ప్రాణికోటికి ఈ భూమి మీద నివసించాలి అంటే శ్వాస అన్నది ముఖ్యము. శ్వాస అన్నది ఉచ్చ్వాస నిశ్వాసల తో కూడి ఉన్న విషయము మన అందరికి తెలిసినదే. మన చుట్టూ ఉన్న గాలి లో ప్రధానమైన వాయువులు ఐదు, అవి వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వాయవులు, ఉప వాయవులు ఐదు, అవి వరుసగా నాగ, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయ అని ఉప వాయువులు. ఇవన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఈ శరీరమును నడిపిస్తూ ఉంటాయి. శరీరమంతకును ముఖ్య ప్రాణము ఒక్కటే. అది చేయు పనిని బట్టి హృదయమందు ఉండి ఉచ్చ్వాస నిశ్వాస రూపమున 'ప్రాణ' మనియు, పాయూపస్థ స్థానముల యందు ఉండి, మల మూత్ర విసర్జనము గావించుచు 'అపాన' మనియు, శరీరమందంతటను వ్యాపించినదై కన్నులు, చెవులు, కాలి మడమలు, పిరుదులు, ముక్కు నను వ్యాపించినదై 'వ్యాన' మనియు, కుత్తుక స్థానమున 'ఉదాన' మనియు నాభి ప్రదేశమున భుక్త పీత అన్న జలములను దేహము నందు అంతటను సమముగా పంచుచూ 'సమాన' మనియు సంచరించు చుండును. ఇంక ఉప వాయువులు ఐదు, కుత్తుక నందు అన్ని వస్తువులను చూచునట్లు చేయుచు, అది కాక వాంతులను పుట్టించుచు 'నాగ' అనియు, కను రెప్పలను తెరుచునట్లు, మూయునట్లును, చేయుచు 'కూర్మ' అనియు తుమ్ము వచ్చునట్లు చేయుచు 'క్రుకర' అనియు, ఆవలింపులు, త్రేనిపులను పుట్టించుచు 'దేవదత్త' అనియు, ప్రసవ సమయమున వెలుపలకు నెట్టునది, ఇది కాక దేహము లో మరణానంతరము కూడా వదలక దహనము వరకూ దేహములో ఉండి దేహమునకు వాపు కలిగించి యుండునది 'ధనంజయ' అనియు పని చేయు చుండును. శ్వాసను ప్రాణాయామము ద్వారా నియంత్రించుట వలన జీవన ప్రమాణము మన చేతిలో ఉంటుందని ఇంతకు ముందు తెలుసుకొన్నాము. ఇప్పడు శ్వాసకు మనసుకు సంబంధము ఏమిటో తెలుసుకొనుటకు ప్రయత్నము చేద్దాము. మనసు నిలకడగా ఉంచ గలిగితే మన ప్రమేయం లేకుండానే శ్వాస ఆగుతుంది, ఇంకో రకముగా చూస్తే శ్వాస ఆగితే మనసు నిలకడగా ఉంటుంది. ఇది పరస్పర అవినాభావ సంబంధం అని మనకు సాధన లో అవగతమవుతుంది. ఇప్పుడు ప్రాణాయామము అంటే ఏమిటో చూద్దాము. ప్రాణ వాయువు శరీరము నకు ముఖ్యమైన ప్రాణము అని తెలుసుకొన్నాము. ప్రాణాయామము లో రేచక, పూరక, కుంభకము మూడు క్రియలు ఉంటాయి. అంటే గాలిని లోపలికి పీల్చుట, వెలుపలకు వదులుట, నిలిపి ఉంచుట, అనే క్రియలను ప్రాణాయామము అని అంటారు.
No comments:
Post a Comment