మరుసటి రోజు తెల్లవారు ఝామునే లేచి మేమంతా తయారు అయి గిరి ప్రదక్షిణ కు సిద్ధము అయాము. గుడి కి వెళ్ళినప్పుడు పాద రక్షలు ఉండ కూడదు కాబట్టి, అవి లేకుండానే బయలుదేరాము. ప్రదక్షిణము లో రమణ ఆశ్రమము నుంచి బయలు దేరి, దారి లో అరుణాచలేశ్వరుడి గుడి కి వెళ్లి స్వామి ని దర్శించుకొని మళ్లీ రమణ ఆశ్రమము నకు చేరుకొంటే ఒక ప్రదక్షిణము చేసినట్లు గా లెక్క అని, మా ప్రక్క ఆయన చెప్పారు. సుమారు 14 కిలో మీటర్లు ఉండ వచ్చు. మాకు మొదటి రోజు ప్రదక్షిణము నకు 6 గంటలు దగ్గరగా పట్టింది. నాకు మాత్రము 2 పాదముల క్రింద నీటి బొబ్బలు వచ్చేశాయి. కాలు తీసి క్రింద పెట్టటము కష్టమయింది. రెండో రోజు కుటుంబాల తో వద్దు, మనము ఇద్దరమే వెళ్దాము అని ఆయన చెప్పారు. అందుకని మేము ఇద్దరమే బయలు దేరాము. పాదముల క్రింద నీటి బొబ్బలు ఉండటము చేత నాకు అడుగు తీసి అడుగు వేయటము చాలా కష్టము అయింది. మా ప్రక్కన ఆయన నాతో పాటు ఓపిక గా నడుస్తూ మంచి విషయములు చెప్తూ 3 లేక 4 గంటల లో నడిపించారు. ఇవాల్టికి 2 ప్రదక్షిణములు చేశాను ఇంకా నడవటము కష్టము, 3 వ ప్రదక్షిణము చేయలేను అని అనిపించింది. రెండవ రోజు మా వాళ్ళు కూడా ఇంక మా వల్ల కాదు మేము అరవింద ఆశ్రమము రాము, మనము వెనకకు వెళ్ళిపోదాము అని పట్టు పట్టారు. చేసేదేమీ లేక నా పాదములు కూడా నడవటానికి నీటి బొబ్బలతో ఇబ్బంది గా ఉంది కాబట్టి గురువు కి మనసు లో క్షమాపణలు చెప్పుకొని వెనుకకు వెళ్ళడానికి సిద్ధము అయాము. రెండవ ప్రదక్షిణము తరువాత ఆశ్రమము లో ధ్యాన మందిరము లో కూర్చొని ధ్యాన మగ్నుడిని అయాను. ఎవరో వెనుక నుంచి ఇక్కడ దాకా వచ్చి 2 ప్రదక్షిణములు చేశావు, ఇక్కడ విరుపాక్ష గుహ చూడవా అని చెవి లో చెప్పినట్లు అయింది. ఈ విషయము మా ప్రక్క ఆయన కు చెప్పాను. దానికేముంది పదండి వెళ్దాము అని ఆశ్రమము లో నుంచే వెనుకకు కొండ మీదే విరుపాక్ష గుహ ఉంది, అందులోనే రమణ మహర్షి గారు కొన్నాళ్ళు ఉన్నారని చెప్పారు. మేము ఇద్దరమూ వెనుక నుంచి కొండ ఎక్కాము, అది మే నెల కాబట్టి కొండ బాగా వేడి ఎక్కి ఉంది. కాలు ఇలా పెట్టానో లేదో 2 పాదముల క్రింద నీటి బొబ్బలు చితికి పోయి ఎర్రగా పుళ్ళు అయి పోయాయి. అలాగే గురువు ను మనసు లో తలుచుకొంటూ కొండ ఎక్కి విరుపాక్ష గుహ లో కొంత సేపు ధ్యానము చేసుకొని అటు ప్రక్కగా దిగి మళ్లీ అరుణాచలేశుని దర్శించు కొని ఆశ్రమము చేరుకొన్నాము. ఆ విధముగా నాకు ఏమి తెలియక పోయినా 3 వ ప్రదక్షిణము కూడా నా గురు కృప వల్ల చేయగలిగాను. కొండ పైనుంచి విరుపాక్ష గుహ నుంచి కొన్ని ఫోటోలు తీశాను గాని, అవి ఎందుకో రావు అని అనిపించింది. ఈ లోపల మొదటి రోజు న ఒక కుర్రవాడు మాకు గది చూపించాడు కదా, అతను మా పిల్లలు స్నేహితులు అవటము చేత మరుసటి రోజు కి వెనుకకు టికెట్లు తీసుకొన్నాడు. 3 వ రోజు ఆశ్రమము దగ్గిర లోనే రామ సూరత్ కుమార్ అని ఒక అవధూత ఉన్నారని తెలిసి ఆయన దర్శనము చేసుకొందాము అని వెళ్ళాము. అ ఆశ్రమము లో ఆయన ఒక పెద్ద హాలులో దూరముగా కనిపిస్తున్నారు. అక్కడి నుంచే దర్శించు కోవాలి, దగ్గరకు అనుమతి ఇవ్వరు అని తెలిసి, అయన కు దూరము నుంచే ఒక నమస్కారము చేసుకొని ప్రక్కన ధ్యానము నకు ఇంకో పెద్ద హాలు ఉంటే, అక్కడకు వెళ్లి ధ్యానము చేస్తూ కూర్చొన్నాము. అ సమయము లో అలా ధ్యానము చేసుకొనే వారిలో, ఎవరినో కొంత మందిని అవధూత దర్శనమునకు పంపిస్తారని తెలిసింది. నా గురువు నే తలుచుకొంటూ మేము ఎలాగూ ఆయన ను చూశాము, పిల్లలకైనా అయన పాద స్పర్శ దొరికితే బాగుంటుంది అని ధ్యానము చేశాను. బయటకు వచ్చేటప్పటికి మా పిల్లలు ఆయన పాదములు ముట్టుకు వచ్చాము అని చెప్పారు. పిల్లలు ముందు హాలు దగ్గరే ఉండి ఆ అవధూత దగ్గరకు ఎవరైనా పంపిస్తారేమో అని నిరీక్షిస్తూ ఉన్నారట, ఈ లోపుల కొంత మందిని పంపిస్తూ వీళ్ళను కూడా లోపలికి పంపించారని చెప్పారు. గురువు కు మనసు లోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నాను. ఆ విధముగా మూడు రాత్రులూ అరుణాచలము లో రమణ మహర్షి ఆశ్రమములో సాధన ముగించుకొని, గురువు మనకు ఎంత వరకు అవకాశమిస్తే, అంత వరకే అని మనసు లో అనుకొని వెనుకకు బయలు దేరాము.
No comments:
Post a Comment