Monday, 1 December 2014

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది.   ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి.  సమస్యలు పెరుగుతున్న కొద్దీ  సాధన ఇంకా ఎక్కువ పట్టుగా  సాధన తీవ్రముగా  సాగేది.  ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి.  దానిని బట్టి నా గురువు దత్తుడు నేను  ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే  'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అని గట్టిగా పట్టుకొన్నాను.  నెమ్మది గా, కొన్ని రోజుల కు  దత్త స్వామి 3 ముఖములు, 6 చేతులు, ఆయుధములు కనిపించుట మాని,  దత్త స్వామి ఏక ముఖము తో  2 చేతుల లో దండ, కమండలము ల తో కనిపించుట మొదలైంది.  ఎందుకు ఒక ముఖము తోనే నాకు  కనిపిస్తున్నారు , అని  ఆలోచించటము మొదలుపెట్టాను.   నా  సమస్యల వల్ల (బ్యాంకు)  ఉద్యోగము  లో పదోన్నతి  కోసము కూడా ప్రయత్నిచుట మానుకొన్నాను. ఉద్యోగము ఏదైనా దానిని సమర్ధవంతము గా విధి నిర్వహణ చేస్తూ, సాధన ఎంత తీవ్రముగా చేస్తున్నానో అంత భాద్యత గా పని చేసేవాడిని.  నా గురువుని తలుచుకొని మంత్రము ఏదైనా,  చిన్న దైనా, పెద్దది అయినా దాని సాధన చేసేవాడిని.  ఒక సారి ఒక మంత్రము కొన్నాళ్ళు సాధన చేసిన తరువాత, ఎందుకో ఆ మంత్రము నా గుణానికి సంబంధించి నది కాదు అని అనిపించేది.  అప్పటి నా గురువు గారు హోమములు చేసేవారు అని చెప్పాను  కదా,  అలా  ఒక సారి హోమము పూర్తి అయిన తరువాత,  ఒక గది లో గురువు గారు ఒక మూల,  నేను ఒక మూల కూర్చొని సత్సంగము అవుతుంటే, మధ్య లో నన్ను చూసి నీవు ఏదో మంత్రము చేస్తున్నావు కదా, ఆ మంత్రము నీ గుణమునకు సంబంధించి నది కాదు, ఈ మంత్రము చేయి, అని అంత మందిలో  ఆ మంత్రము నాకు చెప్పి అది ఇంత సంఖ్య  చేసుకో,  సిద్ధిస్తుంది అని ఆయన చెప్పారు.  ఈ లోపుల గుమస్తా స్థాయి లోనే   పదోన్నతి ఇస్తున్నారని నన్ను సిద్ధముగా ఉండమని నాకు చెప్పారు.  అప్పటి గురువు గారు నీవు మనసు లో ఏమి అనుకొంటే అది అవుతోంది కదా, జాగ్రత్త గా ఆలోచించుకొని   నిర్ణయము తీసుకో అని అన్నారు.

No comments:

Post a Comment