ఒక్కొక్క గురువు వారి వారి అనుభవముల బట్టి, లేదా వారి గురువులు చెప్పిన విధముగా ప్రాణాయామము అంటే రేచక, పూరక, కుంభక క్రియలు రక రకాలుగా ఫలానా నిష్పత్తి లో ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ గురు కృప వలన నేను ప్రణవ సాధన లోనే ప్రాణాయామము అవుతుందని తెలుసుకొన్నాను. ప్రణవము అకార, ఉకార, మకార, నాద, బిందు, కళాత్మకము అని తెలుసుకొన్నాను. ,నేను మాత్రము గురు వాక్యంతు కర్తవ్యం అని సంపూర్ణమైన నమ్మకము తో నాకు వచ్చిన సూచనల ప్రకారము, అకార ఉకార మకారములు ఉచ్ఛారణ తక్కువ సమయము ఉంచి నాద స్థితి లో ఎంత వరకు ఉండ గలనో అంత వరకూ ఉండి శరీరమును ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టకుండా సాధన చేసే వాడిని. శరీరము లో నాడులు కొంత వరకు సాగే గుణము ఉంటుంది అని మనకు తెలిసిన విషయమే కదా! వాటి పరిధిని మించి సాగ తీస్తే అవి దెబ్బ తినే అవకాశము ఉంటుంది. ఆ ప్రకారముగా ప్రణవ సాధన చేస్తే, మన శరిరము ఆరోగ్య వంతమై యోగ సాధన కు అనుకూలము అవుతుంది. యోగ సాధన లో ప్రణవ సాధన మొదటి మెట్టు. ముందు సాధకుడు తాను స్వయముగా సాధిస్తేనే కదా ఇంకొకరికి ఉపయోగ పడగలడు. ఈ రకమైన ప్రణవ సాధన కాక ఇంకొక రకమైన ప్రణవ సాధన అంటే అకారములో తక్కువ సేపు ఉండి ఉకారములొ ఎక్కువ సేపు ఉండి మకారములో వెంటనే ఆపి నాద స్థితి కి అసలు వెళ్లక చేసే సాధన తనకు గాక తన చుట్టూ ఉన్న పర్యావరణ కాలుష్యము పోయి, సమతుల్యత కు ఉపయోగ పడుతుంది అని తెలుసుకొన్నాను. మనసును, శ్వాసను, ప్రణవ సాధన తో సమన్వయించి నియంత్రించ గలమని నాకు మా గురువు నుంచి వచ్చిన సూచన. ప్రాజ్ఞులు మన్నింతురు గాక. నేను ఈ రకముగా సాధన చేసే సమయములో ఒక నాడు మా గురువు గారు, నాయనా, నీవు మిర్యాలగూడ వెళ్ళ వలసి ఉంది, అక్కడకు వెళ్లి ఒకరి ఇంట్లో నీవు వారము రోజులు పాటు హోమము చేయ వలసి ఉంటుంది అని చెప్పారు. వెంటనే ఆనందముగా సిద్ధమయాను. ఎవరి ఇంట్లో చేయాలో ఆ యజమానురాలు 14 సంవత్సరముల నుంచి కాళ్ళు రెండు పని చేయక చక్రాల కుర్చీ లోనే ఆవిడ జీవనము సాగిస్తోంది, వాళ్ళకు 14 ఏళ్ళ కుమార్తె ఉంది అని చెప్పి ఏ రకమైన మంత్రము తో హోమము చేయాలో కూడా మా గురువు గారు చెప్పారు. గురువు మీద భారము వేసి నేను మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.
No comments:
Post a Comment