Wednesday 31 December 2014

ఏక ముఖ దత్త దర్శనము

మరుసటి దినము యంత్రము ఇస్తాను అని చెప్పిన ఆయన  పోలికలు బట్టి  చిరునామా తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి గురువు గారు,  ఆయన కూడా ఒక యంత్రము కావాలి అని అడిగిన విషయము చెప్పాను.  ఆయన ఒక విశ్వ బ్రహ్మ,  తన పనుల తో పాటు,  యంత్రములు కూడా  తయారు చేసి ఇవ్వటము అలవాటు అని చెప్పారు.   ఆయన,   నేను ఎవరో తెలియకనే యధాలాపము గా యంత్రము ఇస్తానని చెప్పటము ఏమిటి, అదీ నేను దత్తోపాసకుడిని అని తెలియక పోయినా దత్త యంత్రము ఇద్దామనుకోవటము ఏమిటి, ఆయన కు ఏ  దత్త యంత్రము ఇవ్వాలి అని ఆలోచిస్తూ,  ఆయనకు తెలిసిన దత్త యంత్రము లలో ఏమి ఇవ్వాలో నిశ్చయించు కొన్నట్లు గా  నాకు చెప్పారు.  ఆ యంత్రము ప్రతి  చూడగానే నాకు యోగము నకు ఉపయుక్తము గా అంగ న్యాస, కర న్యాసము ల తో ఉండటము చాలా ఆనంద పడ్డాను.  ఆయన కు మళ్లీ కలుస్తాను అని చెప్పి వచ్చేసాను.  ఆ సమయము నకు నాకు దత్త స్వామి మూదు ముఖముల తో కాక  ఏక ముఖము తో రెండు చేతులలో దండ కమండలము లతో, దర్శనము ఇవ్వటము జరుగుతోంది.  ఏమిటి అందరికి లా కాకుండా ఏక ముఖము తో దర్శనము ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయేవాడిని.  కాకినాడ నుంచి  మా గురువు గారు పిఠాపురము రావటము, ఆయనను కలిసి ముచ్చటించటము, వెళ్తూ ఆయన చేతిలో కొంత ధనము పెట్టటము జరిగింది.  అప్పుడు నా మనసు లో ఈ కార్యక్రమము లో వ్యావహారికము చోటు చేసుకొంది అని అనుకొని శ్రీ గురు దత్తుని కి నమస్కారము చేసుకొన్నాను.  ఆ యంత్రము విషయము కొన్నాళ్ళు మరిచిపోయాను.  ఒక రోజు మళ్లీ కాకినాడ వెళ్ళాను. గురువు గారు ఒక చోటుకు వెళ్దాము పద అని  2 ఫోన్ నెంబర్లు చెప్పి చేయించి వారు ఇంట్లో లేక పోవటము తో తిన్నగా ఒకరి ఇంటికి తీసుకు వెళ్లారు.  ఆయన ఒక చిత్రకారుడు, వారి ఇంటి నిండా కాన్వాస్ క్లాత్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి.  వాటిని చూడ గానే నా గురువు ఐన  దత్తాత్రేయుని చిత్రము పెయింట్ చేయించుకొంటే బాగుంటుంది కదా అని అనిపించింది.  కానీ నాకు గా  నేను ఎలా చెప్పాలి అని మధన పడ్డాను.  మా గురువు గారు మాట్లాడటము అయిపోయి పద వెళ్లి పోదాము అనేటప్పటికి మనసు లో ఇంకా  సమయము రాలేదు అని అనుకొంటూ మా గురువు గారిని అనుసరించాను. చిత్రము ఏమిటి అంటే నా ముందు నడుస్తున్న గురువు గారు వెనుకకు తిరిగి ఆ  చిత్రకారుడు తో శర్మ కు వారి గురువు గారు దర్శనము ఇస్తున్నారు, వారి చిత్ర పటము పెయింట్ చేసి ఇవ్వండి,   అతను ఒకేసారి ధనము ఇవ్వలేడు అని చెప్పి వెనుదిరిగారు.  శ్రీ గురు దత్తుని కృప కు మనసు లోనే నమస్కరించు కొన్నాను.  బయటకు వచ్చి ఇంక నీవు శ్రీ దత్తునే గురువు గా స్వీకరించి సాధన కొనసాగించు, నా ఆశీర్వచనములు  ఎప్పుడూ ఉంటాయి అని సెలవిచ్చారు.   


























































Tuesday 30 December 2014

పిఠాపురం - తొలి రోజులు ...............

నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను.  అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే   విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు  చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు.  గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి,  నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు.  ఆయనంతకు ఆయనే  మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని,  ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ వచ్చని, అదీ కాక నా పరిస్థితులు తెలిసుకున్న వారిలా మీరు నాకు ఏమి ఇవ్వనక్కర లేదు అని దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని పిస్తోంది అని చెప్పారు కాబట్టి సరే అయితే మీ ఇష్టము అని చెప్పాను అని తెలియ చేశాను.  గురువు గారు ఒక క్షణము ఆలోచించి అయితే ఒక పని చేయి నాకు కూడా ఒక యంత్రము చేయించు అని అన్నారు.  గురువు గారికి ఎలా చెప్పాలో, ఏమి అవుతే అదే అవుతుంది అని మనసు లో అనుకొని, సవినయముగా అయ్యా, మీకుగా మీరు యంత్రము కావాలని నన్ను ఆయనను అడుగమని చెప్తున్నారు, ఆయనకు నేను చెప్పి అయన ఇస్తాను అంటే మీకు ఇప్పించగలను అని అన్నాను.  నా సంశయము గురువు గారికి అర్ధము అయి,  అవును నీ సాధన లో ఉపయుక్తము కోసము ఆయన ఇస్తానన్నాడు కానీ నీవు ఆయనను అడుగ లేదు కదా, సరే ఒక పని చేయి ఏమి అవాలో అదే అవుతుంది  ఆయనను అడిగి చూడు, అలా  కానీ పక్షము లో నీకు ఇవ్వబోయే యంత్రము నాకు ఇస్తే నేను నా దగ్గర పెట్టుకొంటాను అని చెప్పారు. ఆ యంత్రము పెట్టుకోవటము వలన ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తే నీ దగ్గర పూజ లో పెట్టు కోవచ్చు.   గురువు గారు అలా చెప్పిన తరువాత  సరే అలాగే చేస్తాను అని ఒక నమస్కారము చేసి పిఠాపురము వచ్చేశాను.  

Monday 29 December 2014

పిఠాపురం - తొలి రోజులు ..........

అలా ఎదురుగా వస్తున్న ఆయన పూర్తి గా అపరిచితుడు.  దగ్గర కు సమీపించి మీరు ఏదో సాధన లో ఉన్నారు కదా, మీ సాధన లో మీకు, మీ ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు  దత్త యంత్రము ఒకటి ఇవ్వాలని అనిపిస్తోంది అని అన్నారు.  నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను.  నెమ్మదిగా నేను ఇన్నాళ్లు స్థూల పూజలు చేయ లేదు, మానసికముగా యోగ సాధన ఒకటే చేస్తున్నాను.  అదీ కాక ఇంట్లో పూజ లో యంత్రము పెట్టుకొంటే దానికి ప్రత్యేకముగా పూజ చేయాలి కదా, ఒక వేళ అలా చేయలేక పొతే ఇంట్లో మంచిది కాదు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు కదా, మీలో నా  గురువునే తలుచు కొంటూ నాకు మనసు లో అనిపించింది చెప్తున్నాను, మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని చెప్పాను.  ఆయన కూడా ప్రశాంతముగా మీరు ప్రత్యేకముగా ఏ పూజలు చేయనక్కర లేదు మీకు ఎలా పూజ చేయాలనిపిస్తే అలాగే చేయండి, ఇంకో విషయము ఆ యంత్రము తయారు చేయడానికి అయే ఖర్చు నేనే భరిస్తాను, మీరు పైసా ఇవ్వ వలసిన పని లేదు, మీకు ఎందుకో యంత్రము ఇవ్వాలని పిస్తోంది కాబట్టి ఇస్తున్నాను, మళ్లీ  త్వరలో కలుద్దాము అని చెప్పి వెళ్ళిపోయారు.  నేను మాములుగా నా దినచర్య లో భాగముగా పాద గయా క్షేత్రమునకు వెళ్లి దత్త దర్శనము చేసుకొని. కొంత సేపు సాధన చేసుకొని ఇంటికి చేరుకొన్నాను.  ఒకరిని గురువు గా ఎంచుకున్న తరువాత మన సాధన లో ఏ చిన్న విషయము జరిగినా వారికీ తెలియ  చేసి వారు ఎలా చెప్తే అలాగే చేయటము శిష్యుని గా మన కర్తవ్యము కాబట్టి కాకినాడ లో మా గురువు గారికి చెప్పాలని అనుకొన్నాను.  

