Wednesday, 26 November 2014

గురువు - శిక్షణ ..........

 మా గురువు గారు  మాస్టర్ ఇ. కే.  గారి శిష్యులు అని తెలిపాను  కదా, వారి బృంద సభ్యులు తరుచుగా ఏవో కార్యక్రమములు చేస్తూ  ఉండేవారు.  నేను ప్రారంభించింది మాస్టర్ ఇ. కే. గారి పద్ధతి అయినా నేను మా గురువు గారి సూచనలు వల్ల  నెమ్మది గా దత్త సంప్రదాయము  లోనికి ప్రవేశించిన విషయము ఇప్పటికే తెలియజేసాను కదా. అలా వారంతా ఒక సారి శ్రీశైలము లో  ఒక వారము రోజులు పాటు ఉండి ధ్యాన  కార్యక్రమములు కోసము వెళ్ళితే వాళ్ళ తో పాటు  మా గురువు గారు  నన్ను కూడా రమ్మంటే, నేను కూడా వాళ్ళ తో పాటు వెళ్ళాను.  బ్రాహ్మి ముహూర్తము లోనే  వారందరి కన్నా ముందు లేచి,  నేను వారి కాల కృత్యములకు అడ్డు కాకూడ దని త్వరగా తెమిలి నా సాధన నేను చేసుకొంటూ ఉండేవాడిని.  అంతకు ముందు శ్రీశైలము వెళ్ళాను కానీ, అక్కడ మందిరము కాకుండా ఇంకా ఆధ్యాత్మిక సాధన చేసుకొనే మఠాలు ఉన్నాయని నాకు తెలియదు.  నేను నా  సాధన చేసుకొంటూ ఉన్నప్పటికీ వాళ్ళ అందరితో సమానముగా వారి సాధన లో కూడా కలిసిపోయే వాడిని.  నాకు తాత్కాలికముగా నిత్య జీవన విధానము నుంచి వీలు దొరికి నా సాధనకు ఎక్కువ సమయము దొరికినందుకు ఎంతో ఆనందము గా  ఉండేది. వారు అంతా దగ్గర గా ముందు కూర్చొంటే, నేను కొంచెము వెనుక కూర్చొని ఉండేవాడిని.  ఒక రోజు కొంచెం సేపు సాధన చేసి ఇవాల్టికి ఇంక చాలు, ఎవరికి వారు విశ్రాంతి తీసుకొందాము  అని వాళ్ళంతా అనుకొన్నారు.  ఎందుకో  మళ్లీ గురువు గారు చూస్తే ఎక్కడ రమ్మంటారో అని నేను త్వరగా వెళ్ళడానికి సిద్ధము అవుతుంటే, వెనుక నుంచి నన్ను పిలిచి ఆటవిడుపు వాళ్ళ అందరికీ గాని నీకూ నాకూ గాదు, పద నీవే నాకు ఇక్కడ ఏవో ఆధ్యాత్మిక మఠాలు ఉన్నాయిట,  అవి నీవే చూపించ గలవట,  తీసుకు వెళ్ళు,  ఇవాళ నీవే నడిపించాలి అని మా గురువు గారు అనేటప్పటికి నాకు మతి పోయింది.  నేను ఏమిటి నా గురువు గారికి మఠాలు చూపించుట ఏమిటి అని ఆశ్చర్య పోయాను. ఇది రెండు దశాబ్దముల క్రిందటి మాట.  సరే నేను గురు దత్తుని మీదే భారము వేసి అయన ను తలుచుకొని నీవే నాకు దారి చూపించాలి అని మనసులో అనుకొని  నాకు తెలియకుండా మందిరము  వెనుక ద్వారమును దాటేటప్పటికి ఒకరు ఎవరో దూరము నుంచి మా వైపే వస్తూ కనిపించారు. వారు మా దగ్గరకు రాగానే మఠాల గురుంచి చెప్పి అవి ఎక్కడ ఉన్నాయో ఎలా వెళ్ళాలో అని  అడగగానే పదండి,  నేను  చూపిస్తాను అని,  వారు మాతో పాటు బయలు దేరారు. శ్రీ గురు దత్తుని కృప కు ఎంతగానో ఆనందపడ్డాను.  మొదటి గంటా మఠం చూపించి వెళ్లారు.   తరువాత విభూతి మఠం.  