది కాబట్టి కొన్ని కలలు ప్రొద్దున్న లేచిన తరువాత గుర్తు ఉంటాయి, కొన్ని ఉండవు. సాధన క్రమములో స్వప్న రూపేణా సందేశములు వస్తూ ఉండి జ్ఞాపకము ఉంటాయి. అవి సాధనకు ఉపయుక్తము అవుతాయి. సుషుప్తి అవస్థ లో దేహము సర్వము మరిచి విశ్రాంతి తీసుకొంటుంది. ప్రొద్దున లేచి ఇవాళ మంచి నిద్ర పట్టింది అనుకోవటము మనకి అనుభవమే కదా! సాధన తీవ్రత లో ఒక్కోసారి సుషుప్త్యావస్థలొ కూడా కొన్ని అనుభవములు జరుగుతూ ఉంటాయి. ఒక సమయము లో నేను మంచి గుఱక పెడుతూ పడుకొనినపుడు, నా శ్రీమతి ఏవో అడిగితే వాటికీ సమాధానము చెప్తూ మధ్య లో మాములుగా గుఱక పెడుతూ పడుకొన్నానని తను చెప్తే ఆశ్చర్య పోయాను. సుషుప్త్యావస్థలో కూడా శరీరము జాగ్రదావస్థ లో ఉండడము అంటే ఇదేనా అనిపించింది!
Wednesday, 12 November 2014
మనసు ను అరికట్టడము ఎలా?
మనసు చంచలము అయినది. చాలా వేగముగా పరుగులు తీసేది అని మనకు అందరికి తెలిసిన విషయము. దానిని అరికట్టడము అనే విషయమును పక్కకు బెట్టండి, కనీసము దానిని ఒక విషయమును గురుంచే ఆలోచించేలా చేయగల మేమో, చూద్దాము. సాధారణముగా మనము ఖాళీగా ఉన్నాము అంటే మన ఆలోచనలు ఒకటి మొదలు పెట్టి, గొలుసుకట్టు గా ఒక దాని లోంచి ఇంకొక దాని లోనికి పరుగు తీస్తూ, పర్యవసానమేమిటీ అంటే ముందు ఆలోచించే విషయము మర్చిపోయి ఎక్కడో ఇంకో విషయములో ఉండగా మనము స్ఫురణ లోకి వస్తాము. స్ఫురణ అంటే ఆలోచనా కెరటాలు నుంచి బయటకు వచ్చి, అదేమిటి అలా ఎక్కడి నుంచి ఎక్కడ కు వెళ్లి పోయాము, మనము ఉన్నది ఇక్కడ కదా అని అనుకొంటాము కదా! మనసుని అరికట్టాలి అనుకొంటే అది ఇంకాస్త కష్టము అయి పోతుంది. ఆ పరిస్థితుల లో దానిని దృష్టి పెట్టక పొతే అది ఎక్కువ కదలడము మానుతుంది. ఇప్పుడు మన అందరికి అనుభవము లో ఉన్న విషయము ను పరిశీలిద్దాము. మన ఇళ్ళలో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళను మనము గారాబము కొద్దీ చూస్తున్నంత సేపు వాళ్ళు మన మాట విన కుండా అల్లరి చేస్తూ ఉంటారు. అదే వాళ్ళను మనము చూడటము మాని వేసి మన పని లో పడిపోయాము అనుకోండి, వాళ్ళు అల్లరి చేయడము మాని బుద్ధి గా మన పక్కనే కూర్చొని మనము ఏమి చేస్తున్నామో అని చూస్తూ కూర్చుంటారు కదా! అలాగే మన మనసు ను కూడా పట్టించు కోకుండా వదిలేస్తే అది కూడా బుద్ధిగా కూర్చుంటుంది. మనసు ను గాని పిల్లలను గాని బలవంతము గా కట్టి ఉంచాలి అని ఆనుకొనే కన్నా వాళ్ళను ఒక కంటి తో చూస్తూ వదిలి వేస్తే ప్రయోజనము ఎక్కువ ఏమో ఆలోచించి చూస్తే. వాస్తవానికి మన దేహ తత్వాలలో, అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు తన దేహమును వదిలి ఎక్కువ దూరము కాదు ఎంత దూరమైనా వెళ్ళ నీయండి అది మళ్లీ వెనుకకు తిరిగి రావలసినదే. ఎందుకంటే దానికి ఒక అస్తిత్వము లేదు కదా!
Tuesday, 11 November 2014
శోధన ...........
