Saturday, 10 January 2015

శ్రవణము - మననము - ఆచరణ

శ్రద్ధ అన్నది   మనకు ఎంత అవసరమో తెలుసుకొన్న తరువాత, అందుబాటు లోనికి వచ్చిన విషయ పరిజ్ఞానము, అనుభవము తో జ్ఞానము  పొందటము, దాని లో పరిణతి సాధించి గమ్యము చేరుకోవటము ఒక  సాధకునిగా మన లక్ష్యము .  మన సంసిద్ధత బట్టి ప్రకృతే (మాయ) మనకు ఏమి కావాలో అవి అందుబాటు లోనికి తెస్తుంది. అలా అందుబాటు లోనికి వచ్చిన వాటిని ఉపయోగించు కోవటము సాధకులుగా మన బాధ్యతే.  గురువు అన్నవాడు కేవలము  మార్గదర్శకము చేస్తూ సలహాలను ఇస్తూ గమ్యము వైపు నడిపిస్తూ ఉంటాడు అని మనకు తెలిసిన విషయమే.  ఆయన ఇచ్చిన సలహాలు అన్య మనస్కముగా కాకుండా ఏకాగ్రతతో విని, గుడ్డి గా  నమ్మి, మరు ఆలోచన లేక,  దానిని ఒకటికి రెండు సార్లు మననము అంటే ఆలోచిస్తూ, అందులో వచ్చిన అనుమానము లను ఎప్పటికి అప్పుడు గురువు గారి వద్ద సందేహ నివృత్తి చేసుకొని అత్యంత శ్రద్ధ గా ఆచరణ లో పెట్టాలి.  ఆచరణ లో పెట్టడము మొదలు పెడితే ఇంకా ఎక్కువ సందేహములు వస్తుంటాయి.  సందేహములు  తీర్చుకొంటున్న కొద్దీ  అనుభవము బల పడుతూ ఉంటుంది.  ఏ విషయమైనా స్వయము గా  ఆచరణ లో పెట్టి ఇంకొకరికి చెప్పాలి.  కేవలము శ్రుత పాండిత్యము తో, పుస్తక పాండిత్యము తో,  ఇతరులకు సలహాలు ఇవ్వటానికే గాని తను  ఆచరించుటకు గాదు అని అనుకొంటే సత్య శోధన ముందుకు వెళ్ళదు అని ఎప్పుడూ  గుర్తు ఉంచుకోవలిసిన విషయము.  గురువు చెప్పిన విషయము  శ్రద్ధ గా విని, అనుభూతి చెంది, ఆచరణ లో పెట్టి, ఆయన చూపిన దారి లో నడుస్తూ,  మనము  మరి కొందరికి మార్గదర్శకము చేయ గలిగితే సాధకులు గా మన జన్మ ధన్యమే కదా!  ఈ విషయము ఇంకొక రోజున నాకు గురు దత్తుడు చెప్పినది.  

