Sunday, 16 November 2014

సాధనా క్రమము

 నేను గురువు గారు చెప్పినట్లుగా పుస్తకములు తీసుకొని మిర్యాలగూడ వెళ్ళుటకు సిద్ధమయాను.  ఎవరింట్లో చేయాలో వారింట్లో ఉండడానికి అవకాశము లేక పోవుట వలన, ఇంకొకరి ఇంట్లో ఉండి యజమాని ఇంట్లో హోమము చేయ వలసి ఉంటుంది అని మా  గురువు గారు చెప్పారు.   మిర్యాలగూడ వెళితే నన్ను శ్రీ  లంక వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వారి ఇంటికి తీసుకు వెళ్లి వారము రోజుల పాటు  ఆతిధ్యము ఇచ్చి ఆయనే వారము రోజులు దగ్గర ఉండి ఎవరింట్లో హోమము చేయవలసి ఉందో,   వారి ఇంటికి తీసుకొని వెళ్తారు అని చెప్పారు.  అయన మంచి ఆధ్యాత్మిక కార్యక్రమముల లో ఉన్నవాడు అని కూడా తెలిసింది.  నాకు ఆ  వారము రోజులు మంచి సత్సంగము ఉంటుందని సంతోషించాను.  ఒక ప్రక్కన  గురువు గారి మీద  పూర్ణ విశ్వాసము ఉన్నా, మరొక ప్రక్క మానవ సహజ మైన ఆతృత తో హోమము ఎలా చేస్తానో అని,  ఒక రకమైన డోలాయమాన పరిస్థితి లో హడావుడి గా  బయలుదేరాను.  నేను ఇంటి  నుంచి బయలుదేరి నప్పటి నుంచి ఏదో విపరీతమైన బరువు మోస్తున్న  భావన తో ఇంటి దగ్గరలో ఉన్న బస్సు నిలుపు స్థలమునకు చేరుకొన్నాను.   నేను వెళ్ళేది మంచి పనికి కదా ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఆలోచించుట మొదలు పెట్టాను.  వెంటనే నాకు మనసు లో హోమము చేయుటకు కావలసిన పుస్తకము  పెట్టుకొన్నానా లేదా అని సంశయము వచ్చి, వెంటనే  నా  బ్యాగ్ లో చూసుకొంటే,  అసలైనది ఆ పుస్తకమే లేదు.  అది లేకుండా నేను వెళ్ళినా ప్రయోజనము లేదు,  కాబట్టి గురువు గారే నన్ను ఆందోళన కు గురి చేసారని అర్థం చేసుకొని,  ఇంటికి వెళ్లి ఆ పుస్తకము తీసుకొని మళ్లీ బయలుదేరాను.  ఇప్పుడు మనసు తేలిక అయింది.  గురువు మీదే పూర్తి భారము వేసి ఫలితము మీద అపేక్ష లేకుండా అయన చెప్పిన కార్యక్రమము త్రికరణ శుద్ధి గా చేయడము ఒకటే మన కర్తవ్యము అని అర్ధము అవుతోంది కదా !  ఆయనను నమ్ముకొంటే ఆయనే నడిపిస్తాడు.   ఆ విధముగా నేను మిర్యాలగూడ చేరుకొన్నాను.  అక్కడి నుంచి  నన్ను నడిపించేది శ్రీ లంక వేంకటేశ్వర్లు గారే.   వారి కుటుంబ సభ్యులు నిస్వార్ధముగా  చూపిన ఆదరణ నాకు మార్గ దర్శకము అయింది.  అక్కడి నుంచి ఎవరింట్లో హోమము చేయాలో వారి ఇంటికి తీసుకు వెళ్ళటము, హోమము వారము రోజుల పాటు చేయడము మొదలు పెట్టడము, దానితో పాటు, ప్రణవ సాధన కూడా ఆమెకు నేర్పి ఎలా చేయాలో చూపించి,  శ్రద్ధగా చేస్తే గురు దత్తుని దయ వలన నీవు మాములు స్థితి కి రాగలవు అని చెప్పాను.  గురు దత్తుని దయ వలన హోమము మొదలు పెట్టిన రోజే ఆమెను హోమము దగ్గర కూర్చో వలసినది గా ఆమె కు చెప్తే, ఆమెను   బలవంతముగా ఆమె భర్త ఇంకొంత మంది పట్టుకొని కూర్చోపెట్టారు.  హోమమైన వెంటనే ఎలా వుంది అని ఆమె ను అడిగితే,   కాళ్ళ లో నరములు  చురుక్కు మన్నట్లుగా ఉంది అని ఆమె చెప్పింది.  అ తరువాత మూడో రోజు, ఇవాళ నడిచి చూపిస్తేనే నేను హోమము చేస్తానని నాకు తెలియకుండానే ఆమె కు చెప్పాను.  ఆశ్చర్యము  ఏమిటంటే,   14 ఏళ్ళ నుంచి చక్రాల కూర్చొనుటకు  అలవాటు పడిన ఆమె,  తన శక్తి  నంత కూడ గట్టుకొని గోడలు పట్టుకొని గది అంతా  నడిచి చూపించిన తరువాతే నేను హోమము చేశాను.   ఆ  విధముగా  వారము రోజులు హోమము చేసిన తరువాత నేను బయలు దేరే ముందు నేను చెప్పిన పధ్ధతి లో ప్రణవ సాధన చేసినట్లయితే  త్వరలోనే మాములు స్థితి కి వస్తావు అని చెప్పి వచ్చేశాను.  అ తరువాత వాళ్ళు ఎవరో నేను ఎవరో అంతే. గురువు చెప్పినట్లు చేయడమే  గాని మనకు కర్తృత్వ భోక్తృత్వములు ఉండ కూడదు అని అర్ధము చేసుకొన్నాను.

No comments:

Post a Comment