నెమ్మది గా నా సాధన కొనసాగుతోంది. ఆ మధ్య లో మా చుట్టము ద్వారా దత్తోపాసకులైన శ్రీ విట్టల్ బాబా గారిచే వెలువరించ బడిన శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము శ్లోక, తాత్పర్యముల తో సహా ఉన్న పుస్తకము నా చేతికి అందింది . అ పుస్తక ప్రాశస్త్యం అప్పట్లో నాకు అంత తెలియక ఒక ప్రక్కన పెట్టాను. శ్రీ గురు చరిత్ర పారాయణము ప్రతి దినము చేస్తూనే ఉన్నాను. అలాగా కొన్నాళ్ళు చేసే సరికి నా సోదరుడి స్నేహితుడు నా తమ్ముని ద్వారా నేను పారాయణము చేస్తున్న సంగతి తెలుసుకొని అతను నా దగ్గర కు వచ్చి శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము ఇచ్చి ఇది మీరొక సారి చూసి ఇవ్వండని ఇచ్చి వెళ్లి పోయాడు. అప్పటికి మా గురువు గారు ఇచ్చే సూచనలు మేరకు నా యోగ సాధన కూడా చేస్తూనే ఉన్నాను. సందర్భము గుర్తు లేదు కానీ అన్నవరము దాటి వెనుకకు కాకినాడ కు వస్తున్న సమయము లో కొండ కన్నా చాలా ఎత్తుగా దత్త స్వామి లీల గా కనిపించారు. మనసు లోనే ఆయనకు నా నమస్కారములు తెలియ చేసుకొన్నాను. ఆ తరువాత ఇంటికి వచ్చి శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము చూసి చదివి, చాలా బాగుంది, ఇలాంటి పుస్తకము మన దగ్గర ఉండాలి అని అనిపించింది. మా తమ్ముడి స్నేహితుడు రావటము, అ పుస్తకము తీసుకు వెళ్ళటము అయి పోయింది. ఇచ్చే ముందు ఆ పుస్తకము ఎవరి ద్వారా వెలువడిందీ, అ చిరునామా వ్రాసు కొని ఉంచు కొన్నాను. ఆ పుస్తకము మచిలీపట్టణం లో ఉన్న శ్రీ పోతాప్రగడ సుబ్బారావు గారు అనే ఆయన తన మణి పీఠం ద్వారా శ్రీ గురు దత్తుని ఉపాసనా క్రమము అంతా తెలియ చేసారు. కొన్ని రోజులకు మిగిలిన పుస్తకములు సర్దుతూ ఉంటే శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము అనే పుస్తకము మళ్లీ కనిపించేసరికి, అ పుస్తకములో ఏమి ఉన్నదో అని దానిని పూర్తిగా చదివి, దాని లో కూడా యోగానికి సంబందించిన విషయము లను చూసి నా పూజ కార్యక్రమములో దిన చర్య గా చదువటం మొదలు పెట్టాను. ఒక రోజున గాయత్రీ జపము చేస్తున్నప్పుడు నన్ను ఒక చోట స్థిరముగా ఆసనము మీద ఉండనీ కుండా విపరీతమైన ఉష్ణము ఇబ్బంది పెట్టింది. ఆ రోజు అనుకోకుండా నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా జపము మానే ప్రశక్తి లేదు అని మనసు లో ధృడముగా నిశ్చయించుకొని బలవంతముగా దొర్లుతూ పూర్తి చేశాను. మళ్లీ మరుసటి రోజు పూజా కార్యక్రములతో పాటు మిగిలినవి పారాయణములు అన్నీ మాములుగా జరిగినవి.
No comments:
Post a Comment