ఆ పరబ్రహ్మము ఏ వికారములు లేక అనగా ఆవిర్భావ తిరోభావములు లేక నిత్యమూ సత్యము గా ఉంది, ఉన్నది, ఉంటుంది అని మనకు అందరకూ తెలిసిన విషయమే. అలాగే నామ రూపాత్మకము లేనిది. అటువంటి నిరాకార నిర్గుణ చైతన్యము ను మనము ఎలా గుర్తించ గలము అంటే, తస్య వాచకః ప్రణవం అని మనకు శ్రుతి ప్రమాణము. దీనిని ఆధారముగా తీసుకొంటే ఆ నిరాకార నిర్గుణ మహా చైతన్యము ను శబ్ద బ్రహ్మము అనగా ప్రణవమే, వాచకము అని అర్ధము అవుతోంది కదా. సత్యాన్వేషణ లో గమ్యము ఒకటే, గమనములు అనేకము. ఇప్పుడు ఆ సత్యాన్వేషణ సాకారము గానా, నిరాకారము గానా అని సత్యాన్వేషకులు గా, మనము ఎవరికి వారమే నిర్ణయము తీసుకోవలసి ఉంది.
ఇక ప్రణవము అనగా ఓంకారము దాని ప్రాశస్త్యము మాండూక్యోపనిషత్ లో చాలా విపులముగా వివరించబడినది. ప్రాధమికము గా ఓంకారము అకార, ఉకార, మకారము, నాద, బిందు, కళాత్మకము అని తెలుసుకొని మనము సాధన చేయవలిసి ఉన్నది. ఓంకారము (సాధన లో) ఏ విధముగా చేయాలో ఒక సారి తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. నోరు తెరిచినప్పుడు అకారము, పెదివిలు మూస్తూ ఉకారము, ముఖము లోపలి పళ్ళ వరుసను కలిపి ఉంచుతూ మకారమును, దవడలను గట్టిగ బిగించి నాదమును పైకి మనకు వినిపించేలా ఉచ్ఛరిస్తూ ఆ నాదమును నాభి స్థానము నుంచి వస్తున్నట్లు గా భావిస్తూ నెమ్మది నెమ్మది గా బ్రహ్మరంధ్ర స్థానము దాకా తీసుకు వెళ్లి అక్కడ సాధ్యమయినంత వరకూ ఉంటూ కేవలము నాసిక రంధ్రముల ద్వారా మెల్లగా వదలుతూ శ్రద్ధ గా వింటూ సాధన చేయాలి. ఈ సాధన లోనే ప్రాణాయామ సాధన మనకు తెలియ కుండానే చేసిన వాళ్ళ మవుతాము. ఈ విధానము లో ఓంకారము ఉచ్ఛారణ చేస్తే ఆ సాధన వల్ల మన శరీరము ఆరోగ్యవంతమై, చాలా రుగ్మతలు లేకుండా ఉంటుంది. ఇంకో విధానము లో నోరు తెరిచినప్పుడు అకారము, పెదివిలు మూయకుండా తెరిచి ఉంచి ఉకారము సాధ్యమయినంత ఎక్కువ సమయము ఉచ్ఛరిస్తూ ఉండి మకారము కొలది సమయము ఉచ్చరిస్తూ, నాద స్థితి లోనికి వెళ్ళకుండా ఆపేయాలి. ఈ విధముగా చేయుట వల్ల సాధకుడి గా మనకు గాక మన చుట్టూ ఎంత దూరమయితే ఆ ఓంకారము వినిపిస్తుందో అంత దూరము వాతావరణ కాలుష్యము తగ్గించడానికి మనము ఉపయోగ పడతాము. ఈ సాధన కొంతమంది కలిసి చేస్తే మనకు మనమే మన చుట్టూ వాతావరణ కాలుష్యము తగ్గించుకొన్న వాళ్ళమై సమాజము నకు మేలు చేసిన వాళ్ళమవుతాము. ఏ విధముగా ధనుస్సు శరానుసంధానము నకు కారణము అగు చున్నదో, ఆ విధము గా ఆత్మానుసంధానము నకు ప్రణవము అనగా ఓంకారము కారణము అగుచున్నది . ప్రణవము ధనుస్సు, జీవాత్మ బాణము, లక్ష్యము పరబ్రహ్మము అయి ఉన్నవి. కనుక ఏమరిపాటు లేక, సాధకుడు జితేంద్రియుడు అయి వైరాగ్యము తో లక్ష్యమగు ఆ పరబ్రహ్మమును ఛేదించ వలయును. అటుల ఛేదించిన తరువాత జీవాత్మ తన గమ్యమైన ఆ పరబ్రహ్మము లో ఏకిభూతము అనగా కలిసిపోవు చున్నది.