Monday, 10 November 2014

శోధన ......

నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని  నామము  ఎప్పుడూ  వినుటకు అవకాశము రా  లేదు.   ఆయన  ఎవరు,  ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను.  నేను  సాయి సచ్చరిత్ర  పారాయణము  చేస్తూ ఉండేవాడిని కదా, ఆ  సమయములో  ఎవరో చెప్పితే  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు  నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక  కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను.  అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు  జ్ఞాపకము వచ్చింది.  అప్పుడు వెంటనే  ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు,  ఆయన  లీలలు  ఏమిటి  కొన్ని తెలిశాయి.  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు వ్రాసిన శ్రీ గురు చరిత్ర  అనే సప్తాహ  పారాయణ గ్రంధము గురుంచి,   కలియుగములో సాయిబాబా దత్తాత్రేయుని అవతారముల లో ఒకటి అని తెలుసుకొన్నాను.   పిఠాపురము లో దత్తాత్రేయుని గుడి ఉందని అక్కడ పారాయణ గ్రంధము దొరక వచ్చని,  నేను కాకినాడ వాస్తవ్యుడిని కాబట్టి  వెంటనే నా మోటారు సైకిలు మీద పిఠాపురము లో,  నాకు తెలియకుండానే  దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహము ఉన్న పాద గయా క్షేత్రమునకు  వెళ్ళాను.  అప్పటికే ఒక దత్త  స్వామి ఉపాసకుడు గుడి వెనుక భాగము లో వారము రోజుల పాటు కార్యక్రమములు ముగించుకొని వెళ్ళిపోవడానికి సిద్ధము అవుతున్నారు.   వాళ్ళను అడిగితే  గురు చరిత్ర పుస్తకములు అయి పోయాయి, మా దగ్గఱ  లేవు అన్నారు.  మనసులో స్వామి ని తలుచుకొని  స్వామీ నీ మీద నమ్మకము తో వచ్చాను ఒక్క పుస్తకమైనా  దొరకలేదు అని అనుకొన్నానో లేదో,  ఎవరో వెనక నుంచి భుజము తట్టి  మీరు అలా  ఎందుకు బాధ పడతారు గుడి ముందు గేటు దగ్గఱ ఒక పూజా  సామాను కొట్టు ఉంది,  అతను కూడా పుస్తకములు అమ్ముతాడు,  ప్రయత్నించండి అని అన్నారు.  ఆ ఆనందము లో ఎవరు చెప్పారో కూడా చూడకుండా వెనుక గేటు నుంచి పరుగున వెళ్ళాను. నా అదృష్టము  కొద్దీ,   ఒకటే  ఉంటే అది నాకు ఇచ్చాడు.  ఇలాంటి సంఘటనలు నా సాధన లో తరుచుగా జరిగేవి.  ఇక్కడ విషయము  ఏమిటి అంటే వెనుక గేటు నుంచి ప్రవేశించినప్పుడు  పక్కనే దత్త స్వామి (నాలుగు భుజములతో ఉన్న) స్వయంభూ విగ్రహము ఉందని నాకు తెలియక పోవటము ఒక విశేషము.    ఏది ఎప్పుడు తెలియాలో నిర్ణయించేది ఆ  స్వామి కానీ  మనము  కాదు కదా!

No comments:

Post a Comment