Tuesday 11 November 2014

శోధన ...........

ఆ  రకముగా  నా సాధన  లో సాయిబాబా కూడా దత్తావతారమే  అని తెలిసింది కాబట్టి అక్కడ నుంచి సాయి సచ్చరిత్ర బదులుగా గాయత్రీ తో పాటు శ్రీ గురు చరిత్ర   సప్తాహ  పారాయణము  చేయడము  మొదలు పెట్టాను.  దీనితో  పాటు   నా ప్రధమ గురువు  నుంచి  ఆయనకు వచ్చే సూచనలు  వారు చెప్పినది చెప్పినట్లుగా సాధన చేస్తూ ఉండే వాడిని.  ఆ  సూచనలు   యోగానికి  సంబంధించి  వస్తూ  ఉండేవి.  యోగ సాధన  నా వీలును బట్టి సమయాసమయములు పాటించ కుండా  నా నిత్య జీవిత  కర్తవ్యములకు  ఆటంకము  లేకుండా,  ఎట్టి  పరిస్థితుల లోను యోగ సాధన చేయాలనీ ఒక ధృడ సంకల్పము తో  చేస్తూ ఉండే  వాడిని.   అప్పటికి  నాకు అర్ధము అయిన విషయము ఏమంటే   ఒక  సాధన లో త్రికరణ శుద్ధి  గా  చేయడము ముఖ్యము  గాని   నియమానియమములు కావు.    నా ప్రాధమిక గురువు గారు మాస్టర్  ఇ. కే . గారి శిష్యులు.  ఆయన  హోమములు  కూడా చేసేవారు.  నా మనసు లో  మా పెద్దలు యజ్ఞ యాగాదులు చేసినవారు కదా,  నేను  హోమము చేయడము  అయినా  నేర్చుకోవాలని ఉండేది.   ఒక రోజు మా గురువు గారు నాయనా, నేను హోమము చేయడానికి  విజయవాడ వెళ్తున్నాను అని చెప్పారు.  నన్ను కూడా రమ్మనమని అంటే బాగుండును కదా  అని అనుకొన్నాను.  దానికి కారణమూ ఏమిటంటే  దత్తాత్రేయము లో ఒకటి  దత్త మంత్ర సుధార్ణవము, ఇంకొకటి షోడశ అవతారములు పుస్తకముల గురుంచి, అవి విజయవాడ లో గోవిందరాజులు దత్తాత్రేయులు   అన్న ఆయన  ముద్రణ వేయించారని, అక్కడికి వెళితే  ఆ పుస్తకములు తెచ్చుకోవచ్చు అనుకొన్నాను. మా గురువు గారు శని వారము మధ్యాహ్నము బయలుదేఱ వలసి ఉన్నది గాని  చివరి క్షణము లో అయన నా దగ్గఱ  కు వచ్చి నాకు ఇంకో ముఖ్యమైన పని ఉంది నేను పోవుట కుదరదు, నా బదులు నీవు వెళ్లి హోమము చేయి అని చెప్పారు.  ఆశ్చర్యం నా వంతు అయింది.   ఇంకో విషయం ఏమిటంటే హోమానికి గురువు గారితో వెళ్లి నేర్చుకోవాలి అనుకొంటే  నాకు హోమ విధానము ఏమిటో తెలియని నేను స్వయము గా  మొదటి సారి  చేయవలసి వచ్చింది.   అదీ  ఎవరింట్లో చేసానో తెలుసా ఆ గోవిందరాజులు దత్తత్రేయులు గారి ఇంట్లోనే చేశాను. ఆశించ  కుండా   నాకు వచ్చిన గురు దక్షిణ కూడా  ఏమిటో తెలుసా నేను అనుకొన్న ఆ  రెండు పుస్తకములే.   అది  గురు దత్త కృప అని అర్ధమవుతోంది కదా!

No comments:

Post a Comment