శ్రద్ధ అన్నది మనకు ఎంత అవసరమో తెలుసుకొన్న తరువాత, అందుబాటు లోనికి వచ్చిన విషయ పరిజ్ఞానము, అనుభవము తో జ్ఞానము పొందటము, దాని లో పరిణతి సాధించి గమ్యము చేరుకోవటము ఒక సాధకునిగా మన లక్ష్యము . మన సంసిద్ధత బట్టి ప్రకృతే (మాయ) మనకు ఏమి కావాలో అవి అందుబాటు లోనికి తెస్తుంది. అలా అందుబాటు లోనికి వచ్చిన వాటిని ఉపయోగించు కోవటము సాధకులుగా మన బాధ్యతే. గురువు అన్నవాడు కేవలము మార్గదర్శకము చేస్తూ సలహాలను ఇస్తూ గమ్యము వైపు నడిపిస్తూ ఉంటాడు అని మనకు తెలిసిన విషయమే. ఆయన ఇచ్చిన సలహాలు అన్య మనస్కముగా కాకుండా ఏకాగ్రతతో విని, గుడ్డి గా నమ్మి, మరు ఆలోచన లేక, దానిని ఒకటికి రెండు సార్లు మననము అంటే ఆలోచిస్తూ, అందులో వచ్చిన అనుమానము లను ఎప్పటికి అప్పుడు గురువు గారి వద్ద సందేహ నివృత్తి చేసుకొని అత్యంత శ్రద్ధ గా ఆచరణ లో పెట్టాలి. ఆచరణ లో పెట్టడము మొదలు పెడితే ఇంకా ఎక్కువ సందేహములు వస్తుంటాయి. సందేహములు తీర్చుకొంటున్న కొద్దీ అనుభవము బల పడుతూ ఉంటుంది. ఏ విషయమైనా స్వయము గా ఆచరణ లో పెట్టి ఇంకొకరికి చెప్పాలి. కేవలము శ్రుత పాండిత్యము తో, పుస్తక పాండిత్యము తో, ఇతరులకు సలహాలు ఇవ్వటానికే గాని తను ఆచరించుటకు గాదు అని అనుకొంటే సత్య శోధన ముందుకు వెళ్ళదు అని ఎప్పుడూ గుర్తు ఉంచుకోవలిసిన విషయము. గురువు చెప్పిన విషయము శ్రద్ధ గా విని, అనుభూతి చెంది, ఆచరణ లో పెట్టి, ఆయన చూపిన దారి లో నడుస్తూ, మనము మరి కొందరికి మార్గదర్శకము చేయ గలిగితే సాధకులు గా మన జన్మ ధన్యమే కదా! ఈ విషయము ఇంకొక రోజున నాకు గురు దత్తుడు చెప్పినది.
No comments:
Post a Comment