ఆ రకముగా నా సాధన లో సాయిబాబా కూడా దత్తావతారమే అని తెలిసింది కాబట్టి అక్కడ నుంచి సాయి సచ్చరిత్ర బదులుగా గాయత్రీ తో పాటు శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము చేయడము మొదలు పెట్టాను. దీనితో పాటు నా ప్రధమ గురువు నుంచి ఆయనకు వచ్చే సూచనలు వారు చెప్పినది చెప్పినట్లుగా సాధన చేస్తూ ఉండే వాడిని. ఆ సూచనలు యోగానికి సంబంధించి వస్తూ ఉండేవి. యోగ సాధన నా వీలును బట్టి సమయాసమయములు పాటించ కుండా నా నిత్య జీవిత కర్తవ్యములకు ఆటంకము లేకుండా, ఎట్టి పరిస్థితుల లోను యోగ సాధన చేయాలనీ ఒక ధృడ సంకల్పము తో చేస్తూ ఉండే వాడిని. అప్పటికి నాకు అర్ధము అయిన విషయము ఏమంటే ఒక సాధన లో త్రికరణ శుద్ధి గా చేయడము ముఖ్యము గాని నియమానియమములు కావు. నా ప్రాధమిక గురువు గారు మాస్టర్ ఇ. కే . గారి శిష్యులు. ఆయన హోమములు కూడా చేసేవారు. నా మనసు లో మా పెద్దలు యజ్ఞ యాగాదులు చేసినవారు కదా, నేను హోమము చేయడము అయినా నేర్చుకోవాలని ఉండేది. ఒక రోజు మా గురువు గారు నాయనా, నేను హోమము చేయడానికి విజయవాడ వెళ్తున్నాను అని చెప్పారు. నన్ను కూడా రమ్మనమని అంటే బాగుండును కదా అని అనుకొన్నాను. దానికి కారణమూ ఏమిటంటే దత్తాత్రేయము లో ఒకటి దత్త మంత్ర సుధార్ణవము, ఇంకొకటి షోడశ అవతారములు పుస్తకముల గురుంచి, అవి విజయవాడ లో గోవిందరాజులు దత్తాత్రేయులు అన్న ఆయన ముద్రణ వేయించారని, అక్కడికి వెళితే ఆ పుస్తకములు తెచ్చుకోవచ్చు అనుకొన్నాను. మా గురువు గారు శని వారము మధ్యాహ్నము బయలుదేఱ వలసి ఉన్నది గాని చివరి క్షణము లో అయన నా దగ్గఱ కు వచ్చి నాకు ఇంకో ముఖ్యమైన పని ఉంది నేను పోవుట కుదరదు, నా బదులు నీవు వెళ్లి హోమము చేయి అని చెప్పారు. ఆశ్చర్యం నా వంతు అయింది. ఇంకో విషయం ఏమిటంటే హోమానికి గురువు గారితో వెళ్లి నేర్చుకోవాలి అనుకొంటే నాకు హోమ విధానము ఏమిటో తెలియని నేను స్వయము గా మొదటి సారి చేయవలసి వచ్చింది. అదీ ఎవరింట్లో చేసానో తెలుసా ఆ గోవిందరాజులు దత్తత్రేయులు గారి ఇంట్లోనే చేశాను. ఆశించ కుండా నాకు వచ్చిన గురు దక్షిణ కూడా ఏమిటో తెలుసా నేను అనుకొన్న ఆ రెండు పుస్తకములే. అది గురు దత్త కృప అని అర్ధమవుతోంది కదా!
Monday, 10 November 2014
శోధన ......
నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని నామము ఎప్పుడూ వినుటకు అవకాశము రా లేదు. ఆయన ఎవరు, ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను. నేను సాయి సచ్చరిత్ర పారాయణము చేస్తూ ఉండేవాడిని కదా, ఆ సమయములో ఎవరో చెప్పితే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను. అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు జ్ఞాపకము వచ్చింది. అప్పుడు వెంటనే ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు, ఆయన లీలలు ఏమిటి కొన్ని తెలిశాయి. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు వ్రాసిన శ్రీ గురు చరిత్ర అనే సప్తాహ పారాయణ గ్రంధము గురుంచి, కలియుగములో సాయిబాబా దత్తాత్రేయుని అవతారముల లో ఒకటి అని తెలుసుకొన్నాను. పిఠాపురము లో దత్తాత్రేయుని గుడి ఉందని అక్కడ పారాయణ గ్రంధము దొరక వచ్చని, నేను కాకినాడ వాస్తవ్యుడిని కాబట్టి వెంటనే నా మోటారు సైకిలు మీద పిఠాపురము లో, నాకు తెలియకుండానే దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహము ఉన్న పాద గయా క్షేత్రమునకు వెళ్ళాను. అప్పటికే ఒక దత్త స్వామి ఉపాసకుడు గుడి వెనుక భాగము లో వారము రోజుల పాటు కార్యక్రమములు ముగించుకొని వెళ్ళిపోవడానికి సిద్ధము అవుతున్నారు. వాళ్ళను అడిగితే గురు చరిత్ర పుస్తకములు అయి పోయాయి, మా దగ్గఱ లేవు అన్నారు. మనసులో స్వామి ని తలుచుకొని స్వామీ నీ మీద నమ్మకము తో వచ్చాను ఒక్క పుస్తకమైనా దొరకలేదు అని అనుకొన్నానో లేదో, ఎవరో వెనక నుంచి భుజము తట్టి మీరు అలా ఎందుకు బాధ పడతారు గుడి ముందు గేటు దగ్గఱ ఒక పూజా సామాను కొట్టు ఉంది, అతను కూడా పుస్తకములు అమ్ముతాడు, ప్రయత్నించండి అని అన్నారు. ఆ ఆనందము లో ఎవరు చెప్పారో కూడా చూడకుండా వెనుక గేటు నుంచి పరుగున వెళ్ళాను. నా అదృష్టము కొద్దీ, ఒకటే ఉంటే అది నాకు ఇచ్చాడు. ఇలాంటి సంఘటనలు నా సాధన లో తరుచుగా జరిగేవి. ఇక్కడ విషయము ఏమిటి అంటే వెనుక గేటు నుంచి ప్రవేశించినప్పుడు పక్కనే దత్త స్వామి (నాలుగు భుజములతో ఉన్న) స్వయంభూ విగ్రహము ఉందని నాకు తెలియక పోవటము ఒక విశేషము. ఏది ఎప్పుడు తెలియాలో నిర్ణయించేది ఆ స్వామి కానీ మనము కాదు కదా!
శోధన
ఆ ప్రశ్న ఏమిటి అంటే ఒక గురువు చెప్పిన విషయమును ఇంకొక గురువు ఎందుకు అలా కాదు అని ఎందుకు అంటారు. ఎందరో గురువులు అన్నిరకాల మార్గాలు. ఒక సాధకుడు ఎవరిని నమ్మాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. అసలు ఈ గురువులను అందరినీ ఒక మార్గములో పెట్టగలిగిన వారు లేరా? అని ఒక తపన నాలో ఉదయించింది. పరమపద సోపానములు అధిరోహించాలి అంటే ఎవరిని పట్టుకొంటే, మన మార్గము సుగమము అవుతుంది. తెలుసుకోవలిసిన విషయము ఒకటే, ఏ గురువు చెప్పినా ఒకేలా చెప్పాలి కదా! కానీ ఇక్కడ జరుగుచున్నది, ఏమిటి అంటే ఒక్కొక్క గురువు చెప్పాలిసిన విషయము ఒకటే అయినప్పటికీ వారి వారి గ్రాహ్య శక్తి ని బట్టి వారికీ అర్ధమైన విషయము, దానికి కొంత వారి వారి అనుభవములు బట్టి, చెప్పే విషయము మారి పోతోంది. మేమే అధికులము అంటూ ఎవరికి వారు ఇన్ని మార్గాలు చూపిస్తున్నారు. నా మార్గాన్వేషణ లో అయ్యప్ప స్వామి మాల రెండు సార్లు వేసుకొన్నాను. మొదటి సారి జ్యోతికి (50 రోజులు దగ్గఱ గా), రెండో సారి మండలమునకు వెళ్ళాను. నా జపము, పారాయణ చేస్తూ ఎవరు సరి అయిన గురువు అని ఆర్తి తో ఎదురు చూస్తుండగా ఒక రోజు జపము చేసుకొనే సమయములో నా లో నుంచి నీవు దత్తాత్రేయుని పట్టుకో అని సూచన వచ్చింది. ఇది నా సాధన విషయములో జరిగిన సత్యం. నా పూర్వ జన్మ సుకృతమో, నా పెద్దల అశీస్సులో దత్తాత్రేయుడు నన్ను ఆశీర్వదించాడు. ఆయననే గురువు గా తలుచుకొని నా సాధన చేయడము ప్రారంబించాను. అక్కడితో నా సాధన సరి అయిన మలుపు తిరిగింది.
Sunday, 9 November 2014
మార్గాన్వేషణ .........
