Friday, 21 November 2014

ఏకోన్ముఖ సాధన

నాకు  దత్తాత్రేయ వజ్ర కవచము నిత్యమూ చదవటము,   శ్రీ గురు చరిత్ర నిత్య  సప్తాహ పారాయణము  కూడా ఒక అలవాటు అయింది.  నెమ్మది గా మనసు లో ఇన్ని విధములు గా ఇంత మంది దేవీ దేవతలను మనము కొలవ వలసి ఉందా, ఎవరో ఇష్టమైన ఒకే దేవుడు నో,  దేవతనో మనస్పూర్తి గా  కొలిస్తే ఫలితము ఎక్కువ కదా! అని అనిపించటము మొదలైంది.  ముందు యుగాల లో  ఎక్కువ మంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు కానీ పూజా విధానము లు తక్కువ.  భగవంతుడు నిరాకారుడు కదా! తరువాత తరువాత అందరూ ఎక్కువ కాలము తపస్సు చేస్తూ ఉండ లేక నెమ్మది గా భగవంతునికి లేదా భగవతికి వివిధ  రూపాలు  కల్పన చేసి  విగ్రహ పూజా విధానము అమలు లోకి తెచ్చారు.  ఆ  పని అవాలంటే  ఆ దేవుడి ని,  ఈ పని అవాలంటే ఈ దేవత ని,  పూజ చేయాలి అని మొదలు పెట్టారు.   ఇంక అక్కడ నుంచి ఈ దేవుడు ముఖ్యము ఆ దేవత ముఖ్యము, ఇద్దరి లో ఎవరు ముఖ్యము అంటూ  విధానము లో  చీలికలు మొదలైంది. ఈ విధమైన ఆలోచనలు నాలో మొదలై,  ఎవరో ఒకరినే నమ్ముకొని నా సాధన కొనసాగించాలి అని నిర్ణయించు కొన్నాను.  ఆ ఒక్కరూ ఎవరో ఎందుకు   దత్త స్వామి నే కొలిస్తే సరి పోతుంది కదా అని అనుకొన్నాను.  అప్పుడు నా  దగ్గర ఉన్న దత్త మంత్ర సుధార్ణవము చదివిన తరువాత  దత్తాత్రేయునే కొలవాలని ధృడముగా మనసు లో నిశ్చయించుకొని ఏకోన్ముఖ సాధన మొదలు పెట్టాను.  ఆయన నే మానసికము గా గురువు గా నిశ్చయించు కొని నా సాధన కొనసాగించాను.  శ్రీ దత్తుని గురువుగా నిశ్చయించు కొన్నతరువాత  నా సాధన క్రొత్త మలుపు తిరిగింది.  యోగానికి మూలము శ్రీ దత్తుడు  అయితే  యోగ ప్రకాశకుడు శ్రీ కృష్ణుడు.  అయితే ఇద్దరు కూడా బహు కొద్ది మంది కి మాత్రమే యోగము చెప్పినట్లుగా మనకు పుస్తకముల ద్వారా  విశదము అవుతున్నది. నేను శ్రీ దత్తుని గురువు గా నిశ్చయించు కోవటము లో,  నాకు యోగము గురుంచి వచ్చే సూచనలు కూడా ఇంకా ఎక్కువ  బలము చేకూరింది. ఈ రకముగా చేసుకొంటూ ఉండగా శ్రీ గురు దత్త వైభవము అనే పుస్తకము గురుంచి మీకు తెలియచేసాను కదా, ఆ  పుస్తకమును ఎలా అయినా ఒకటైనా సంపాదించాలి  అని వెంటనే మచిలీపట్నము వెళ్ళాను. వారినీ వీరినీ అడుగుతూ  శ్రీ పోతాప్రగడ సుబ్బారావు గారి ఇంటికి చేరుకొన్నాను.  అ సమయానికి వారి కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు. వారు వారి అబ్బాయి తప్ప,  అందరూ ఇంటి ముందు ఉన్న  కార్లలో ఎక్కి సిద్ధముగా ఉన్నారు.   నన్ను చూడగానే ఏ మాత్రమూ విసుగు లేకుండా ఏమిటి బాబు నాతో ఏమి పని అని అడిగారు. సమయము తక్కువ  కాబట్టి వారికి  నేను శ్రీ గురు దత్త వైభవము పుస్తకము కోసము వచ్చిన విషయము నేరుగా తెలియచేశాను.  వెంటనే ఆ పుస్తకము మళ్లీ పునర్ముద్రణ వేయించ లేదు, అని వారి అబ్బాయిని ఏమైనా ఒకటి ఉంటే వెతికి ఇమ్మని చెప్పారు.  కానీ ఒక్కటి కూడా లేదు అని వారి   అబ్బాయి చెప్పగానే ఆయన తనది అని వ్రాసుకొని సంతకము చేసుకొన్న పుస్తకము నా చేతిలో పెట్టేటప్పటికి వారికి వారి గొప్ప తనానికి నా  మనసులోనే నమస్కారము చేసుకొని, శ్రీ గురు దత్తుని  కి  నా మీద ఉన్న దయ కు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొంటూ  బయటకు వచ్చి తిరుగు ప్రయాణము నకు సిద్ధమవుతూ ఉండ గా,  నాకు కొంచం దగ్గరలో ముందు ఒక ఉన్మత్తుడు నవ్వుతూ నా వైపు చూస్తూ వెళ్తుంటే  నా గురువు నన్ను ప్రత్యక్షముగా ఆశీర్వదిస్తున్నారా అని అనిపించి చాలా ఆనందము కలిగింది.  శ్రీ గురు దత్త వైభవము ఒక పుస్తకమైనా సంపాదించాలి అని అనుకొంటే, ఏకముగా  ఆ పుస్తక సంకలన కర్త  చే తన పుస్తకమునే తన  చేతుల మీదుగా అంద చేయించిన నా  గురువు అయిన శ్రీ గురు దత్తుని కృప కు నిదర్శనము కాదా!  (జై గురు దత్త)

No comments:

Post a Comment