Sunday 28 December 2014

పిఠాపురము తొలి రోజులు

సాధన లో భాగము గా కాకినాడ నుంచి పిఠాపురము బదిలీ చేయించి శ్రీ గురు దత్తుడు నన్ను తన దగ్గరికి తీసుకొన్న విధానము మీకు అందరికి తెలియ చేశాను కదా!  శ్రీ గురు దత్తుని కృపా కటాక్ష వీక్షణములకు పాత్రుడనయినందుకు ఒక సారి మళ్లీ మనసారా నమస్కరించు కొని గురువు గారు  ఇక మీద ఎలా నన్ను సాధన లో ముందుకు నడిపించారో సాధకులయిన మీతో పంచుకోటానికి సిద్ధమవుతున్నాను.  అప్పటి దాకా గాయత్రీ జపము,  శ్రీ గురు చరిత్ర పారాయణము చేసిన నేను,  దత్తాత్రేయుని పూజా కార్యక్రమము (షోడశోపచారములతో) మొదలు పెట్టాలనిపించి, శ్రీ దత్తునే మనసులో తలుచుకొని ఎలా పూజా క్రమము అనిపించిందో అలాగే ఒక ప్రతి తయారుచేసుకొని మానసిక యోగ సాధన తో పాటు స్థూల పూజ చేయటము మొదలుపెట్టాను.   ఏ కాలమయినా, ఎటువంటి పరిస్తితులయినా,  తెల్లవారు ఝామునే లేచి పూజా కార్యక్రమము పూర్తి చేసుకొని ఉదయము 6.00, 6.30 గం. లకు పిఠాపురము లో పాద గయా క్షేత్రము నందు శ్రీ దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహమును దర్శించుకొని అక్కడే సాధన చేస్తుండే వాడిని. నెమ్మదిగా పిఠాపురము లో సాధకుల తో పరిచయము అవటము మొదలయింది.  ఊరి మధ్య లో శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానము కార్య వర్గము బ్యాంకు లావాదేవీలకు మా దగ్గరకి వచ్చేవారు కాబట్టి వారి తో కూడా  పరిచయము కలిగింది.  ఎప్పుడు ఎంతటి  మహానుభావులు (దత్త భక్తులు) పొరుగు రాష్ట్రాల నుంచి, శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారమయిన శ్రీపాద శ్రీ వల్లభుని జన్మస్థలమయిన పిఠాపురము వచ్చినా  స్వామి ని పాద గయా క్షేత్రములో దర్శించుకొని, శ్రీపాద శ్రీ వల్లభుని సంస్థానము లో బస చేసి పూజా, పారాయణ, సత్సంగ కార్యక్రమము లు జరుపుకొంటున్నా నేను వెళ్లి పాలుపంచుకొనడము ఒక అలవాటుగా మారింది.  ఆ విధము గా చక్కటి సాధన జరుగుతూ ఉండేది. ఒక రోజు ఉదయము గుడికి వెళ్తున్న సమయము లో నాకు స్థానికులు  ఒకరు ఎదురుగా వస్తున్నారు.