మా గురువు గారు ఆయనకు చూడమని వచ్చిన జాతకములు అన్ని నాకు పంపించి నన్ను ఆ తెచ్చిన వారికి ఫలితములు చెప్పమని చెప్పేవారు. కొన్ని దినములు ఇలా గడిచింది. ఒకఅమ్మాయి జాతక చక్రము వస్తే దానిని పరిశీలించి దాని ఫలితములు ఏమి చెప్పాలో నిర్ణయించుకొని, సాధన లో నేను చేస్తున్నాను అనే భావనో ఎందుకో మనసు లోకి వచ్చి ఈ జాతక చక్రము తాలూకా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని చూడాలని పించి మనసులో అనుకొన్నాను. నేను జపములో ఉంటే ఒక అమ్మాయి ముందుకు వెనకకు నడుస్తూ కనిపించింది. ఆ మరునాటి ఉదయము ఆ అమ్మాయి తండ్రి వస్తే అతనికి చెప్పవలసినది చెప్పి, మీ అమ్మాయి ఈ పోలికలలో ఉంటుందా అని అడిగాను. చిత్రమేమిటి అంటే మా అమ్మాయి ఫోటో జేబులో ఉంది అని చెప్పిఅయన ఇచ్చారు. ఆశ్చర్యము! నాకు కనిపించిన అమ్మాయి, ఫోటో లో ఉన్న అమ్మాయి ఒక్క లాగానే అచ్చు వేసినట్లుగా ఉన్నారు. అయన వెళ్ళిన తరువాత ఈ అనుభవము ఎవరితో పంచుకొంటాను, నా భార్య తో తప్ప. ఆమె అమాయకముగా మీ సాధన ను ఇలా ఉపయోగించారా అని అడిగింది. వెంటనే నా గురువు ఇలా ఎందుకు చేశావు? అని మందలించారా అని అనిపించింది. ఆ తరువాత నేను జాతకములు చూడటము తగ్గించు కొన్నాను. నా అదృష్టము కొద్దీ కొన్ని రోజుల లోనే నాయనా, నీ గురువు నీకు కనిపించాలి అంటే నీవు, నాకు వచ్చే సూచనలు నీకు నేను చెప్పినది చెప్పినట్లుగా, నీవు జ్ఞప్తి ఉంచు కొని సాధన చేసినట్లయితే, నీ గురు కటాక్షము నీకు లబిస్తుంది అని జాతకములు నేర్పిన గురువు గారే నాకు దారి చూపించారు. ఇంకో విషయము కూడా జ్ఞప్తి లో వుంచుకో నేను నీకు చెప్పిన విషయములు ఇంకొక సారి అడిగితే నేను చెప్పలేను. నీవు శ్రద్ధగా విని జాగ్రత్తగా చేసుకోవలిసిన బాధ్యత నీదే సుమా! గుర్తుంచుకో అని హెచ్చరించి ఆయనకు వచ్చిన సూచనలు వచ్చినవి వచ్చినట్లు గా నాకు తెలియ చేస్తూ ఉండేవారు. అలా నా సాధన ప్రారంభము అయింది. అప్పట్లో ఒక నాడు మా ఇంటికి కొంత మంది వచ్చారు. వారిలో ఒకరు మీ పేరు ఏమిటి? అని అడిగితే, పేరు చెప్పడము జరిగింది. ఆ వచ్చిన వారిలో ఇంకొకరు అదేమిటి మీ పేరు ముందు వేంకట కనిపిస్తోంది, మీరు చెప్పుట లేదు అని అడిగారు. వెంటనే అప్పటికే సాధనలో ఉన్న నేను వారిని సవినయముగా మీరు ఏ కార్యక్రమములు చేస్తుంటారు అని అడిగాను. అయన కూడా అందుకనే మేము ఇవన్ని మాట్లాడ వలసి వస్తుంది కాబట్టి ఎక్కడికి రాము అని అన్నారు. పోనీయండి, ఫరవాలేదు మీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పండి అని నేను అన్నాను. అది సరే ముందు నీవు అసలు ఏమి చేస్తున్నావో అది చెప్పు అని అడిగారు. నేను కొంచం తర్జన భర్జన చేసుకొని అడిగింది, నా కన్నా సాధన లో ముందు ఉన్నవారిగా నిర్ణయించుకొని నేను చేసేది తెలియ చేశాను. వెంటనే ఆయన అలా ఎలా చేస్తున్నావు నీవు గృహస్థువి కదా అని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా గురువు ఏమి చెప్తే అదే చేస్తున్నాను అనుకొని ఇంకా శ్రద్ధ గా చేయడము ప్రారంభించాను. గురువు చెప్పినది పూర్తి నమ్మకము తో చేయడమే గాని ఇంకొక ఆలోచన చేయకూడదు అని అది నా గురువు చేసిన సూచనగా తీసుకొన్నాను. అప్పుడు నాలో విచిత్రముగా ఒక ప్రశ్న ఉదయించింది.
