Tuesday, 30 December 2014

పిఠాపురం - తొలి రోజులు ...............

నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను.  అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే   విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు  చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు.  గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి,  నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు.  ఆయనంతకు ఆయనే  మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని,  ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ వచ్చని, అదీ కాక నా పరిస్థితులు తెలిసుకున్న వారిలా మీరు నాకు ఏమి ఇవ్వనక్కర లేదు అని దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని పిస్తోంది అని చెప్పారు కాబట్టి సరే అయితే మీ ఇష్టము అని చెప్పాను అని తెలియ చేశాను.  గురువు గారు ఒక క్షణము ఆలోచించి అయితే ఒక పని చేయి నాకు కూడా ఒక యంత్రము చేయించు అని అన్నారు.  గురువు గారికి ఎలా చెప్పాలో, ఏమి అవుతే అదే అవుతుంది అని మనసు లో అనుకొని, సవినయముగా అయ్యా, మీకుగా మీరు యంత్రము కావాలని నన్ను ఆయనను అడుగమని చెప్తున్నారు, ఆయనకు నేను చెప్పి అయన ఇస్తాను అంటే మీకు ఇప్పించగలను అని అన్నాను.  నా సంశయము గురువు గారికి అర్ధము అయి,  అవును నీ సాధన లో ఉపయుక్తము కోసము ఆయన ఇస్తానన్నాడు కానీ నీవు ఆయనను అడుగ లేదు కదా, సరే ఒక పని చేయి ఏమి అవాలో అదే అవుతుంది  ఆయనను అడిగి చూడు, అలా  కానీ పక్షము లో నీకు ఇవ్వబోయే యంత్రము నాకు ఇస్తే నేను నా దగ్గర పెట్టుకొంటాను అని చెప్పారు. ఆ యంత్రము పెట్టుకోవటము వలన ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తే నీ దగ్గర పూజ లో పెట్టు కోవచ్చు.   గురువు గారు అలా చెప్పిన తరువాత  సరే అలాగే చేస్తాను అని ఒక నమస్కారము చేసి పిఠాపురము వచ్చేశాను.  

No comments:

Post a Comment