అందులో ఏవో యంత్రములు చెక్కిన  ఒక పలక రాయి చతురస్రాకారము లో ఉండేది.  అది అప్పటికే ముక్కలు గా ఉండి ఒక దగ్గరికి పేర్చబడి ఉన్నట్లు గుర్తు. విశేషము ఏమిటంటే దాని మీద విభూతి ఒక పొరలా ఏర్పడి ఉంటుంది. ఆ విభూతి చేత్తో తుడుచుకొని తీసుకొంటే మళ్లీ ఒక పొరలా ఏర్పడేది. అందుకు దానికి  విభూతి మఠం అని పేరు.  సాధు మఠం ఇంకొకటి.  అక్కడ  క్రింద గుహలు ఉన్నాయి అందులో సాధన చేసుకొంటూ ఉంటారని తెలిసింది.  తరువాత సారంగధర మఠం.  అదీ చూసుకొని ఇంకా ముందుకు వెళ్తూ, బయలుదేరి నప్పటి నుంచి  ఔదుంబర వృక్షాలు చాలా కనిపిస్తున్నాయి గానీ, ఎక్కడా దత్తాత్రేయుని పటము గాని, విగ్రహము గానీ కనిపించుట లేదు కదా,  అని అనుకొంటూ నడుస్తున్నాము.  అక్కడ ఒక కుగ్రామము ఒక చిన్ని టీ స్టాలు కనిపించే సరికి మా గురువు గారు టీ తాగుదాము అని అన్నారు.  టీ స్టాలు దగ్గరకు వెళ్ళేటప్పటికి దత్తాత్రేయుని పటము అక్కడ ఒకటి కనిపించింది.  ఫరవాలేదు గురువు గారి దర్శనము అయింది అని నమస్కారము మనసు లోనే పెట్టుకొన్నాను. టీ  తాగుతూ దత్తాత్రేయుని గురుంచి వాళ్ళకు  ఏమి తెలుసో అని అడిగాను.  నా అదృష్టము ఏమో కానీ వారు వెంటనే ఆయనను మేము కూడా కొలుస్తాము అని చెప్పి, ఇక్కడికి దగ్గర లోనే మాకొక ఆశ్రమము ఉంది , అందులో అప్పటికి 14 ఏళ్ళు ముందు నుంచి అఖండ దీపము ఉంది అని చెప్పారు,  నాకు వారు ఎంత గొప్ప సాధకులో కదా అని కృతజ్ఞతలు  చెప్పాను.  వెనుక నుంచి మా గురువు గారు, నీవు అడిగితే  ఆ  అఖండ దీపము చూపిస్తారు, అడిగి చూడు, మనము కంటి తో చూడవచ్చు అని అన్నారు. అడగటమా  మానడమా  అని తర్జన భర్జన చేస్తూ గురు దత్తుని మీదే భారము వేసి, వారిని ఆ దీపము చూపిస్తారా, నేను కూడా  శ్రీ గురు  దత్తుని కొలుస్తున్నట్లు చెప్పగానే,  అదేమిటి అడగటానికి అనుమానము ఎందుకు, పదండి అని,  దగ్గర ఉండి వారి ఆశ్రమము నకు తీసుకు  వెళ్లారు.  అక్కడ ఒక పెద్ద పాక, అందులో చిన్న పాక, అందులో అఖండ దీపము చూపించి మీరు ధ్యానము చేసుకొని రండి అని వెళ్లారు.  అ దీపము ముందు  ఒకరు మాత్రమే కూర్చొని ధ్యానము చేసుకొనే వీలు ఉండడము వల్ల, ఒకరి తరువాత ఒకరము ధ్యానము చేసుకొని తిరిగి బయలుదేరాము. ఔదుంబర వృక్షాలు ఒకటే కనిపిస్తున్నాయి, గురువు గారి పటము గాని, విగ్రహము గని కనిపించుట లేదు అని బాధ పడుతూ ఉంటే, పటము తో పాటు, అంత  కన్నా అమూల్యమైన అఖండ దీపాన్నే చూపించిన శ్రీ గురు దత్తుని కృప కు ఇంకో తార్కాణము కావాలా!  గురువును పూర్ణ విశ్వాసముతో కొలిస్తే సాధన లో ఎలా దారి చూపిస్తారో కదా. 

No comments:

Post a Comment