Saturday, 8 November 2014
మార్గాన్వేషణ..........
ఈ సమయము లో మా పూర్వీకులను తలుచుకొని వారికి నా హృదయ పూర్వక నమస్కారములు సమర్పించు కోవటము నా కనీస కర్తవ్యము అనిపిస్తుతోంది. పెద్దలు చేసిందే పిల్లలకు వస్తుంది అని మన అందరికి తెలిసినదే! మా తాత గారి తాత గారు , తరువాత మా తాత గారి నాన్న గారి తరములలో మా ఇంట్లో యజ్ఞ, యాగాదులు జరిగేవి. తరువాత మా తాత గారు యజ్ఞ యాగాదులు చేయలేదు, కానీ ఆయన ఎక్కువ సమయము కళ్ళు మూసుకొని ఒక ప్రక్కన కూర్చొని ఉండే వారని మా అమ్మ గారు చెప్పిన విషయము. ఇంకొక విషయము తెలిసినది ఏమనగా మా తాత గారిని ఎవరైనా చుట్టుపక్కల పిల్లలు తాత గారు ఇవి కావాలి తెచ్చిపెట్టరా అని అడిగితే వీళ్ళు పిల్లలు వాళ్ళు అడిగితే మనము తేవాలా అని అనుకోకుండా వాళ్ళకు తెచ్చి ఇచ్చే వారని మా అమ్మ గారి ద్వారా విన్నాను. మా అమ్మ గారి నాన్న గారు మంచి ఆధ్యాత్మికత ఉన్న వారు. ఆయన దగ్గఱ మంచి చనువు నాకు ఉండేది. అయన కూడా మంచి విషయములు చెప్పేవారు. మా అమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని వస్తావట్టిదే పోతావట్టిదే మొదలైన తత్వ గీతాలను పాడి వినిపిస్తూ పెంచారు . మా ఇంట్లో మా నాన్న గారు కూడా ప్రొద్దున్నే లేచి గాయత్రీ జపము చేసుకొన్న తరువాతే గాని కాఫీ తీసుకొనే వారు కాదు. మా నాన్న గారు కూడా ఉపాధ్యాయ వృత్తి లో ఉండి అయన పనేదో ఆయనది గాని ఎక్కువ ఎవరి తోనూ అనవసరముగా మాట్లాడటము నేను చూసింది లేదు. ఈ రకమైన వాతావరణములో నేను పెరిగిన వాడిని. ఉపాసన గురుంచి మా గురువు గారు చెప్పినా అది ఎలా చేయాలో చెప్ప కుండా నీ పాట్లు నీవే పడు అని అన్నారు. అప్పటికి ముందు అనుకొన్న విధముగా రకరకాల ఇబ్బందికర పరిస్థితుల లో ఉండి మా నాన్న గారిలా గాయత్రీ (రోజూ సహస్రము) చేస్తుండే వాడిని. ఆ సమయములో షిరిడి సాయి బాబా సచ్చరిత్ర మాతా కృష్ణ కుమారి (రామచంద్రాపురము) వ్రాసినది దొరుకుతే అది పారాయణము చేస్తూ ఉండే వాడిని.
Thursday, 6 November 2014
మార్గాన్వేషణ
అందరికీ ఇలాంటి పరిస్థితులు జీవితము లో ఒక సారి ఎదురు అవుతూ ఉంటాయి . ఎవరికి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు తమకు ఒకరికే వచ్చాయి మిగిలిన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు అనుకొంటూ బాధ పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు నాకు కూడా ఎదురు అయ్యాయి. గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి అని నా జాతకము చూపించుకొంటే బాగుంటుంది అని సరి అయిన జ్యోతిష్యులు కోసము వెతుకుతూ ఉంటే నాకు దగ్గర లోనే ఒకరు ఉన్నారని తెలిసింది. అయన మా కుటుంబానికి చాలా తరాల నుంచి ఒకరికి ఒకరం తెలిసి ఉండటం చేత చనువుతో ఇవాళ రేపు అంటూ 3, 4 రోజులు గడిపారు. ఆ సమయము లో నేనే ఎందుకు జాతకములు చూడడము నేర్చుకోకూడదు అని అనిపించి, అలా నేర్పించే వాళ్ళ కోసము ప్రయత్నము చేయడము మొదలుపెట్టాను. మనసు ఉంటే మార్గము అదే కనిపిస్తుంది అని మనకు తెలిసిందే కదా! మనిషి తను తలుచుకొంటే ఏదైనా చేయగలడు అన్నట్లుగా నా ప్రయత్నము ఫలించి నా సహ ఉద్యోగే నీకు అంతగా నేర్చుకోవాలని ఉందా అయితే ఎవరో ఎందుకు నేనే నేర్పుతాను అని అన్నారు. ఆయనతో నేను పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆయనకు జ్యోతిష్యం వచ్చని ఎప్పుడు నాకు తెలియదు. అలా నా సాధన లో తొలి అడుగు వేయటము జరిగింది. ఆయన దగ్గఱ నేను కేవలము 21 రోజుల్లో జాతక చక్రాలు ఎలా వేయాలో నేర్చుకొన్నాను. అయన ఆనందించి ఇలా ఇంత తక్కువ సమయములో ఎవరు నా దగ్గఱ నేర్చుకోలేదు ఇక నుంచి ఫలితములు గ్రహ స్థితుల బట్టి కాదు ఏదైనా ఉపాసన చేస్తే ఇంకా బాగా చెప్పగలవు అని అన్నారు.
