Sunday, 9 November 2014

మార్గాన్వేషణ .........

మా గురువు గారు  ఆయనకు చూడమని  వచ్చిన జాతకములు అన్ని  నాకు  పంపించి నన్ను ఆ తెచ్చిన వారికి ఫలితములు  చెప్పమని చెప్పేవారు.   కొన్ని దినములు ఇలా  గడిచింది. ఒకఅమ్మాయి  జాతక చక్రము వస్తే దానిని పరిశీలించి దాని ఫలితములు ఏమి చెప్పాలో నిర్ణయించుకొని, సాధన లో  నేను  చేస్తున్నాను అనే భావనో   ఎందుకో మనసు లోకి వచ్చి  ఈ జాతక చక్రము తాలూకా ఆ అమ్మాయి  ఎలా ఉంటుంది అని చూడాలని పించి మనసులో అనుకొన్నాను.  నేను జపములో ఉంటే  ఒక అమ్మాయి ముందుకు వెనకకు నడుస్తూ కనిపించింది.  ఆ మరునాటి ఉదయము ఆ అమ్మాయి తండ్రి  వస్తే అతనికి చెప్పవలసినది చెప్పి,  మీ అమ్మాయి ఈ పోలికలలో ఉంటుందా అని అడిగాను.  చిత్రమేమిటి  అంటే మా అమ్మాయి ఫోటో  జేబులో ఉంది అని చెప్పిఅయన  ఇచ్చారు.  ఆశ్చర్యము! నాకు కనిపించిన అమ్మాయి, ఫోటో లో ఉన్న అమ్మాయి  ఒక్క  లాగానే అచ్చు వేసినట్లుగా ఉన్నారు.   అయన వెళ్ళిన తరువాత  ఈ అనుభవము  ఎవరితో పంచుకొంటాను, నా భార్య తో తప్ప.  ఆమె అమాయకముగా మీ సాధన ను  ఇలా ఉపయోగించారా అని అడిగింది.  వెంటనే నా గురువు ఇలా ఎందుకు చేశావు?  అని మందలించారా అని అనిపించింది.  ఆ తరువాత  నేను జాతకములు చూడటము తగ్గించు కొన్నాను.  నా అదృష్టము  కొద్దీ  కొన్ని రోజుల లోనే   నాయనా, నీ గురువు నీకు కనిపించాలి  అంటే నీవు,  నాకు వచ్చే సూచనలు  నీకు నేను చెప్పినది చెప్పినట్లుగా,  నీవు జ్ఞప్తి ఉంచు కొని సాధన చేసినట్లయితే,   నీ గురు కటాక్షము నీకు లబిస్తుంది అని జాతకములు నేర్పిన గురువు గారే నాకు దారి చూపించారు. ఇంకో విషయము కూడా జ్ఞప్తి లో వుంచుకో నేను నీకు చెప్పిన విషయములు ఇంకొక సారి  అడిగితే  నేను చెప్పలేను.  నీవు శ్రద్ధగా  విని జాగ్రత్తగా చేసుకోవలిసిన బాధ్యత నీదే సుమా! గుర్తుంచుకో అని హెచ్చరించి  ఆయనకు వచ్చిన సూచనలు వచ్చినవి  వచ్చినట్లు గా నాకు తెలియ చేస్తూ ఉండేవారు.  అలా నా  సాధన  ప్రారంభము అయింది.   అప్పట్లో  ఒక నాడు   మా ఇంటికి కొంత మంది  వచ్చారు. వారిలో ఒకరు   మీ పేరు ఏమిటి? అని అడిగితే,   పేరు  చెప్పడము జరిగింది. ఆ  వచ్చిన వారిలో ఇంకొకరు  అదేమిటి మీ పేరు ముందు  వేంకట  కనిపిస్తోంది, మీరు చెప్పుట లేదు  అని అడిగారు.  వెంటనే  అప్పటికే  సాధనలో ఉన్న నేను వారిని సవినయముగా మీరు ఏ కార్యక్రమములు చేస్తుంటారు అని అడిగాను.  అయన కూడా అందుకనే  మేము  ఇవన్ని మాట్లాడ వలసి వస్తుంది కాబట్టి ఎక్కడికి రాము అని అన్నారు.  పోనీయండి, ఫరవాలేదు మీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పండి  అని నేను అన్నాను.   అది  సరే  ముందు  నీవు అసలు ఏమి చేస్తున్నావో  అది చెప్పు అని అడిగారు.  నేను కొంచం తర్జన భర్జన చేసుకొని అడిగింది,  నా కన్నా సాధన లో ముందు ఉన్నవారిగా నిర్ణయించుకొని  నేను చేసేది తెలియ చేశాను.  వెంటనే ఆయన అలా ఎలా చేస్తున్నావు నీవు గృహస్థువి  కదా అని వాళ్ళు వెళ్ళిపోయారు.    నేను నా గురువు ఏమి చెప్తే అదే చేస్తున్నాను అనుకొని  ఇంకా శ్రద్ధ గా చేయడము ప్రారంభించాను.  గురువు చెప్పినది పూర్తి  నమ్మకము తో చేయడమే గాని  ఇంకొక ఆలోచన చేయకూడదు అని అది నా గురువు చేసిన సూచనగా తీసుకొన్నాను.  అప్పుడు  నాలో విచిత్రముగా  ఒక  ప్రశ్న ఉదయించింది.

No comments:

Post a Comment