Thursday 11 December 2014

గురు కటాక్షము .......

కలి యుగములో శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారము,   శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలమైన పిఠాపురము లో వృత్తి పరముగా పని చేయుటకు అవకాశము ఇచ్చిన శ్రీ గురు నకు మనసా, వాచా, కర్మణా, ప్రణామములు తెలుపు కొంటున్నాను.   ప్రవృత్తి పరముగా నా సాధన లో ఎన్నో  రకముల  పరీక్షిస్తూ,  అనుభవములు ఇచ్చి, నన్ను తన మార్గము లోనికి శ్రీ దత్త స్వామి తీసుకొన్న విధానము ఇంతకు ముందు మీకు తెలియచేశాను. ఏ కొద్ది మంది కైనా, లేక ఒక్కరికి అయినా సాధన లో ఉపయోగపడితే  శ్రీ గురుడు దత్తాత్రేయుడు నా జన్మ కు సార్ధకత ఇచ్చి నట్లు గా భావిస్తాను.  శ్రీ గురుడు స్మరణ మాత్ర సంతుష్ఠుడు.  మనసారా శ్రీ గురుని స్మరిస్తే ఆయన మనను తన వాడిని చేసుకొని మార్గ దర్శకత్వము చేసి సాధన లో ముందుకు నడిపిస్తాడు.  ఒక సారి  మనను తన వాడు గా  చేసుకొన్న తరువాత ప్రారబ్ధ కర్మ లను  అన్నింటిని ఒక్క సారే అనుభవింప చేసి కడిగిన ముత్యము లా చేసి, తనంతటి వాడు గా తయారు చేస్తాను అని అంటాడు. ఎంతలా పరిక్షిస్తాడు అంటే ఏ క్షణమైనా ఈ సాధన వద్దు అనుకొని, తనను వదిలి పారిపోయేలా చేస్తాడు.  కానీ అన్నిటికి ఓర్చుకొని నిలబడితే మనను త్వరగా దగ్గరకు చేర్చుకొంటాడు.  ఎప్పటికి అప్పుడు ఈ మాయా ప్రపంచము నుండి కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక్క సారి మన అందరికి తెలిసిన  చిన్న విషయము గుర్తు చేసుకొందాము.  మన ఇళ్ళలో పూర్వ కాలములో తిరుగలి ఉండేది కదా, మనలో కొంత మందైనా చూసే ఉంటాము.  క్రింద ఒక రాయి దానికి మధ్య లో ఒక చిన్న కొయ్య గురుజు, దాని ఆధారముగా పైన మధ్య లో ఒక చిన్న రంద్రము తో ఇంకొక రాయి,  దానికి ఒక ప్రక్కన చిన్న కొయ్య  పిడి పట్టుకొని పిండి ఆడుటకు వీలుగా ఉండేది కదా.  తిరుగలి పై రాయి మధ్య లో పప్పు వేయించి వేసి మన పెద్ద వాళ్ళు ఆడేవారు గుర్తు వచ్చి ఉంటుంది.  మధ్య లో వేసిన పప్పు రెండు రాళ్ల మధ్య లో నలిగి నలిగి పిండి రూపములో చుట్టురా పడేది.  అయితే క్రింద రాయి మధ్య కొయ్య బురుజు చుట్టూ కొంత పప్పు అలాగే ఉండి పోతుంది, కానీ ఆ పప్పు ఏ  నిముషమైనా గురుజు ను వదిలి రెండు రాళ్ల రాపిడి లో పడితే అది పిండి అయిపోతుంది కదా.  ఇక్కడ చిన్న విషయము ఆలోచిద్దాము.  ఈ సంసారం సాగరము లో మన అందరమూ నలిగి పోతూనే ఉన్నాము. తిరుగలి లో మాదిరి గా క్రింద రాయి మధ్య గురుజు మాదిరి భగవంతుని కానీయండి, ఒక గురువు ని కానీయండి ఆయననే మర్కట కిశోర న్యాయము గా పట్టుకొంటే, అయన మార్జాల కిశోర న్యాయము గా మనను కాపాడుతాడు. ఏ మాత్రము ఆదమరిచి  మనము మాయకు లోబడిపోయామా మళ్లీ ఈ సంసారం సాగరము లో పడిపోతాము, తస్మాత్ జాగ్రత! సదా మెలుకువ తో ఆయననే స్మరించటము మన కర్తవ్యము.  

