Friday, 31 October 2014

శరీర మాధ్యమ్ ఖలు ధర్మ సాధనం

  పరిణితి చెందుతూ వస్తున్న   జీవికి  ఈ  భూమి పైన  తిరుగాడుటకు   మనుష్య శరీరము   ఒకటి  కావాలి  కదా!  ఆ  రకముగా మనమంతా  భూచరులమని  పిలవబడుతూ ఉంటాం.    షట్  భావ వికారము  లైన  వరుసగా  జాయతే (పుట్టుట),  అస్తి  (పుట్టి ఉండుట),  వర్ధతే  (పెరుగుట),  విపరిణమతే (పండుట),  అపక్షీయతే  (తరుగుట),  వినశ్యతి  (నశించుట)  అని  ధర్మములతో  ఈ శరీరము  కూడి ఉంటుందని   మనము ఇక్కడ గుర్తు  పెట్టుకోవాలి. ఈ దేహము  24  తత్వము  లతో  కలిసి ఉంటుంది.  

Thursday, 30 October 2014

మానవుని పరిణామము

ముందు తెలుసుకున్న విధముగా   మానవుడు  తన  నిజ స్థితిని  మరిచి  ఈ  దేహమే  నేను  అనుకొంటూ  తన  మనసుకు  తోచిన విధముగా  పశు  ప్రవృత్తితో  ప్రవర్తిస్తు   ఉంటాడు.   మానవునికి  జంతువు కన్నా మంచి  చెడు  ఆలోచించి చేసే శక్తిని  ఆ  పరమాత్మ  ఇవ్వడం  జరిగింది.   కానీ  మానవుడు  తను  మానసిక  స్థాయి  లోనే (పశు  స్వభావముతో)  ఎక్కువ  కాలము (జన్మలు)  ఉండి  తనకు  తెలిసి తెలియక  మంచి   చెడు   పనులు  అంటే  కర్మలు  చేస్తూ  తన పాప  పుణ్యాల ఖాతా  తెరుచుకొని  జన్మ పరంపర  పెంచుకొంటాడు.    ఆ రకముగా  పరమాత్మకు   దూరమవుతూ  ఉంటాడు.   అంతః  శత్రువులైన కామ, క్రోధాది  అరిషట్ వర్గాలు మానవుని లోబరుచుకొని  అతనిని  అధో మానసిక స్థాయి కి  జేరుస్తాయి.  

Wednesday, 29 October 2014

మనసు........

మన ఏవ మనుష్యాణాం బంధ మోక్ష కారణాత్  అని వింటూ ఉంటాము.    ఈ  సంసార  సాగరము  తరించుటకు  మన ఏవ  అంటే  మనసు కాదు మనసే అని   అటు బంధములకు గాని  ఇటు మోక్షము నకు గాని  కారణము లేదా ప్రతిబంధకం అవుతుంది. ఈ శరీరమే  నేను అని  అనుకోవటానికి  కారణము  పంచ జ్ఞానేంద్రియములు  మనసుకు లోబడి  వరుసగా   కన్ను   దృష్టితో,  చెవులు   శ్రవణముతో,  ముక్కు వాసనతో,  జిహ్వ  రుచితో,  త్వక్కు  (చర్మము )  స్పర్శతో  కలిసిపోవటమే.    ఒక  వేళ   పంచేంద్రియములు    మనసుతో  కలవక పొతే  ఆయా  ఇంద్రియములు వాటి గుణములతో బహిర్ముఖం  అవటము ఆగిపోతుంది అని  మనకు అర్థం అవుతోంది కదా!

Tuesday, 28 October 2014

మనసు

ఆ విధముగా ముఖ్యముగా  జంతు వర్గములతో సహా మన అందరిలో మనసే ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుంది.    నేను అన్నది  మనసుతో సంపూర్ణంగా  కలిసిపోయి ఈ శరీరమే నేను అనుకోని మనిషి తన నిజ స్వరూపము అయిన  నేను  ని  పూర్తిగా మరచిపోవడము జరుగుతుంది.   జంతూనామ్  నర  జన్మ దుర్లభం  అని  మనము వినే ఉన్నాము.  దీనిని బట్టి   మనిషి  జంతు  స్థితి   నుంచే  పరిణామము  చెంది నట్టుగా  మనకు  అర్ధమవుతున్నది.   ప్రాధమిక స్థాయిలో మనిషిగా  పరిణితి చెందిన వ్యక్తికి  ఉన్న మానసిక స్థాయి  జంతువులో ఉన్న మానసిక  స్థాయి  ఇంచుమించుగా  సమానం  గానే  ఉంటుంది.


