Tuesday, 2 December 2014

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ............

ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయము తీసుకొనమని చెప్పినా మనసు చంచలము కదా, శ్రీ దత్తునే గురువుగా ఎంచుకొన్నాను కాబట్టి, పిఠాపురము అయితే సాధనకు ఇంకా ఉపయోగము ఎక్కువ అని అక్కడికే అడగాలి అని అనుకొన్నాను.  కానీ వెంటనే ఒక వేళ  పిఠాపురము ఇవ్వలేము అంటే ఏమి చేయాలి అని అనిపించింది. అది కాక  పొతే, అన్నవరము కూడా దైవ క్షేత్రమే కాబట్టి అది అయితే బాగుంటుందేమో, అని అనిపించగానే మళ్లీ గురువు గారు నీవు ఏమి అనుకొంటే అది అయిపోతుంది కాబట్టి జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయము తీసుకోమన్న విషయము గుర్తు కు వచ్చి, ఒక వేళ పిఠాపురము అయితేనే నేను పదోన్నతి తీసుకోవాలి  లేక పొతే తీసుకోకూడదు అని మనసు లో ధృడముగా నిర్ణయించుకొన్నాను.  ఇలా అనుకొన్న మరుసటి దినము నన్ను  అడిగితే పిఠాపురము అయితే నేను వెళ్తాను అని చెప్పాను. సరే అన్నారు.  కానీ సాయంత్రానికి మళ్లీ నీకు పిఠాపురము ఇవ్వడము కుదరదు, అన్నవరము వెళ్తావా, అని అడిగేటప్పటికి నేను ఆశ్చర్యపోయి, పిఠాపురము కాక అన్నవరము అయితే నాకు పదోన్నతి లేక పోయినా ఫరవా  లేదు, నాకు అక్కర లేదు అని చెప్పాను.  ఇలా జరిగిన విషయములన్ని గురువు గారికి చెప్పగానే, ఆయన యధాలాపము గా నీవు శ్రీ దత్తుని గురువు గా కొలుస్తున్నాను అంటున్నావు,  నీకు పదోన్నతి లేక పోయినా, నీ స్వంత ఇల్లు వదిలి పిఠాపురము వెళ్లి ఉంటూ సాధన చేసుకోలేవా? అని ప్రశ్నించేటప్పటికి ఒక్క సారి ఆశ్చర్యచకితుడినై గురువు ఇలాంటి పరీక్ష పెట్టారు ఏమిటి, ఏమి చేయాలి, స్వంత ఊరు, తల్లి తండ్రులు, స్వంత ఇల్లు వదిలి, నా సాధనకు పిఠాపురము వెళ్లి పోవటమా, అన్నింటి కన్నా గురువు కటాక్షము గొప్పది  కదా అని అనిపించి,  ప్రక్క ఊరు వెళ్లి ఎంత మంది పని చేయటము లేదు, నేను మాత్రము  ఎందుకు చేయ లేను అనుకొని, మా గురువు గారితో నేను పిఠాపురము లో ఉంటూ కాకినాడ లో పని చేస్తాను అని చెప్పాను.  అయితే ఎప్పుడో ఏమిటి, రేపే వెళ్ళు అని,  గురువు గారు అన్నారు.  మా వాళ్ళని ఒప్పించి నేను పిఠాపురము వెళ్లి ఉండి కాకినాడ పని చేయటానికి సిద్దమయాను. 1997 జూన్ 26 పిఠాపురము వెళ్ళాను.  అక్కడ ఇల్లు వెతుక్కొని నివాసము పూర్తిగా మార్చుకోడానికి సిద్ధమయాను.  2, లేక 3 రోజులు  పిఠాపురము నుంచి  కాకినాడ కు వచ్చేవాడిని.  శ్రీ గురు దత్తుని కృప వల్ల జూన్ 30 నాటికీ,  జూలై 1 వ తారీకు న పిఠాపురము కు వెళ్లి పదోన్నతి తో అక్కడ చేర మని బదిలీ చేశారు.  నేను సాధనకు నిలబడతానా లేదా అని పరీక్ష  చేసి, నా సాధనకు దారి చూపించిన శ్రీ గురు దత్తుని  కృపకు నిదర్శనము నకు సదా ఆయన సేవ కే  అంకితము అవ్వటము లో అతిశయము ఏముంది.  

No comments:

Post a Comment