Wednesday 3 December 2014

గురు కటాక్షము

మా సామాను అంతా పేకేజీ పెట్ల లో సర్దుతూ ఎప్పుడు నేను సర్దుకోవటమేనా, ఎవరూ ఎప్పుడూ సాయము చేయరు కదా అని అనుకొంటూ సర్దటము ప్రారంభించాను. మధ్యాహ్నము 12 గంటలు దాటుతోంది.    ఇంతలో ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా రమణ ఆశ్రమములో గది చూపించిన కుర్రాడు తన పెట్టె తో నిలబడి ఉన్నాడు.  నేను ఆశ్చర్యపోయి, అదేమిటి నీవు ఇలా వచ్చావు అని అడిగాను. మేము అక్కడి నుంచి వచ్చి నెల రోజులు కూడా కాలేదు కదా అని మనసు లో అనుకొన్నాను.  అతను సమాధానముగా ఒక చిరు నవ్వు నవ్వి, మిమ్మల్ని చూడాలని  అనిపించింది, వచ్చాను అన్నాడు.  ఆశ్రమ నిర్వాహకుల దగ్గిరికి  అతను  వెళ్లి నాకు సెలవు కావాలి, అని అడిగితే వాళ్ళు దేనికి అని అడిగారట.  కాకినాడ నుంచి వచ్చారు కదా ఆయన ను చూడటానికి వెళ్ళాలి అనిపిస్తోంది, కాబట్టి సెలవు కావాలి అని చెప్పాడట.  అదేమిటి ఈ ఆశ్రమము నకు ఎంతమందో విదేశము ల నుంచి వచ్చిన వాళ్ళు,  వాళ్ళ తో పాటు తీసుకు వెళ్తామన్నా వాళ్ళేవరి తోనూ వెళ్ల  లేదు, ఎక్కడో కాకినాడ నుంచి వచ్చినాయన కోసము నీవు వెళ్తానని అంటున్నావు,  నీకు సెలవు ఇవ్వము అని చెప్పారట.  అప్పటికి ఏమీ అనకుండా, మళ్లీ కొంత సేపటి తరువాత వెళ్లి మా అమ్మ గారికి వంట్లో బాగా లేదు, సెలవు కావాలి అని అడిగితె, సరే అని  సెలవు ఇచ్చారట.  వెంటనే వాళ్ళ అమ్మ గారి దగ్గర కు వెళ్లి,  అమ్మా, కొంచెం ధనము కావాలి,   నేను కాకినాడ వెళ్ళాలి అని మొత్తము సంగతి వాళ్ళ ఆశ్రమము లో చెప్పినవే మళ్లీ  చెప్పాడట.  ఆవిడ కూడా ముందు వద్దని, అతని కి కావాల్సిన ధనము ఇచ్చి జాగ్రత్త గా వెళ్లి  రా, అని చెప్పి పంపించిందట.  ఆ ధనము తో విరుపాక్ష గుహ దగ్గర కొండ పైనించి కొన్ని ఫోటోలు తీసి,  రావు అనుకొన్నానో, ఆ లేమినేటేడ్  ఫోటోలు తీసుకొని వచ్చాడు.  నా దగ్గర కాకినాడ లో సామానులు సర్ది పెట్టి, పిఠాపురము లో విప్పి మళ్లీ మేము సర్దు కొనేవరకు వారము రోజులు ఉండి వెళ్లేడు.   వెళ్ళేటప్పుడు  అతనికి బట్టలు పెట్టి నా కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.   ఆ  తరువాత మాకు ఉత్తర, ప్రత్యుత్తరాలు లేవు.  నా గురువే నాకు సాయము పంపించారని శ్రీ గురు దత్తునికి మనసు లో కృతజ్ఞతలు చెప్పు కొన్నాను.  ఆ  విధముగా నా సాధన లో ఎప్పటికి అప్పుడు దారి చూపిస్తూ,  తన దగ్గర కు తీసుకొన్నారు.   జై  గురు దత్త

