Wednesday, 19 November 2014

గురువు - రక్షణ

మనము నమ్ముకొనే దైవమును  కానీ గురువును  కానీ  ఎవరినైనా  కానీ   పూర్ణ విశ్వాసము తో నమ్మి  ఆయననే   అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అని  అనాలి.   అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు.   ఈ  విషయము  ఒక సారి పరిశీలిద్దాము.   కోతి  ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది.  ఆ  సమయము లో కోతి  పిల్ల,  కోతి కడుపుని పట్టుకొనే  ఉంటుంది.  పొరపాటున కోతి  పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే,    కోతి క్రిందకు దిగి  రాదు.   కోతి  పిల్ల  తనకు తాను పైకి  ఈ కొమ్మా,  ఆ  కొమ్మా  పట్టుకొని తన తల్లి   దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే వరకు పై నుంచి చూస్తూనే ఉంటుంది.    అలాగే  శిష్యుడు కానీ,  భక్తుడు కానీ తనకు తాను  గానే,  భగవంతుడు కానీ గురువు కానీ ఎవరి దగ్గర కైనా  అనన్య శరణాగతి తో చేరుకోవాలి.  ఒక సారి  మనము పట్టుకోవాలే  గాని  గురువు, భగవంతుడు ఎవరైనా వారి కృపా కటాక్ష వీక్షణములు మన మీద  ఎప్పుడూ కురిపిస్తూనే  ఉంటారు.  మనము  గురువు గారితో మర్కట కిశోర న్యాయము గా ఉన్నట్లయితే, అప్పుడు కాదు,  ఎల్ల వేళలా, ఆయన మార్జాల కిశోర న్యాయము గా మనను చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మార్జాల కిశోర న్యాయము ను కూడా ఒక సారి పరిశీలిద్దాము .   పిల్లి తను  పిల్లలు పెట్టిన తరువాత, ఆ పిల్లలను జాగ్రత్త గా  తన ముని పంటి తో సుకుమారము గా  తన చిన్న పిల్లల మెడను పట్టుకొని సురక్షితమైన ఏడు (7) ప్రదేశముల లో మారుస్తూ పెంచుతుందని  మన అందరికి తెలిసిన విషయమే.  అలాగే గురువు   తన శిష్యులను  తన పిల్లల తో సమానముగా  ఒక కొడుకు గా చూస్తూ మంచి చెడులు చెప్తూ  శిష్యుడు ఉన్నతి కి దారి చూపిస్తూ ఉండి, తనంత వాడుగా,  వీలయితే తన కన్నా పెద్ద వాడు గా అయి ఇంకో పది మందికి ఉపయోగపడేలా చేయాలనీ చూస్తూ ఉంటాడు.  గురువు గారి లో లోపము ఏమి ఉండదు, పట్టుకొన్న  మనము ఎంత  దాకా  ఆయన   చెప్పిన విషయములు శ్రద్ధ గా పాటిస్తున్నాము  అని మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.  కూర్మ కిశోర న్యాయముగా ఆయన (గురువు గారు) ఎప్పటికప్పుడు మనను చూస్తూ ఉంటారు.  అది ఎలాగంటే తాబేలు తను పిల్లలు పెట్టిన తరువాత సముద్రపు ఒడ్డున ఇసుకలో పెట్టి కప్పి దాని మీద తను కూర్చొని ఉంటుంది.  పిల్లలు తాము  బయటకు వచ్చిన తరువాత వాటి అంతటికి అవే నడక నేర్చు కొంటూ  ఉంటే దూరము నుంచి నేను మిమ్ములను జాగ్రత్త గా చూస్తూనే వున్నాను,  ధైర్యముగా ముందుకు నడవండి అని తన చూపు తోనే వాటికి  ధైర్యము చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా వెనుక తమను చూసే వాళ్ళు ఉన్నారని ధైర్యముగా నడుస్తూ ఉంటాయి .  ఆ  విధముగా గురువు   కూడా తన దృక్  దీక్ష తో శిష్యులను  కాపాడుతూ, ధైర్యము గా  తన శిష్యులు ముందుకు నడిచేలా  చూస్తూ ఉంటాడు .

No comments:

Post a Comment