Wednesday, 7 January 2015

జ్ఞానము - విజ్ఞానము - ప్రజ్ఞ

ఒక రోజు పాద గయా క్షేత్రము లో గురు దత్త దర్శనము నకు వెళ్ళుతున్న సమయము లో గురువు గారు జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞ అని మూడు విషయము ల గురుంచి చెప్పారు.  మూడే మూడు మాటలలో ఏమి అర్ధము అవుతుంది అని గురువు గారిని అడిగాను.  దానికి సమాధానము గా సాధకులు గా మనమంతా ఎన్నో విషయములు ఎవరి ద్వారా నైనా తెలుసుకోవటము గానీ, రకరకములు గా పలు సాధకుల చే విశ్లేషించ బడిన పుస్తకములు చదవటము గానీ చేసి మనము కొంత దనుక తెలుసుకోవటము జరుగుతుంది కదా!  ఏ విషయమైనా పూర్వ కాలములో మన ఋషి సంప్రదాయము మనకు తెలియ చేసిన విషయములనే ఈ కాలము లో మన వ్యావహారిక భాష లో తెలియచెప్తూ అవి వారు కొత్తగా యేవో చెప్తున్నట్లు ఆ విషయము మీద వారికే హక్కులు ఉన్నట్లుగా చెప్పుకోవటము హాస్యాస్పదము.  ఇంకొక విషయము ఏమిటంటే ఉన్న విషయమునే వారి వారి గ్రాహ్య శక్తీ ని బట్టి అర్ధమయే రీతి లో చెప్పటానికి  ప్రయత్నము  చేస్తున్నారు.   అది మనలాంటి సాధకుల కు ఉపయోగ పడుట,  సంతోషించ వలసిన విషయమే కదా.  ఈ రకముగా మనకు తెలిసే విషయ పరిజ్ఞానము అంతా  విజ్ఞాన సముపార్జన క్రిందే వస్తుంది.  ఎందుకంటే అలా  తెలుసుకొన్న విషయ పరిజ్ఞానము అనుభవ పూర్వకముగా తెలుసుకోవటము జ్ఞానము అని పిలవబడుతుంది.  ఆ రకముగా అనుభవపూర్వకముగా తెలుసుకొన్న వ్యక్తి ని ఎవరైనా ఆయన జ్ఞాని  రా అని అంటారు గాని,  ఆయన విజ్ఞాని అని అనరు కదా! ఈ రకముగా అనుభవ పూర్వకముగా తెలుసుకొన్న జ్ఞానము మనము ఎంతవరకూ తెలుసుకోగలిగామో దానిని ప్రజ్ఞ గా చెప్పబడుతుంది అని గురువు గారు  నాకు అర్ధమయేలా చెప్పారు. ఆ విధముగా గురువు గారు ఆ రోజుకు నాకు నేర్పిన విషయము.  ఇది కొంత మంది కైనా ఉపయోగ పడుతుందని నేను భావిస్తున్నాను. 

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

నా  సాధన లో  శ్రీ దత్తాత్రేయ స్వామి గురువు గా ఏక ముఖ  రూపము తో మార్గదర్శకము చేసేవారని  అందరికి ఇంతకు ముందే తెలియచేసాను కదా! దత్తాత్రేయునికి మూడు ముఖములు,  బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని సాంకేతికము గా తెలియడము కోసము,  ఆరు చేతులు అందులో పై రెండు చేతులలో శంఖము, చక్రము,  మధ్య రెండు చేతులలో ఢమరుకము, త్రిశూలము,  క్రింది రెండు చేతులలో జప మాల, కమండలము ల తో ఉత్తరోత్తరా తయారయిన  చిత్రము అని  పెద్దల ద్వారా తెలిసి కొన్నాను.  స్వతహాగా  దత్త స్వామి ఎప్పుడూ ఏక ముఖము తో రెండు చేతులతో తిరుగుతూ ఉంటారు.  దుర్వాస ముని శాపము వలన విష్ణువు భూలోకము లో అవతరించడము జరిగింది అని మన అందరికి తెలిసిన విషయమే.  అన్ని అవతారములకు అవతార పరిసమాప్తి ఉంది గాని దత్తావతారము నకు పరి సమాప్తి లేదు.  ఆయనను పరి పూర్ణ విశ్వాసము, శ్రద్ధా భక్తుల తో పిలిస్తే,  అంత ఎందుకు స్మరిస్తే చాలు  ఆయన వెంటనే ప్రత్యక్షము అవుతాడు.  అదీ కృత యుగములో అనసూయ, అత్రి మహర్షి దంపతులకు మొదట గా త్రిమూర్తులు గానే దర్శనము ఇవ్వటము జరిగిందని మన అందరికి తెలిసిన విషయమే. అనసూయ మాత తనకు త్రిమూర్తులు పిల్లలుగా కావాలని కోరిన కోరిక గా అయితేనేమి, అత్రి మహర్షి నేను దత్తా అను తలచుకొంటే ఇలా త్రిమూర్తులు గా దర్శనము ఇచ్చారేమిటి అని అడిగిన ఆయన ప్రశ్న  కు సమాధానము గా అయితేనేమి, త్రిమూర్తులు తమను తాము ఆ దంపతులకు దత్తము చేసుకోవటము, ఆ పైన బ్రహ్మ, శివుడు వారి అంశలు, విష్ణువు   అంశ అయిన దత్తుని లో ఐక్యము కావించి వారు అంతర్హితులు  కావటము మన అందరికి తెలిసిన విషయమే.  కాబట్టి దత్త స్వామి ఎల్ల వేళలా మన అందరి  లాగా ఏక ముఖము, రెండు చేతుల తో ఉంటాడని అర్ధమవుతోంది కదా! సాధన లో ఒక  సాధకుడిగా మనము  స్వయము గా మొదట అనసూయ గా మారి, అంటే అసూయ లేని తనము అలవారుచుకొని, తరువాత అత్రి గా అయితే, అంటే స్థూలము గా త్రి గుణాలు అయిన రజో, సత్వ, తమో గుణాల ను అధిగమించగలిగితే, సాధకుడు గా మనకు  దత్తుడు దత్తమవుతాడు అని అర్ధమవుతోంది కదా!