 

Monday, 27 October 2014

మనము ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికే జేరాలి ,  ఇది మనము అందరమూ గుర్తు పెట్టుకోవలసిన విషయము.   ఆ   పరమాత్మ  మొదటిగా  తానొకడిగా  ఉండి  అనేకము కావాలి అనుకొని,   ఈ చరాచర జగత్తుని  సృష్టించాడు. ఆ విధముగా జరిగిన సృష్టిలో క్రమముగా ఖనిజ, వృక్ష, జంతు వర్గములు దాటి ఒక జీవి మనుష్య వర్గానికి పరిణామము చెందుతుంది. 

Sunday, 26 October 2014

పంచు కొంటేనే పెరుగుతుంది

 ఒక సాధనలో  గాని,  ఉపాసనలో గాని ఏ ఇద్దరికీ ఒకేలా అనుభవములు కలగక పోవచ్చు కాబట్టి,  ఒకరు ఇంకొకరితో  పంచుకొంటే ప్రయోజనము ఉండదు  అని ఒక ఉద్దేశం కావచ్చు.  అలా కాకుండ అనుభవములు ఒక్కొక్కరికి ఒక్కొక రకముగ  ఉండచ్చు కాబట్టి,  పరస్పరము పంచుకొంటే  ఫలితము ఉండదని అని ఒక అభిప్రాయము కావచ్చు.   ఏ విషయమైనా మన గ్రాహ్య శక్తి మీద ఆధారపడి ఉంటుంది.    అనుభవములు పంచుకొంటే  విద్య పెరుగుతుందని  మా గురువు గారు అంటూ  ఉంటారు.            
 అనుభవములు పంచుకోవచ్చా!

Friday, 24 October 2014

గమనాలు ఎన్నో గమ్యము ఒక్కటే.  విషయము తెలుసుకొనేందుకు రకరకాల పద్ధతులు ఉన్నవి అని అందరికి  తెలిసినదే.   విషయం తెలుసుకొనేందుకు  విభిన్న మార్గాలలో పయనించే వారి వారి అనుభవాలను ఒకరికొకరితొ పంచుకొంటే వారి వారి గమనాలలో ఉపయుక్తముగా ఉండ వచ్చని నా అభిప్రాయము.

Thursday, 23 October 2014

నాందీ ప్రస్థావన

 ఈ  రోజు దీపావళి. అనుకోకుండా  మా చిన్న బావ గారు వచ్చారు. యధాలాపంగా కబుర్లలో బ్లాగుల గురించి ప్రస్తావన వచ్చింది.  మీరు ఏమైనా బ్లాగు   ప్రారంభించారా అని  అడిగారు. నేను దత్తోపాసకుడను కాబట్టి స్వామి పేరున బ్లాగు చాలా రోజులకిందే ప్రారంభించాను అని చెప్పాను. మీరు మొదలు పెట్టి ఎందుకు కొనసాగించ లేదు, మీకు తెలిసిన విషయాలు అందులో పెడితే నచ్చిన వారు చదువుతారు. ఈ రోజు మళ్లిమొదలుపెట్ట వచ్చు కదా అని అన్నారు. నేనైతే ఏదో మొదలు పెట్టాను గాని నా వల్ల  కాదేమో అని అన్నాను.  అదేమిటి నేను నేర్పుతాను మొదలు పెట్టండి అని అన్నారు.  ఈ రోజు అమావాస్య కదా, అమావాస్య సాధారణముగా ఏ పనైన  మొదలుపెట్టడమంటే అలొచిస్తూ ఉంటాము.కాని ఏ పనైనా అనుకొన్న వెంటనే మొదలుపెట్టాలి. మరొక విషయం మనకు తెలిసిందే, దత్త సంప్రదాయంలో గడిచిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే కన్నా వర్తమానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.  రేపటి పని ఇవాళ చేయి, ఈరొజు పని ఇప్పడే చేయి. ప్రతి క్షణము వాడుకోవాలి కాలమన్నది ఎవరికోసము ఆగదు దాని పని అది చేసుకొంటూ పరుగు లు తీస్తూ ఉంటుంది.అందుకని  ఆ బ్లాగునే ఈ రోజు నుంచి వాడుకొందాము అని అనుకున్నాం.

దత్తోపాసన


 దీపావళి శుభాకాంక్షలు