కలి యుగములో శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారము, శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలమైన పిఠాపురము లో వృత్తి పరముగా పని చేయుటకు అవకాశము ఇచ్చిన శ్రీ గురు నకు మనసా, వాచా, కర్మణా, ప్రణామములు తెలుపు కొంటున్నాను. ప్రవృత్తి పరముగా నా సాధన లో ఎన్నో రకముల పరీక్షిస్తూ, అనుభవములు ఇచ్చి, నన్ను తన మార్గము లోనికి శ్రీ దత్త స్వామి తీసుకొన్న విధానము ఇంతకు ముందు మీకు తెలియచేశాను. ఏ కొద్ది మంది కైనా, లేక ఒక్కరికి అయినా సాధన లో ఉపయోగపడితే శ్రీ గురుడు దత్తాత్రేయుడు నా జన్మ కు సార్ధకత ఇచ్చి నట్లు గా భావిస్తాను. శ్రీ గురుడు స్మరణ మాత్ర సంతుష్ఠుడు. మనసారా శ్రీ గురుని స్మరిస్తే ఆయన మనను తన వాడిని చేసుకొని మార్గ దర్శకత్వము చేసి సాధన లో ముందుకు నడిపిస్తాడు. ఒక సారి మనను తన వాడు గా చేసుకొన్న తరువాత ప్రారబ్ధ కర్మ లను అన్నింటిని ఒక్క సారే అనుభవింప చేసి కడిగిన ముత్యము లా చేసి, తనంతటి వాడు గా తయారు చేస్తాను అని అంటాడు. ఎంతలా పరిక్షిస్తాడు అంటే ఏ క్షణమైనా ఈ సాధన వద్దు అనుకొని, తనను వదిలి పారిపోయేలా చేస్తాడు. కానీ అన్నిటికి ఓర్చుకొని నిలబడితే మనను త్వరగా దగ్గరకు చేర్చుకొంటాడు. ఎప్పటికి అప్పుడు ఈ మాయా ప్రపంచము నుండి కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక్క సారి మన అందరికి తెలిసిన చిన్న విషయము గుర్తు చేసుకొందాము. మన ఇళ్ళలో పూర్వ కాలములో తిరుగలి ఉండేది కదా, మనలో కొంత మందైనా చూసే ఉంటాము. క్రింద ఒక రాయి దానికి మధ్య లో ఒక చిన్న కొయ్య గురుజు, దాని ఆధారముగా పైన మధ్య లో ఒక చిన్న రంద్రము తో ఇంకొక రాయి, దానికి ఒక ప్రక్కన చిన్న కొయ్య పిడి పట్టుకొని పిండి ఆడుటకు వీలుగా ఉండేది కదా. తిరుగలి పై రాయి మధ్య లో పప్పు వేయించి వేసి మన పెద్ద వాళ్ళు ఆడేవారు గుర్తు వచ్చి ఉంటుంది. మధ్య లో వేసిన పప్పు రెండు రాళ్ల మధ్య లో నలిగి నలిగి పిండి రూపములో చుట్టురా పడేది. అయితే క్రింద రాయి మధ్య కొయ్య బురుజు చుట్టూ కొంత పప్పు అలాగే ఉండి పోతుంది, కానీ ఆ పప్పు ఏ నిముషమైనా గురుజు ను వదిలి రెండు రాళ్ల రాపిడి లో పడితే అది పిండి అయిపోతుంది కదా. ఇక్కడ చిన్న విషయము ఆలోచిద్దాము. ఈ సంసారం సాగరము లో మన అందరమూ నలిగి పోతూనే ఉన్నాము. తిరుగలి లో మాదిరి గా క్రింద రాయి మధ్య గురుజు మాదిరి భగవంతుని కానీయండి, ఒక గురువు ని కానీయండి ఆయననే మర్కట కిశోర న్యాయము గా పట్టుకొంటే, అయన మార్జాల కిశోర న్యాయము గా మనను కాపాడుతాడు. ఏ మాత్రము ఆదమరిచి మనము మాయకు లోబడిపోయామా మళ్లీ ఈ సంసారం సాగరము లో పడిపోతాము, తస్మాత్ జాగ్రత! సదా మెలుకువ తో ఆయననే స్మరించటము మన కర్తవ్యము.
No comments:
Post a Comment