Thursday, 1 January 2015

ఏక ముఖ దత్త దర్శనం ............

అప్పటి దాకా కాకినాడ లో  గురువు గారు నాకు జ్యోతిషం నేర్పి, హోమ ప్రక్రియ లఘువుగా ఎలా చేయాలో నేర్పి,  పారమార్ధిక చింతన కై ఆధ్యాత్మికముగా ఎలా నడవాలో మార్గదర్శకము చేసి,  నాకు యోగ సాధన లో ఆయనకు వచ్చిన సూచనల మేరకు ఎప్పటికి అప్పుడు నాకు అందజేసి నన్ను కృతార్ధుని చేసి పది మంది ఔత్సాహికులకు నేర్పమని,  శ్రీ దత్తాత్రేయునే గురువు గా స్వీకరించమని ప్రోత్సహించటము, కాకినాడ నుంచి వృత్తి  పరము గా పిఠాపురము నకు బదిలీ చేయించి, సత్యాన్వేషణ లో నా ఆధ్యాత్మిక పయనము నకు దోహదము అవటము,  నా పూర్వ జన్మల  సుకృతముగా భావిస్తూ, శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను శిష్యుని గా స్వీకరించి నట్లుగా, ఏక ముఖము తో నాకు ఎల్లప్పుడూ దర్శనము ఇవ్వటము, నా అదృష్టము గా భావించి శ్రీ గురు దత్తుని కి సర్వ కాల సర్వ అవస్థల లోను నా ఈ శరీరము సమర్పణము కావించు కోవటము లో అతిశయోక్తి లేదు కదా! ఎల్ల  వేళలా శ్రీ గురు గాయత్రి మనసు లో మననము చేసుకోవటము అలవాటు చేసుకొన్నాను.  నా కుటుంబ సభ్యులకు కూడా శ్రీ గురు గాయత్రి నే చెప్పి ఎల్ల  వేళలా మననము చేసుకోవటము అలవాటు అయింది.  ఆయనే ఎప్పుడు మమ్మలను నడిపిస్తున్నాడని మా అందరి నమ్మకము. ఇక నా సాధన లో ఎంత మంది గురువులను చూసినా,  గురువులకు గురువు, జగద్గురువు అయిన శ్రీ  గురు దత్తుడే నాకు గురువు గా మార్గదర్శకత్వము చేస్తున్నారని నమ్మకము నాకే కాదు మా కుటుంబ సభ్యులకు కలిగింది.  ఇంట్లో పూజా కార్యక్రమము అయిన తరువాత కాలి  నడకన పాదగయా క్షేత్రము నకు వెళ్లి వచ్చే లోపుల ఎన్నో సందేహములకు సమాధానము ఇచ్చేవారు.  జై గురు దత్త