Thursday, 13 November 2014

మాయా మయమిదం అఖిలం బుద్ధ్వా

అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు కు ఈ దేహము బయట స్వతంత్ర ప్రతిపత్తి లేదు గాని, మన దేహము లో మాత్రము  అది మకుటం లేని మహా రాణే.    అది మన శరీరము లోపల ఉన్న  జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము లను పూర్తి గా  వశ పరుచుకొని,  రాజాధిరాజు లైన  బుద్ధి, ఆత్మలను సహితము  పూర్తి  గా  ముసుగు వేసి కప్పి ఉంచి తన దైన  సంపూర్ణ  అధికారము తో శరీరము ను ఏలుతూ ఉంటుంది.  ముఖ్యము గా  జ్ఞానేంద్రియము లను  పూర్తి  గా వశ పరుచుకుంటుంది.  మానవ  పరిణామము లో అధో, ఊర్ధ్వ మానసిక  స్థాయిల లో కూడా మనసే ప్రధాన మైన పాత్ర వహిస్తూ ఉంటుంది.   మనసు అనేది,   కన్ను దాని  తన్మాత్ర అయిన చూపు ద్వారా,   చూసింది అంతా కావాలని అనుకొంటుంది.    స్వ పర  భేదము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది.   ఈ చరాచర సృష్టి అయిన మాయ తో కలిసిపోయి మన అందరిని  ఆడిస్తూ,   ఆడుతూ ఉంటుంది.   సృష్టి  అంటేనే  వ్యక్త మవుట అని, వ్యాప్తి చెందుట, అవ్యక్త మవుట అనేవి ఉండి తీరుతాయని,  మనకు తెలిసిన విషయమే.  వ్యక్తావ్యక్తముల  మధ్యన  ఉన్నదే జీవితము(సృష్టి).   జగద్గురు   శ్రీ ఆది శంకరాచార్యుల వారు భజ గోవింద శ్లోకముల ద్వారా   పండితులము అను కొనే వారికి,  సామాన్య జనానీకము నకు  కూడా, ఓరి వెర్రి నాయనా! వల్లె వేస్తూ కూర్చుని ఉండక,  మేలుకో సమయము తక్కువ,    అని రక రకములు గా  ఆయన,  ఆయన శిష్య వర్గము ద్వారా  మనను హెచ్చరించారు.   మనసు  శరీరములో  ఉన్న జ్ఞానేంద్రియముల తో కలవలేదు అనుకోండి, ( కన్ను, ముక్కు, చెవి, నాలుక,  చర్మము ) వరుసగా చూపు, వాసన , వినుట, రుచి, స్పర్శ  ఇవేమీ పని చేయవు.   మనసు ను కట్టడి చేస్తే ఈ జ్ఞానేంద్రియములు ఏవి తమ పని చేయక,   బహిర్ముఖము కాకుండా ఉండి,  అంతర్ముఖము అవుతుంది.    అవస్థాత్రయమైన జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో  ఒకటైన   జాగ్రదావస్థ లో ఈ దేహము ఇలా ఉంటుంది.   స్వప్న అవస్థలొ  దేహము,  కర్మేంద్రియములు పనిచేయవు గాని   జ్ఞానేంద్రియములు పనిచేస్తూ స్థూల శరీరము బదులు గా   సూక్ష్మ శరీరము  తో కలలు  చూస్తూ ఉంటుంది.   మనసు అలిసిపోయి విశ్రాంతి తీసుకొంటుంది  కాబట్టి  కొన్ని కలలు  ప్రొద్దున్న లేచిన తరువాత గుర్తు ఉంటాయి, కొన్ని  ఉండవు.    సాధన క్రమములో స్వప్న రూపేణా  సందేశములు వస్తూ ఉండి  జ్ఞాపకము ఉంటాయి.  అవి  సాధనకు ఉపయుక్తము అవుతాయి.   సుషుప్తి అవస్థ లో   దేహము సర్వము మరిచి  విశ్రాంతి తీసుకొంటుంది.  ప్రొద్దున లేచి ఇవాళ మంచి నిద్ర పట్టింది అనుకోవటము మనకి అనుభవమే కదా!  సాధన తీవ్రత లో ఒక్కోసారి సుషుప్త్యావస్థలొ  కూడా కొన్ని అనుభవములు జరుగుతూ  ఉంటాయి.  ఒక సమయము లో నేను మంచి గుఱక  పెడుతూ  పడుకొనినపుడు, నా శ్రీమతి  ఏవో  అడిగితే  వాటికీ సమాధానము చెప్తూ మధ్య లో మాములుగా గుఱక  పెడుతూ పడుకొన్నానని తను చెప్తే  ఆశ్చర్య పోయాను.  సుషుప్త్యావస్థలో  కూడా శరీరము  జాగ్రదావస్థ  లో ఉండడము  అంటే ఇదేనా అనిపించింది!                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           

No comments:

Post a Comment