Wednesday, 5 November 2014
మనసు - శ్వాస
మనసు చంచలమైనది. ఈ సృష్టి లో అన్నింటికన్నా వేగముగా పరిగెత్తేది ఏది అన్న యక్ష ప్రశ్నకు ధర్మరాజు మనసు అని చెప్పిన సమాధానము మన అందరికి తెలిసినదే. మనము పూజా కార్యక్రమము లో గాని, ధ్యాన సమయము లో గాని, ఇంకా పలు సంధర్భముల లో గాని కూర్చున్నప్పటికీ మన మనసు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుదన్న విషయము, మనకి తెలిసి యున్న విషయమే. ఆ సంధర్భముల లో ఈ మనసు ఎందుకు అలా తిరుగుతూ ఉంటుంది, దానిని ఎందుకు కట్టడి చేసి ఉంచ లేక పోతున్నాము అని పలు విధములు గా ఆలోచిస్తూ ఉంటాము. తెలిసిన పెద్దలు అందరినీ అడుగుతూ ఉంటాము. ఈ సమయము నకు మనము మన జీవితముల లో రక రకాల సమస్యలతో సతమతము అవుతూ వ్యాకుల పడుతూ ఉంటాము. వీటి అన్నింటి నుంచి విముక్తి ఎలాగ అని విచారిస్తూ ఉంటాము . ఈ అవసరమే మనలను దారులు వెతుకు కొనేలా చేస్తుంది. ఇలా ఆలోచించే సమయము నకు మానవుడు తన అధో మానసిక స్థాయి నుండి ఊర్ధ్వ మానసిక స్థాయి కి తనకు తెలియకుండా తాను చేరుకోవడము జరుగుతుంది. అప్పటి నుంచి ఎలా ఈ విషయము గురుంచి తెలిసికోవాలి ఎవరు ఈ విషయము గురుంచి చెప్ప గలరు అని వెతుకుతూ ఉంటాడు.
Monday, 3 November 2014
శరీరము మనుగడ
సాధారణముగ ఒక మనిషి ఈ భూమి మీద జీవించాలి అంటే ఒక నిముషమునకు 15 శ్వాసలు తీసుకొంటాడు అని పెద్దలు ముందే చెప్పారు. ఒక వ్యక్తి 15 శ్వాసల కన్నా (ఒక నిముషమునకు) ఎక్కువ తీసుకొన్ననాడు తక్కువ కాలము లేదా తక్కువ తీసుకొన్ననాడు ఎక్కువ కాలము ఈ భూమి మీద జీవించటానికి అవకాశము ఉందని కూడా పెద్దలు చెప్పారు. దీనిని బట్టి శ్వాస మీద నియంత్రణ ఉంటే మనము మన జీవిత కాలమును నిర్ణయించు కొనుటకు అవకాశం ఉంది అని అర్ధమవుతోంది కదా!
శరీర మాధ్యమ్ ..........
భూమి మీద జీవించాలి అంటే శ్వాస ద్వారా గాలి తీసుకోవాలని మన అందరికి తెలిసిన విషయమే. ఈ భూమి మీద నివసించే ప్రాణులకు మానవులతో సహా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా గాలి పీల్చు కొనుటకు శరీర నిర్మాణము ఏర్పడింది. బ్రహ్మ దేవుడు ఈ వ్యక్తి ఇంత కాలము భూమి మీద జీవిస్తాడు అని సృష్టించడము జరుగుతుందని మనము అనుకొంటాము, కానీ యధార్ధానికి ఈ వ్యక్తి ఇన్ని శ్వాసలు మాత్రము తీసుకొని జీవిస్తాడు అని అర్ధం చేసుకొంటే మంచిదని పెద్దల అబిప్రాయము. మన ఋషులు వారి తరువాత తరములు అయిన మనందరికీ ఎన్నో విషయములు వారి అనుభవములతో కూడిన జ్ఞానము నిక్షిప్తము చేసి అందించారు.