Tuesday 2 December 2014

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ............

ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయము తీసుకొనమని చెప్పినా మనసు చంచలము కదా, శ్రీ దత్తునే గురువుగా ఎంచుకొన్నాను కాబట్టి, పిఠాపురము అయితే సాధనకు ఇంకా ఉపయోగము ఎక్కువ అని అక్కడికే అడగాలి అని అనుకొన్నాను.  కానీ వెంటనే ఒక వేళ  పిఠాపురము ఇవ్వలేము అంటే ఏమి చేయాలి అని అనిపించింది. అది కాక  పొతే, అన్నవరము కూడా దైవ క్షేత్రమే కాబట్టి అది అయితే బాగుంటుందేమో, అని అనిపించగానే మళ్లీ గురువు గారు నీవు ఏమి అనుకొంటే అది అయిపోతుంది కాబట్టి జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయము తీసుకోమన్న విషయము గుర్తు కు వచ్చి, ఒక వేళ పిఠాపురము అయితేనే నేను పదోన్నతి తీసుకోవాలి  లేక పొతే తీసుకోకూడదు అని మనసు లో ధృడముగా నిర్ణయించుకొన్నాను.  ఇలా అనుకొన్న మరుసటి దినము నన్ను  అడిగితే పిఠాపురము అయితే నేను వెళ్తాను అని చెప్పాను. సరే అన్నారు.  కానీ సాయంత్రానికి మళ్లీ నీకు పిఠాపురము ఇవ్వడము కుదరదు, అన్నవరము వెళ్తావా, అని అడిగేటప్పటికి నేను ఆశ్చర్యపోయి, పిఠాపురము కాక అన్నవరము అయితే నాకు పదోన్నతి లేక పోయినా ఫరవా  లేదు, నాకు అక్కర లేదు అని చెప్పాను.  ఇలా జరిగిన విషయములన్ని గురువు గారికి చెప్పగానే, ఆయన యధాలాపము గా నీవు శ్రీ దత్తుని గురువు గా కొలుస్తున్నాను అంటున్నావు,  నీకు పదోన్నతి లేక పోయినా, నీ స్వంత ఇల్లు వదిలి పిఠాపురము వెళ్లి ఉంటూ సాధన చేసుకోలేవా? అని ప్రశ్నించేటప్పటికి ఒక్క సారి ఆశ్చర్యచకితుడినై గురువు ఇలాంటి పరీక్ష పెట్టారు ఏమిటి, ఏమి చేయాలి, స్వంత ఊరు, తల్లి తండ్రులు, స్వంత ఇల్లు వదిలి, నా సాధనకు పిఠాపురము వెళ్లి పోవటమా, అన్నింటి కన్నా గురువు కటాక్షము గొప్పది  కదా అని అనిపించి,  ప్రక్క ఊరు వెళ్లి ఎంత మంది పని చేయటము లేదు, నేను మాత్రము  ఎందుకు చేయ లేను అనుకొని, మా గురువు గారితో నేను పిఠాపురము లో ఉంటూ కాకినాడ లో పని చేస్తాను అని చెప్పాను.  అయితే ఎప్పుడో ఏమిటి, రేపే వెళ్ళు అని,  గురువు గారు అన్నారు.  మా వాళ్ళని ఒప్పించి నేను పిఠాపురము వెళ్లి ఉండి కాకినాడ పని చేయటానికి సిద్దమయాను. 1997 జూన్ 26 పిఠాపురము వెళ్ళాను.  అక్కడ ఇల్లు వెతుక్కొని నివాసము పూర్తిగా మార్చుకోడానికి సిద్ధమయాను.  2, లేక 3 రోజులు  పిఠాపురము నుంచి  కాకినాడ కు వచ్చేవాడిని.  శ్రీ గురు దత్తుని కృప వల్ల జూన్ 30 నాటికీ,  జూలై 1 వ తారీకు న పిఠాపురము కు వెళ్లి పదోన్నతి తో అక్కడ చేర మని బదిలీ చేశారు.  నేను సాధనకు నిలబడతానా లేదా అని పరీక్ష  చేసి, నా సాధనకు దారి చూపించిన శ్రీ గురు దత్తుని  కృపకు నిదర్శనము నకు సదా ఆయన సేవ కే  అంకితము అవ్వటము లో అతిశయము ఏముంది.  

