శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి, అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది. ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది. ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము నాకు తెలిసి ఉండటము చేత మా గురువు గారికి చెప్పాను. ఆయన నేను నీతో వస్తాను, మనము వెళ్లి వద్దాము అని అన్నారు. గురువు గారి తో వెళ్లి రావటము అన్నది మంచి విషయమే కదా అని అనుకొన్నాను. 2 రోజుల తరువాత, గురువు గారు నాకు రావటము వీలవదు, నీవు వెళ్లి రా, అని అనగానే ఇంక ఎవరిని తీసుకు వెళ్ళటము అని ఆలోచించి, ఇంకొక ఆప్త మిత్రులు సాధకులు అయిన శ్రీ ములుకుట్ల కృష్ణ మూర్తి గారికి చెప్తే ఆయన సంతోషముగా ఒప్పుకొన్నారు. ఇద్దరమూ కలిసి నర్సీపట్నం దగ్గరలో ఈ బలిఘట్టము వెళ్లి అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి కి చేరుకొన్నాము. అప్పటికి సాయంత్రము అయి పోయింది కాబట్టి రాత్రికి అక్కడే బస చేద్దాము అని అనుకొన్నాము. ఈ ప్రదేశమునకు చేరుకొనే లోపుల నా దృష్టి ఎందుకో ప్రక్కకు లాగి నట్లయి చూస్తే, అక్కడికి దగ్గరలో ఇంకొక కొండ మీద తెల్లటి భవనము ఆ సాయంసంధ్యా సమయములో మెరిసిపోతూ అక్కడకు రమ్మనమని పిలుస్తున్నట్లే అనిపించింది. నాతో వచ్చిన అయన కూడా దత్త భక్తుడే కాబట్టి ఆ విషయము ఆయనకు తెలియచేసాను. ఇవాళకు ఇక్కడ ఉండి, రేపు ఉదయము అక్కడికి వెళ్దాము అని అన్నారు. మా అదృష్టము ఏమిటి అంటే అక్కడ శ్రీ గోపాల్ బాబా అనే అవధూత ఉన్నారు. అయన తో నిద్ర చేసే అవకాశము దొరికినందుకు చాలా ఆనందము అయింది. మేము శ్రీ గురు చరిత్ర పారాయణము కొంత సేపు చేసిన తరువాత అక్కడి ఆశ్రమ నిర్వాహకులు అయిన చిన్న బాబు గారు ఆ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి, అక్కడ ప్రవహిస్తున్న ఉత్తర వాహిని అయిన కాలువ గురుంచి, అప్పటికి అక్కడ ఉన్న అవధూత శ్రీ గోపాల్ బాబా గారి గురుంచి విపులముగా చెప్పి మాకు అల్పాహారము ఏర్పాటు చేయించి పెట్టింఛిన తరువాత వారు, వారి ఇంటికి వెళ్ళిపోయారు. నాతో వచ్చిన ఆయన నాకు నిద్ర వస్తోంది అని పడుకొన్నారు. దత్త సంప్రదాయము లో అవధూత ల దర్శనము చేసుకోవటమే అదృష్టము అనుకొంటే వారితో నిద్ర చేయటము ఇంకా అదృష్టము అని తెలిసి ఉండుట చేత, నేను నిద్ర పోకుండా ఆయననే చూస్తూ మనసు లో గురు దత్త నామ స్మరణ చేస్తూ ఉండగా అయన నా వైపు చూసి ఒక సిగరెట్టు ఇచ్చి కాల్చు అన్నట్లుగా చూసారు. అప్పటికి అవధూతలు వారి అంతటికి వారు ఏమైనా ఇస్తే అది తీసుకొని వారు చెప్పినట్లు చేయాలి అని నాకు తెలియకపోవుట