Sunday, 2 November 2014
శరీర మాధ్యమ్ ........
24 తత్వములు వరుసగా పంచ భూతములు 5 (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము), జ్ఞానేంద్రియములు 5 (చెవులు, చర్మము, కన్ను, జిహ్వ, ముక్కు) తన్మాత్రలు 5 (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము) కర్మేంద్రియములు 5 వాక్కు (నోరు), పాణి (చేయి ), పాదములు , పాయువు (మల ద్వారము ), ఉపస్థ (జననేంద్రియము) అంతఃకరణ చతుష్టయము 4 (మనో, బుద్ధి, చిత్త, అహంకారములు) మొదలగునవి కలిపి ఈ స్థూల దేహము ఏర్పడినది అని తెలుసుకోవాలి . ఇది పిండాండము అయితే బ్రహ్మాండము కూడా 24 మూలకము లతో ఏర్పడినది. కాబట్టి పిండాండము బ్రహ్మాండము ఒకే రకముగా ఏర్పడినవి అని తెలుసుకోవాలి. ఈ సృష్టి లో దేవ భాష లో చతుర్వింశతి (24) అన్నది చాల సందర్భాలలో వస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రము లో 24 అక్షరములు (24 బీజాక్షరములు) సృష్టి లో 24 మూలకములకు సంబంధం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. జగద్గురువు అయిన శ్రీ దత్త స్వామి కి కూడా 24 మంది గురువులని అంటే సృష్టిలో ఎక్కడ నుంచి అయిన మనము నేర్చుకోవలసినది ఉందని మన అందరికి తెలియచేస్తున్నారు. అంతెందుకు ఒక రోజుకు కూడా 24 గంటలే కదా. పూజ కార్యక్రమములలో కూడా కేశవ నామాలు 24.
Friday, 31 October 2014
శరీర మాధ్యమ్ ఖలు ధర్మ సాధనం
పరిణితి చెందుతూ వస్తున్న జీవికి ఈ భూమి పైన తిరుగాడుటకు మనుష్య శరీరము ఒకటి కావాలి కదా! ఆ రకముగా మనమంతా భూచరులమని పిలవబడుతూ ఉంటాం. షట్ భావ వికారము లైన వరుసగా జాయతే (పుట్టుట), అస్తి (పుట్టి ఉండుట), వర్ధతే (పెరుగుట), విపరిణమతే (పండుట), అపక్షీయతే (తరుగుట), వినశ్యతి (నశించుట) అని ధర్మములతో ఈ శరీరము కూడి ఉంటుందని మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ దేహము 24 తత్వము లతో కలిసి ఉంటుంది.
Thursday, 30 October 2014
మానవుని పరిణామము
ముందు తెలుసుకున్న విధముగా మానవుడు తన నిజ స్థితిని మరిచి ఈ దేహమే నేను అనుకొంటూ తన మనసుకు తోచిన విధముగా పశు ప్రవృత్తితో ప్రవర్తిస్తు ఉంటాడు. మానవునికి జంతువు కన్నా మంచి చెడు ఆలోచించి చేసే శక్తిని ఆ పరమాత్మ ఇవ్వడం జరిగింది. కానీ మానవుడు తను మానసిక స్థాయి లోనే (పశు స్వభావముతో) ఎక్కువ కాలము (జన్మలు) ఉండి తనకు తెలిసి తెలియక మంచి చెడు పనులు అంటే కర్మలు చేస్తూ తన పాప పుణ్యాల ఖాతా తెరుచుకొని జన్మ పరంపర పెంచుకొంటాడు. ఆ రకముగా పరమాత్మకు దూరమవుతూ ఉంటాడు. అంతః శత్రువులైన కామ, క్రోధాది అరిషట్ వర్గాలు మానవుని లోబరుచుకొని అతనిని అధో మానసిక స్థాయి కి జేరుస్తాయి.
Wednesday, 29 October 2014
మనసు........