Monday 1 December 2014

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది.   ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి.  సమస్యలు పెరుగుతున్న కొద్దీ  సాధన ఇంకా ఎక్కువ పట్టుగా  సాధన తీవ్రముగా  సాగేది.  ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి.  దానిని బట్టి నా గురువు దత్తుడు నేను  ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే  'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అని గట్టిగా పట్టుకొన్నాను.  నెమ్మది గా, కొన్ని రోజుల కు  దత్త స్వామి 3 ముఖములు, 6 చేతులు, ఆయుధములు కనిపించుట మాని,  దత్త స్వామి ఏక ముఖము తో  2 చేతుల లో దండ, కమండలము ల తో కనిపించుట మొదలైంది.  ఎందుకు ఒక ముఖము తోనే నాకు  కనిపిస్తున్నారు , అని  ఆలోచించటము మొదలుపెట్టాను.   నా  సమస్యల వల్ల (బ్యాంకు)  ఉద్యోగము  లో పదోన్నతి  కోసము కూడా ప్రయత్నిచుట మానుకొన్నాను. ఉద్యోగము ఏదైనా దానిని సమర్ధవంతము గా విధి నిర్వహణ చేస్తూ, సాధన ఎంత తీవ్రముగా చేస్తున్నానో అంత భాద్యత గా పని చేసేవాడిని.  నా గురువుని తలుచుకొని మంత్రము ఏదైనా,  చిన్న దైనా, పెద్దది అయినా దాని సాధన చేసేవాడిని.  ఒక సారి ఒక మంత్రము కొన్నాళ్ళు సాధన చేసిన తరువాత, ఎందుకో ఆ మంత్రము నా గుణానికి సంబంధించి నది కాదు అని అనిపించేది.  అప్పటి నా గురువు గారు హోమములు చేసేవారు అని చెప్పాను  కదా,  అలా  ఒక సారి హోమము పూర్తి అయిన తరువాత,  ఒక గది లో గురువు గారు ఒక మూల,  నేను ఒక మూల కూర్చొని సత్సంగము అవుతుంటే, మధ్య లో నన్ను చూసి నీవు ఏదో మంత్రము చేస్తున్నావు కదా, ఆ మంత్రము నీ గుణమునకు సంబంధించి నది కాదు, ఈ మంత్రము చేయి, అని అంత మందిలో  ఆ మంత్రము నాకు చెప్పి అది ఇంత సంఖ్య  చేసుకో,  సిద్ధిస్తుంది అని ఆయన చెప్పారు.  ఈ లోపుల గుమస్తా స్థాయి లోనే   పదోన్నతి ఇస్తున్నారని నన్ను సిద్ధముగా ఉండమని నాకు చెప్పారు.  అప్పటి గురువు గారు నీవు మనసు లో ఏమి అనుకొంటే అది అవుతోంది కదా, జాగ్రత్త గా ఆలోచించుకొని   నిర్ణయము తీసుకో అని అన్నారు.