వలన, నా మనసు లో నాకు ధూమ పానము అలవాటు లేదు కదా అని అనుకొని గోపాల్ బాబా గారికి నమస్కారము చేయగానే, ఆయన ఫరవా లేదు నాకు ఇచ్చిన సిగరెట్టు వెలిగించి నాకు ఇచ్చేయి అన్నట్లు గా సంజ్ఞలతో చేసి చూపించారు. ఆయన చెప్పినట్లు చేసి ఆయనకు ఇస్తే దానిని పూర్తి గా దమ్ము లాగారు. అవధూత లు మన యొక్క కర్మలను కొంత వరకు అ విధము గా భస్మము చేస్తారని తరువాత తెలిసింది. గోపాల్ బాబా గారు ఎవరితోనూ ఎప్పుడు మాట్లాడరు. మనకు అర్ధము కాని ఏ భాష లోనో వారిలో వారు మాట్లాడు కొంటూ ఉంటారు. మనకు ఏమైనా చెప్పాలని పిస్తే మనకు అర్ధమయేలా చెప్తారు. నాకు కొన్ని సూచనలు చేసారు. అలా రాత్రి అంత గడిపి ఉదయముననే మా కాల కృత్యాలు తీర్చుకొని ఆయనకు దూరము నుంచే నమస్కారము చేసుకొని మేమిద్దరమూ క్రిందటి రోజు సాయంత్రము చూసిన ఆ భవనము వైపు బయలు దేరి చుట్టూ ప్రవహిస్తున్న ఉత్తర వాహిని ని దాటుకొని కొండ క్రిందకు చేరుకొన్నాము. 400 మెట్ల దాకా ఉన్నాయి, అవి ఎక్కి కొండ పైకి చేరుకొన్నాము. అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ అ గురువు గారి శిష్యుడు కౌపీనము తో ఉండి చక్కగా రైల్వే స్టేషన్ విశ్రాంతి గదుల లో ఉండే కుర్చీ లాంటి పెద్ద కుర్చీ లో రెండు కాళ్ళు చాపుకొని ప్రశాంతము గా శ్రీ క్రిష్ణ ధారావాహిక చూస్తొన్నారు. అంత దూరము నుంచి వస్తే కనీసము మన వైపు చూడకుండా హాయి గా ఎలా చూస్తున్నారో అని అనుకోవటము ఏమిటి, వెంటనే విధ్యుత్ సరఫరా ఆగి పోయింది. అప్పుడు మమ్మల్నిద్దరినీ చూసి ఎక్కడ నుంచి వచ్చారు, ఏమిటి విషయము అని అడిగారు. నేను నా విషయము క్లుప్తముగా చెప్పేటప్పటికి, అయన వెంటనే నీ లాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను అని మా ఇద్దరికీ కాఫీ ఇచ్చి, మీ గురువు గారిని తీసుకోని మళ్లీ ఒక సారి తప్పక రమ్మనమని చెప్పారు. వాళ్ళ గురువు గారు చిద్గగనానంద స్వామి అని, ఆయన, పాకలపాటి గురువు గారు, బెండపూడి సాధువు గారు ముగ్గురు సమ కాలీనులు అని, వారి గురువు గారు చుట్టూ పక్కల ఏజన్సీ గ్రామ వాసులలో చాలామందికి ఉపనయనము చేసి వాళ్ళ పేర్లకు ఆచారి నామములు కలిపి గాయత్రీ మంత్రము ఉపదేశించారు అని, అ ఆశ్రమము అధీనములో 10 ఆశ్రమములు ఆంధ్రప్రదేశమందు, ఒకటి బెంగళూరు లో కూడా ఒకటి ఉన్నట్లు, వారి ముఖ్య శిష్యుల లో భూమానంద మొదటి వారని, ఇప్పుడు ఈ ఆశ్రమము ను మిగిలిన శిష్యులు ఎవరూ పట్టించుకోని విషయము, ఆశ్రమము పరిస్థితి గురుంచి మీ గురువు గారి తో మాట్లాడాలి, తప్పక మీ గురువు గారిని తీసుకొని రమ్మని చెప్పి మమ్మలిని సాగనంపారు.
No comments:
Post a Comment