మన ఏవ మనుష్యాణాం బంధ మోక్ష కారణాత్ అని వింటూ ఉంటాము. ఈ సంసార సాగరము తరించుటకు మన ఏవ అంటే మనసు కాదు మనసే అని అటు బంధములకు గాని ఇటు మోక్షము నకు గాని కారణము లేదా ప్రతిబంధకం అవుతుంది. ఈ శరీరమే నేను అని అనుకోవటానికి కారణము పంచ జ్ఞానేంద్రియములు మనసుకు లోబడి వరుసగా కన్ను దృష్టితో, చెవులు శ్రవణముతో, ముక్కు వాసనతో, జిహ్వ రుచితో, త్వక్కు (చర్మము ) స్పర్శతో కలిసిపోవటమే. ఒక వేళ పంచేంద్రియములు మనసుతో కలవక పొతే ఆయా ఇంద్రియములు వాటి గుణములతో బహిర్ముఖం అవటము ఆగిపోతుంది అని మనకు అర్థం అవుతోంది కదా!
Tuesday, 28 October 2014
మనసు
ఆ విధముగా ముఖ్యముగా జంతు వర్గములతో సహా మన అందరిలో మనసే ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుంది. నేను అన్నది మనసుతో సంపూర్ణంగా కలిసిపోయి ఈ శరీరమే నేను అనుకోని మనిషి తన నిజ స్వరూపము అయిన నేను ని పూర్తిగా మరచిపోవడము జరుగుతుంది. జంతూనామ్ నర జన్మ దుర్లభం అని మనము వినే ఉన్నాము. దీనిని బట్టి మనిషి జంతు స్థితి నుంచే పరిణామము చెంది నట్టుగా మనకు అర్ధమవుతున్నది. ప్రాధమిక స్థాయిలో మనిషిగా పరిణితి చెందిన వ్యక్తికి ఉన్న మానసిక స్థాయి జంతువులో ఉన్న మానసిక స్థాయి ఇంచుమించుగా సమానం గానే ఉంటుంది.
Monday, 27 October 2014
Sunday, 26 October 2014
పంచు కొంటేనే పెరుగుతుంది
ఒక సాధనలో గాని, ఉపాసనలో గాని ఏ ఇద్దరికీ ఒకేలా అనుభవములు కలగక పోవచ్చు కాబట్టి, ఒకరు ఇంకొకరితో పంచుకొంటే ప్రయోజనము ఉండదు అని ఒక ఉద్దేశం కావచ్చు. అలా కాకుండ అనుభవములు ఒక్కొక్కరికి ఒక్కొక రకముగ ఉండచ్చు కాబట్టి, పరస్పరము పంచుకొంటే ఫలితము ఉండదని అని ఒక అభిప్రాయము కావచ్చు. ఏ విషయమైనా మన గ్రాహ్య శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అనుభవములు పంచుకొంటే విద్య పెరుగుతుందని మా గురువు గారు అంటూ ఉంటారు.
Friday, 24 October 2014
Thursday, 23 October 2014
నాందీ ప్రస్థావన
ఈ రోజు దీపావళి. అనుకోకుండా మా చిన్న బావ గారు వచ్చారు. యధాలాపంగా కబుర్లలో బ్లాగుల గురించి ప్రస్తావన వచ్చింది. మీరు ఏమైనా బ్లాగు
ప్రారంభించారా అని అడిగారు. నేను దత్తోపాసకుడను కాబట్టి స్వామి పేరున బ్లాగు చాలా రోజులకిందే ప్రారంభించాను అని చెప్పాను. మీరు మొదలు పెట్టి ఎందుకు కొనసాగించ లేదు, మీకు తెలిసిన విషయాలు అందులో పెడితే నచ్చిన వారు చదువుతారు. ఈ రోజు మళ్లిమొదలుపెట్ట వచ్చు కదా అని అన్నారు. నేనైతే ఏదో మొదలు పెట్టాను గాని నా వల్ల కాదేమో అని అన్నాను. అదేమిటి నేను నేర్పుతాను మొదలు పెట్టండి అని అన్నారు. ఈ రోజు అమావాస్య కదా, అమావాస్య సాధారణముగా ఏ పనైన మొదలుపెట్టడమంటే అలొచిస్తూ ఉంటాము.కాని ఏ పనైనా అనుకొన్న వెంటనే మొదలుపెట్టాలి. మరొక విషయం మనకు తెలిసిందే, దత్త సంప్రదాయంలో గడిచిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే కన్నా వర్తమానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. రేపటి పని ఇవాళ చేయి, ఈరొజు పని ఇప్పడే చేయి. ప్రతి క్షణము వాడుకోవాలి కాలమన్నది ఎవరికోసము ఆగదు దాని పని అది చేసుకొంటూ పరుగు లు తీస్తూ ఉంటుంది.అందుకని ఆ బ్లాగునే ఈ రోజు నుంచి వాడుకొందాము అని అనుకున్నాం.
Subscribe to:
Posts (Atom)