Sunday 23 November 2014

గురువు - శిక్షణ

నాలుగు ఆశ్రమములు అయిన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము కాకుండా,  ఐదవది,  విలక్షణమైన  అయిన అవధూత ఆశ్రమము దత్త సంప్రదాయము లో విశిష్టమైనది.  'అ' అంటే ఆది అంతము లేని వాడు, సర్వ వ్యాపి, ఆశా పాశములకు లోను కాని  వాడు,  'వ' అంటే  గతించిన దాని గురుంచి గాని, రేపు జరగపోయే దాని గురించి గాని చింత లేక సదా  వర్తమానము నకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, విషయ వాసనలు లేని వాడు, 'ధూ' అంటే  ధూళి ధూసరిత దేహము కలవాడు అనగా దేహమునకు ప్రాముఖ్యత ఇవ్వని వాడు, 'త'  అంటే సదా  తత్వ చింతన  చేస్తూ, మౌనము  గా ఉండేవాడు ఈ లక్షణములు  ఉన్నవాడు అవధూత అని అర్ధము.  ఇంకా విపులముగా తెలుసుకోవాలంటే అవధూతోపనిషత్తు లో అన్ని ఉన్నాయి.  అవధూత యొక్క దర్శనము, స్పర్శనము, సంభాషణము మనకు దొరికినట్లయితే ,  మన జన్మ ధన్యమైనట్లే.  అటువంటి అవధూత శ్రీ గోపాల్ బాబా గారి తో నాకు అనుభవము అవటము నా పూర్వ జన్మల సుకృతమే కదా!  తరువాత మా గురువు గారి కి  అన్ని   విషయములు తెలియ చేశాను.  ఆయన కూడా ఈ సారి మనము తప్పకుండా వెళ్దాము అని అన్నారు.  మేము బయలు దేరిన రోజు ప్రకృతి మమ్మల్ని ఆశీర్వదిస్తోందా  అన్నట్లు చిన్న గా వాన చినుకులు అప్పుడు అప్పుడు పడుతూ వాతావరణము చాలా ఆహ్లాదకరము గా ఉంది.  మేము తుని వెళ్లి అక్కడ నుంచి నర్సీపట్నము  బస్సు ఎక్కి వెళుతుంటే కోటనందూరు దాటి బలిఘట్టము ఇంక దగ్గర కు వచ్చేస్తున్నాము అని అనుకొంటూ ఉంటే , దారిలో బస్సు లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి.  రహదారి కొంత మేరకు కొట్టుకు పోయింది.  ఎటు బస్సులు అటే అని అంతా అనుకొంటున్నారు.    మా గురువు గారు కూడా  నేను సిగరెట్టు  కాల్చుకొని వస్తాను అని బస్సు దిగారు.   ఇంక ఇవాల్టికి పని అవదేమో అని ఇలా అనుకొన్నానో  లేదో, క్రిందకు దిగిన మా గురువు గారు లోపలి కి  వచ్చి గురువు గారు నడిచి వెళ్ళమంటున్నారు, పద అని అనగానే మా లగేజి తీసుకోని నడుస్తూ బయలుదేరాము. సుమారు 10 కిలోమీటర్లు దాటి ఉంటుందేమో త్వరగా వెళ్ళాలి అని నేను కొంచెం వేగంగా అడుగులు వేస్తుంటే, వెనక నుంచి మా గురువు గారు, నీవంత  వేగంగా నడిస్తే నేను రాలేను, మెల్లగా నడు అని అన్నారు.  చేసేది లేక ఎప్పుడైతే అప్పుడే అవుతుంది అని అనుకొన్నాను.  చివరకు మేము బలిఘట్టము  చేరుకొన్నాము.  కొండ ముందు నుంచి మెట్లు ఉన్నాయి అని నేనంటే నేను అంత దూరము నడవ లేను ఇటి నుంచే వెళ్దాము అని గురువు గారు అన్నారు.  కొండ క్రింద ఈ వైపు ఇంకొక గురువు గారి ఆశ్రమము, బ్రహ్మలింగేశ్వర స్వామి పురాతన మందిరము దాటి కొండ ఎక్కడము మొదలు పెట్టాము. కొంత దాకా  గురువు గారు  ఎక్కి   ఇంక నా వల్ల  కాదు, ఇంక ముందుకు వద్దు వెనక్కు  కాకినాడ వెళ్లి పోదాము అని అన్నారు.  అడుగు అడుగు నా ఈ పరీక్షలు ఏమిటి అని లోపల అనుకొని,  నిలబడండి నేను ముందు ఏదైనా దారి ఉందేమో చూస్తాను అని కొంచెం పైకి ఎక్కి చూస్తే, చిన్న నడక దారి ప్రక్కనే కనిపించింది. శ్రీ గురు  దత్తుని కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని, క్రిందకు దిగి మా గురువు గారికి చేయి ఇచ్చి పైకి లాగి ఆ ఇరుకు కొండ దారిలో ఆశ్రమమునకు చాలా మటుకు దగ్గరికి వచ్చేశాము.  సుమారు 400 మెట్లు అని చెప్పాను కదా ఇలా దగ్గర దారి లో కష్ట పడి  ఎక్కితే కేవలము 30, 40 మెట్లు తో  ఆశ్రమము  పైకి చేరుకొన్నాము.  అక్కడ కూడా గురువు గారు నేను విశ్రాంతి తీసుకొంటాను నన్ను లేప వద్దు అని అయన పడు కొన్నారు. గురువు చెప్పినది చేయడము తప్ప శిష్యుని కి వేరే దారి  లేదు.  ఈ మార్గము లోకి వచ్చిన తరువాత మన జీవితము మన చేతుల లో లేదు, ఏమి జరిగినా అంత మన మంచికే అని పూర్ణ విశ్వాసము ఉంచి మనము నడిస్తే తప్పక గురువు లు ఎవరైనా దారి చూపించి మనలను గమ్యము చేరుస్తారు అని అర్ధమవుతోంది కదా!  అ తరువాత మా గురువు గారు లేవటము,  ఆ గురువు గారి తో మాట్లాడటము, తదుపరి కార్యక్రమముల గురుంచి నిశ్చయించు కోవటము అన్ని సజావుగా అయిపోయాయి. ఇద్దరు గురువులు మాట్లాడు కోవటము, అ సమయము లో మధ్య మనము ఉండటము మన అదృష్టము.  అలాంటి అవకాశములు  మనము (సాధకులు)  జాగ్రత్త గా ఉపయోగించుకోవాలి.

No comments:

Post a Comment