నా సాధన లో శ్రీ దత్తాత్రేయ స్వామి గురువు గా ఏక ముఖ రూపము తో మార్గదర్శకము చేసేవారని అందరికి ఇంతకు ముందే తెలియచేసాను కదా! దత్తాత్రేయునికి మూడు ముఖములు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని సాంకేతికము గా తెలియడము కోసము, ఆరు చేతులు అందులో పై రెండు చేతులలో శంఖము, చక్రము, మధ్య రెండు చేతులలో ఢమరుకము, త్రిశూలము, క్రింది రెండు చేతులలో జప మాల, కమండలము ల తో ఉత్తరోత్తరా తయారయిన చిత్రము అని పెద్దల ద్వారా తెలిసి కొన్నాను. స్వతహాగా దత్త స్వామి ఎప్పుడూ ఏక ముఖము తో రెండు చేతులతో తిరుగుతూ ఉంటారు. దుర్వాస ముని శాపము వలన విష్ణువు భూలోకము లో అవతరించడము జరిగింది అని మన అందరికి తెలిసిన విషయమే. అన్ని అవతారములకు అవతార పరిసమాప్తి ఉంది గాని దత్తావతారము నకు పరి సమాప్తి లేదు. ఆయనను పరి పూర్ణ విశ్వాసము, శ్రద్ధా భక్తుల తో పిలిస్తే, అంత ఎందుకు స్మరిస్తే చాలు ఆయన వెంటనే ప్రత్యక్షము అవుతాడు. అదీ కృత యుగములో అనసూయ, అత్రి మహర్షి దంపతులకు మొదట గా త్రిమూర్తులు గానే దర్శనము ఇవ్వటము జరిగిందని మన అందరికి తెలిసిన విషయమే. అనసూయ మాత తనకు త్రిమూర్తులు పిల్లలుగా కావాలని కోరిన కోరిక గా అయితేనేమి, అత్రి మహర్షి నేను దత్తా అను తలచుకొంటే ఇలా త్రిమూర్తులు గా దర్శనము ఇచ్చారేమిటి అని అడిగిన ఆయన ప్రశ్న కు సమాధానము గా అయితేనేమి, త్రిమూర్తులు తమను తాము ఆ దంపతులకు దత్తము చేసుకోవటము, ఆ పైన బ్రహ్మ, శివుడు వారి అంశలు, విష్ణువు అంశ అయిన దత్తుని లో ఐక్యము కావించి వారు అంతర్హితులు కావటము మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దత్త స్వామి ఎల్ల వేళలా మన అందరి లాగా ఏక ముఖము, రెండు చేతుల తో ఉంటాడని అర్ధమవుతోంది కదా! సాధన లో ఒక సాధకుడిగా మనము స్వయము గా మొదట అనసూయ గా మారి, అంటే అసూయ లేని తనము అలవారుచుకొని, తరువాత అత్రి గా అయితే, అంటే స్థూలము గా త్రి గుణాలు అయిన రజో, సత్వ, తమో గుణాల ను అధిగమించగలిగితే, సాధకుడు గా మనకు దత్తుడు దత్తమవుతాడు అని అర్ధమవుతోంది కదా!
No comments:
Post a Comment